ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళం
రెండో విడత నుంచి స్ట్రే వెకెన్సీ వరకు వరుస తప్పిదాలు
సాక్షి, అమరావతి: మెరిట్ లిస్ట్‌లో ముందున్న విద్యార్థులను తప్పించి వెనకున్న వారికి సీట్‌లు కేటాయించడం.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్‌వోఆర్)కు విరుద్ధంగా సీట్లు భర్తీ చేయడం.. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన తర్వాత.. ‘అయ్యో... సాంకేతిక తప్పులు దొర్లాయి. సరిచేస్తున్నాం’ అంటూ బుకాయించడం.. ఇలా రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం ఎన్నడూ లేనంత గందరగోళంగా మార్చేసింది. ఎంబీబీఎస్ కనీ్వనర్ కోటా స్ట్రే వేకెన్సీ (మిగిలిపోయిన సీట్ల భర్తీ) సీట్ల కేటాయింపు జాబితా ఆదివారం రాత్రి హెల్త్ వర్సిటీ ప్రకటించింది. ఈ కేటాయింపులను నిలిపేస్తున్నట్టు సోమవారం ఉదయం వర్సిటీ స్పష్టం చేసింది. స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో ఎనిమిది సీట్లను భర్తీ చేస్తే, అన్ని సీట్లు మెరిట్‌కు విరుద్ధంగా ఉండటం కౌన్సెలింగ్ ప్రక్రియలో వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. రెండు, మూడో విడతలోనూ ఇదే తంతు చోటుచేసుకోవడం గమనార్హం.
స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో అవకతవకల తీరిది..
⇒ స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో తొలుత మెరిట్‌లో ముందున్న విద్యార్థులకు అన్యాయం చేస్తూ వెనకున్న విద్యార్థులకు వర్సిటీ సీట్లను కేటాయించింది.
⇒ ఆదివారం ప్రకటించిన జాబితాలో నీట్‌లో 486 మార్కులు వచ్చిన విద్యార్థికి ఓసీ జనరల్ విభాగంలో విశాఖ ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. వాస్తవానికి ఓయూ రీజియన్‌కు చెందిన ఓ విద్యార్థి 487 మార్కులతో మెరిట్ లిస్ట్‌లో ముందు ఉన్నారు. సదరు విద్యార్థిని సైతం పక్కనపెట్టడమే కాకుండా మరో ఆరుగురు విద్యార్థులకు తరువాత ఉన్న 486 మార్కులు వచ్చిన వారికి ఎన్‌ఆర్‌ఐ సీట్ కేటాయించారు.
⇒ చిత్తూరు జిల్లా అన్నాగౌరి కళాశాలలో సీట్‌ను 486 మార్కులు వచ్చిన విద్యార్థికి కట్టబెట్టేశారు. సదరు విద్యార్థి కంటే మెరిట్ లిస్ట్‌లో 37 మందికంటే ముందు ఉండే 487 స్కోర్ చేసిన విద్యార్థికి దక్కాల్సి ఉండగా వర్సిటీ ఇందుకు విరుద్ధంగా కేటాయించింది.
⇒ అన్యాయానికి గురైన పలువురు విద్యార్థులు సీట్ల కేటాయింపులో తప్పులు దొర్లాయంటూ ఆదివారం రాత్రి వర్సిటీ ప్రతినిధులను ఫోన్‌లలో సంప్రదించగా కేటాయింపులన్నీ పక్కాగా జరిగాయని, ఇక మార్పులేమీ ఉండబోవని బదులిచ్చినట్టు పలువురు విద్యార్థులు వెల్లడించారు.
⇒ అయితే ఎనిమిది సీట్లు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు పోటెత్తడంతో ‘సాంకేతికంగా పొరపాట్లు జరిగాయంటూ’ వర్సిటీ సోమవారం ఉదయానికి ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పులను సవరించుకుని రివైజ్డ్ జాబితాను విడుదల చేశారు.
రెండు, మూడో దశల్లోనూ ఇదే తంతు ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు ప్రక్రియలో ఇంత గందరగోళం ఎన్నడూ లేదని వర్సిటీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రెండు, మూడో దశ కౌన్సెలింగ్‌లోనూ తప్పులు దొర్లాయి. ఈ నెల తొమ్మిదిన మూడో విడత సీట్లు కేటాయిస్తూ వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఇందులో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రెండో విడత కేటాయింపుల్లో లోపాలు బయటపడ్డాయి. దీంతో ‘ఎన్‌సీసీ విభాగంలో సాంకేతిక తప్పిదాలు తలెత్తాయి. వాటిని సరిచేస్తాం’అంటూ తొలుత చేపట్టిన కేటాయింపులను నిలిపేశారు. మరుసటి రోజు సవరించిన సీట్ల కేటాయింపు జాబితాను వర్సిటీ విడుదల చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అసహనం, అనుమానం
వరుసగా లోపాలు వెలుగు చూడటంతో కౌన్సెలింగ్ ప్రక్రియపైనే విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ వార్షిక పరీక్షల నిర్వహణలోనే కాకుండా ప్రవేశాల కౌన్సెలింగ్‌లోనూ బాబు సర్కార్ విఫలమయ్యిందని విమర్శలు వస్తున్నాయి. ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తో పాటు, మలి్టపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ)ల్లో పెద్ద ఎత్తున గోల్‌మాల్ చోటు చేసుకుంది. గద్దెనెక్కిన వెంటనే వర్సిటీకి పేరు మార్పు.. పీపీపీలో సర్కార్ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడంలో చూపిన శ్రద్ధ పాలనపై ప్రభుత్వ పెద్దలు చూపడం లేదు. దీంతో వైద్య విద్య వ్యవస్థ గాడి తప్పుతోందని ఆరోపణలు వస్తున్నాయి.


