'కొలీగ్‌పై ఫీలింగ్స్‌ వస్తున్నాయి.. మా ఆయ‌న‌కు చెబితే..' | How Overcome Good Girl Syndrome full details with case study | Sakshi
Sakshi News home page

'ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్‌ను చంపుకోలేకపోతున్నాను'

Feb 5 2026 6:29 PM | Updated on Feb 5 2026 7:13 PM

How Overcome Good Girl Syndrome full details with case study

డాక్టర్‌గారూ నాదొక చిత్రమైన సమస్య. అసలు ఇది సమస్య అవునో కాదో కూడా తెలియడం లేదు. మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. నేను ఒక బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాను. నాది చాలా కలివిడి స్వభావం. అందరితో స్నేహంగా ఉంటాను. ఎవరినీ నొప్పించను. నా మూలాన ఎవరూ బాధపడకూడదనుకునే స్వభావం వల్ల చాలాసార్లు నేను పరిస్థితులతో రాజీపడుతూ వచ్చాను. ఈ లక్షణాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది నన్ను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.

కొన్ని సంవత్సరాలుగా నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. మా మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి బ్రేకప్‌ అవుతూ మళ్లీ కలిసిపోతూ ఉండటం కామన్‌. మేం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. అతను కూడా బ్యాంక్‌ ఉద్యోగే. ప్రస్తుతం అతనికి వేరే రాష్ట్రంలో పోస్టింగ్‌ రావడం వల్ల నెలకు ఒకసారి మాత్రమే కలుసుకుంటున్నాం. ఆరునెలల క్రితం ఒకబ్బాయి నేను పని చేసే బ్యాంకులో ప్రొబేషన్‌ కోసం జాయిన్‌ అయ్యాడు. అనుకోకుండా అతనికీ నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కలిసి సినిమాలకు వెళ్లినా మేమెప్పుడూ హద్దులు దాటలేదు. అయితే నాకు ఇటీవల కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్‌ వస్తున్నాయి.

ఈ విషయం గురించి నా భర్తకు చెబితే మేమిద్దరం దూరంగా ఉండటం వల్లే అలా వస్తూ ఉండి ఉండచ్చని, అందువల్ల నేను ఉద్యోగం మానేసి అతని దగ్గరకు వెళ్లడం గానీ లేదా తనే ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదనీ అన్నాడు. నాకు నా భర్తను వదిలేయాలన్న ఉద్దేశ్యం లేదు. అలాగని ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్‌ను చంపుకోలేకపోతున్నాను. అతనికీ నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం నా భర్తకు కూడా తెలిసింది. ఒకవేళ నాకు తనతో ఉండటం ఇష్టం లేకపోతే ఆ అబ్బాయితోనే ఉండమని కూడా అన్నాడు. దీంతో నేను చాలా గందరగోళంలో ఉన్నాను. దయచేసి నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 
– ఓ సోదరి, విశాఖపట్నం

మీ ఉత్తరం చదివాక నాకు అర్థం అయిందేమంటే మీరు చెడ్డవారు కానే కాదు, ఇతరుల కోసం మీ అవసరాలను కూడా వెనక్కినెట్టే మనిషని. ఇది చాలామంది మహిళల్లో కనిపించే గుడ్‌ గర్ల్‌ సిండ్రోమ్‌ (Good Girl Syndrome). చిన్న వయసులోనే ఎవరినీ బాధ పెట్టకూడదు, అందరినీ నచ్చాలి. మనవల్ల ఎవరికైనా కష్టం వస్తే అది మన తప్పే అనే భావనతో పెరిగారు. ఇలాంటివారు పెద్దయ్యాక కూడా ఇదే అలవాటును కొన సాగిస్తారు. అది రిలేషన్‌షిప్‌కు కూడా వర్తింపచేసుకోవడం వల్ల ఎప్పుడూ ఇతరుల కోసం అడ్జస్ట్‌ అవుతూ ఉండటంతోనే సరిపోతుంది. మీ గత రిలేషన్‌షిప్‌ అన్నింటిలోనూ ఒక ప్యాటర్న్‌ కనిపిస్తోంది. మీరు ఎదుటి వారికి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మీ బంధం బాగుంటుంది. మీరు మీ అప్రాయం చెప్పినప్పుడో, మీరు అవసరాలు ఉన్నాయని గుర్తు చేసినప్పుడో ఆ బంధం కూలిపోతుంది. దీనివల్ల మీరు మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. నాలాగా నేను ఉంటే నన్ను వదిలేస్తారేమో... ఒంటరి అవుతాననే భయం మిమ్మల్ని పదే పదే కాంప్రమైజ్‌ అయ్యేలా నడిపించింది.

ఇక మీ ప్రస్తుత సమస్య విషయానికొస్తే మీ ఎమోషనల్‌ సైకిల్‌ మీ వివాహ బంధంలో కూడా కొనసాగింది. అయితే మీ భర్త మెచ్యూరిటీ వల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఒక స్థిరత్వం ఏర్పడింది. అదే సమయంలో తను మీకు దూరంగా ఉండటం మీలో ఒక శూన్యాన్ని తీసుకొచ్చింది. ఆ ఖాళీని పూడ్చుకోవడం కోసం మీకు ఆఫీసులో పరిచయం అయిన అబ్బాయికి దగ్గరయ్యారు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఎమోషనల్‌గా ఆధారడపడటం అనే మీ గుణం వల్ల మీరు అతనికి ఆకర్షితులయ్యారు. కాని అది నిజమైన ప్రేమ కాకపోవచ్చు. మీలో బార్డర్‌లైన్‌ పర్సనాలిటీ లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మీలో చిన్న వయసు నుంచి ఎప్పుడూ ఒక రకమైన ఎమోషనల్‌ ఎంప్టీనెస్‌ ఉంది. దీన్ని ఎవరోఒకరి తో భర్తీ చేస్తున్నారు. దీనికోసం ఎవరో ఒకర్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎన్నుకున్నారా అనేది ప్రశ్న! మీ మనసు ఇప్పుడు ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంది.

ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. సమస్య నుంచి బయటపడే మార్గం వెతకండి. వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్‌ని, ఒక క్లినికల్‌ సైకాలజిస్టును కలిస్తే మీలోని ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో నేర్పిస్తారు. మీ జీవితం మీద ఒక స్పష్టత వచ్చేలా సహాయపడతారు. విష్‌ యు ఆల్‌ ది బెస్ట్‌!

- డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు 
పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement