పేరెంటింగ్ చెక్
పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. ఫోన్లు వారిని ఏ మూలకు నెడుతున్నాయో గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో చేసే స్నేహం, సంభాషణ, చర్చ మాత్రమే వారిని మంచి దారిలో పెట్టగలదు. ఢిల్లీలో ముగ్గురు ఆడపిల్లలు ‘కొరియన్ గేమ్స్’లో పడి ప్రాణాలు తీసుకున్నారు. మన దేశంలో టీనేజ్ పిల్లలు కె–పాప్ కోసం వెర్రెత్తడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇళ్లల్లోని ప్రేమ, స్నేహాల కొరత వల్లేమోనని చెక్ చేసుకోవడం అవసరం. ఇంతకు కొరియన్ లవ్ గేమ్స్ అంటే ఏమిటి? పిల్లలకు వీటి గురించి ఎలా జాగ్రత్త చెప్పాలి?
‘వాస్తవంలో ఏదీ దొరకకపోతే ఊహలనే వాస్తవం అనుకోవాల్సి ఉంటుంది’
ఇది నిపుణుల మాట.
నిజజీవితంలో తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితులు, ఆటలు, హాబీలు, స్కూల్లో క్లాస్‌మేట్లతో అనుబంధం, టీచర్ల నుంచి వాత్సల్యం... వీటిలో ఏవీ లేని పిల్లలు... టీనేజ్‌లో వచ్చిన వారు ఊహల్లో కాకుండా వేటిలో సాంత్వన వెతుక్కుంటారు.
ఇవాళ దేశాన్నే కాదు... ప్రపంచంలోని యువతను కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ సంగీతం, సినిమాలు, గేమ్స్ ఆకర్షిస్తున్నాయంటే కారణం... అక్కడ ఊహలు చాలా అందంగా ఉంటాయి. అబ్బాయిలు రాకుమారుల్లా ఉంటారు. అమ్మాయిలు రాకుమార్తెలుగా ఉంటారు. వారి మధ్య ప్రేమ అద్భుతంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయిని కాలు కందకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ల జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది... ఈ అద్భుత ప్రపంచం చూసే కొద్దీ టీనేజ్‌లోని అమాయకత్వం, ఆకర్షణ వల్ల యువతీ యువకులు తాము అలాగే ఉన్నట్టూ, తమకూ అలాంటి లోకం కావాలన్నట్టు ఉంటుంది.
మానసిక నిపుణులు ఏమంటున్నారంటే కొరియన్ ప్రపంచాన్ని ఇష్టపడే వారు ఎక్కువగా భ్రమాజనిత ప్రపంచంలో ఉంటున్నారు... వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నారు అని. దీనికి తార్కాణం తాజాగా ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీ విషాదం...
ఢిల్లీలో ముగ్గురు అమ్మాయిలు (ఇద్దరు ఒక తల్లికి, మరొకరు మరో తల్లికి జన్మించారు– తండ్రి ఒకడే) కరోనా సమయం నుంచి కొరియన్ డ్రామాలకు, గేమ్స్‌కు, పాప్‌కు అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో వారి ఐడెంటిటీలు కొరియన్ పేర్లతోనే పెట్టుకున్నారు. వాళ్లలో మధ్య అమ్మాయిని గేమ్స్‌లోలానే ‘లీడర్’గా ఎంచుకున్నారు. మధ్య అమ్మాయి అన్నం తినకపోతే వారు తినరు. మధ్య అమ్మాయి స్కూలుకు వెళ్లొద్దంటే వాళ్లు వెళ్లరు.
తండ్రి, అతని ఇద్దరు భార్యలు కలిసి ఒకే ఫ్లాట్ ఈ పిల్లలతో ఉండగా ఈ ముగ్గురూ ఒక జట్టు, కొడుకు ఒక జట్టుగా మిగిలారు. ‘మా సోదరుడంటే మాకు ఇష్టం లేదు’ అని ఆ అమ్మాయిలు అనడం మొదలుపెట్టారు. తల్లిదండ్రుల పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ ముగ్గురు ఆడపిల్లలు రెండేళ్లుగా స్కూల్‌లు వెళ్లకుండా పూర్తిగా భ్రమల్లోకి వెళ్లిపోయారు. ఏనాటికైనా కొరియా వెళ్లి అక్కడ జీవించాలని వారి కోరికట. ‘మమ్మల్ని కొరియాకు వెళ్లకుండా ఆపగలరా’ అని రాసి తాము నివాసం ఉంటున్న తొమ్మిదో అంతస్తు నుంచి దూకి మరణించారు.
కొరియన్ లవ్ గేమ్స్...
కొరియన్ ఆన్‌లైన్ గేమ్స్ కేవలం బయట ఉండి ఆడేవి కావు. ఆటగాళ్లు ఆ గేమ్‌లో భాగం అవుతారు. ఆ ఆటగాళ్లకు కొరియన్ నేమ్స్ ఇవ్వబడతాయి. అలాగే గేమ్‌లోని ఒక వర్చువల్ (కృత్రిమ) యువకుడు లేదా యువతి గేమ్ ఆడే నిజమైన అమ్మాయి లేదా అబ్బాయికి సోల్ మేట్స్ అవుతారు. ఈ సోల్‌మేట్స్ ఈ నిజమైన అమ్మాయిని అబ్బాయిని చాలా పేంపర్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్‌ల్లో పలకరిస్తారు. రహస్యంగా కబుర్లు చెబుతారు. వీరి మాయలో పడ్డ టీనేజ్ యువతీ యువకులు ఇక మెల్లగా తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరమవుతారు.
ఆ తర్వాత ఈ వర్చువల్ యువకుడు లేదా యువతి నిజ యువకుడు యువతికి టాస్క్‌లు ఇవ్వడం మొదలెడతారు. ఫలానా టైమ్‌లో మేల్కోమని, ఫలానా టైమ్‌లో చాట్‌లో రమ్మని, ఫలానా విధంగా డ్రస్సు వేసుకొని ఫోటోలు పెట్టమని... ఇలా నెమ్మదిగా బానిసలుగా మార్చి స్క్రీన్ టైమ్‌ను దారుణంగా పెంచేస్తారు. పిల్లలు ఇలా ఫోన్‌కు అతుక్కుని పోవడం ఎప్పటికైనా తల్లిదండ్రులకు తెలుస్తుంది. వారు మందలించి ఫోన్ లాగగానే ఒక్కసారిగా భ్రమాత్మక ప్రపంచం మాయమై, డ్రగ్స్ అందని అడిక్ట్స్‌లాగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆత్మహత్యలకు పూనుకుంటారు. ఢిల్లీలో జరిగింది ఇదే. మరో విధంగా చెప్పాలంటే ఈ గేమ్స్‌లోని వర్చువల్ పాత్రలు కూడా ఆత్మహత్యలకు పురిగొల్పవచ్చు.
బ్లూవేల్ తర్వాత...
గతంలో బ్లూవేల్ గేమ్ ఆత్మహత్యలకు పురిగొల్పి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత పరోక్షంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను దివాలా తీయించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఇప్పుడు కొరియన్ ప్రపంచం వారిని అతలాకుతలం చేస్తోంది. వాస్తవానికి కొరియాలో శారీరక కరెక్షన్స్ ఒక తప్పనిసరి. వారు సన్నగా ఉండటానికి అందంగా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అందుకు ‘బ్యూటీ లోన్స్’ ఇచ్చే బ్యాంకులూ ఉంటాయి. పాప్ సింగర్లను సన్నగా కనిపించడం కోసం స్కూల్ వయసు నుంచే ఎంచుకుని ఆహారం ఇవ్వకుండా మాడుస్తారు. దాంతో యుక్తవయసులోనే చనిపోయిన సింగర్స్ ఉన్నారు. ఇన్ని తెర వెనుక వ్యవహారాలుండగా తెర మీద అందంగా కనిపిస్తూ కొరియన్ అబ్బాయిలు, అమ్మాయిలు భారత దేశ టీనేజ్ పిల్లలను పూర్తి భ్రమాత్మక ప్రపంచంలోకి ఈడుస్తున్నారు.
తల్లిదండ్రులూ జాగ్రత్త...
1. పిల్లలతో పదే పదే మాట్లాడండి.
2. జరుగుతున్న విషాదాలను మెల్లగా వివరించండి.
3. ఎవరు చెప్తే వింటారో వారితో చెప్పించండి.
4. కౌన్సిలర్ల సాయంతో వారిని మెల్లగా ఫోన్ నుంచి భ్రమాత్మక జగత్తు నుంచి బయట పడేయండి.
5. విపరీతమైన ప్రేమ, స్నేహితులు, ఆటపాటలు, సొంత ఊర్లూ పరిసరాలు ఇవి వారిని వాస్తవిక ప్రపంచంలోకి తెచ్చేలా చేస్తాయి. ఓపికగా పిల్లలను మార్చుకోండి.
– ఫ్యామిలీ డెస్క్


