దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ ఈరోజు( సోమవారం) ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.
బాంబు స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోహిణి ప్రాంతంలోని వెంకటేశ్వర గ్లోబల్ స్కూల్, శ్రీనివాస పురిలోని లోరిటో కాన్వెంట్ స్కూల్, సిద్దిఖీ నగర్ లోని ఇండియన్ పాఠశాలతో మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి.అయితే ఈ మధ్య కాలంలో పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.
అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇలా బెదిరింపు మెయిల్స్ చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను గుర్తించిన అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.


