జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా శివార్లలోని ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం నుంచి మరో 15 మందిని అక్కడి సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తూర్పు జకార్తాలోని ‘కాసిహ్ సయాంగ్’ వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో ఆశ్రమంలోని వృద్ధులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
తూర్పు జకార్తా అగ్నిమాపక, రక్షణ విభాగం అధిపతి గటోట్ సులేమాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చనిపోయిన 16 మందిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా 65 నుండి 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారని’ ఆయన వివరించారు.
ప్రమాదం నుంచి బయటపడిన 15 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వంటగదిలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. వృద్ధాశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జకార్తా తాత్కాలిక గవర్నర్ హెరు బూడి హర్తోనో సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ?


