జలంధర్: ఉపాధి కోసం రష్యా వెళ్లిన భారత యువకుల విషాదాంతం వెలుగు చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతూ 10 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు వెల్లడించడం సంచలనంగా మారింది. తన సోదరుని ఆచూకీ కోసం రష్యా వెళ్లిన పంజాబ్‌లోని జలంధర్ జిల్లా గోరయాకు జగదీప్ కుమార్ ఈ వివరాలను మీడియా ముందు వెల్లడించారు.
జగదీప్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రష్యాలో మరణించిన 10 మందిలో ముగ్గురు పంజాబ్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ఏడుగురు ఉత్తరప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. రష్యా సైన్యం అందించిన అధికారిక పత్రాల ఆధారంగా వీరి మరణాలను జగదీప్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా రష్యా సైన్యం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాలను జగదీప్ కుమార్ రాజ్యసభ సభ్యుడు సంత్ బల్బీర్ సింగ్ సీచేవాల్ కార్యాలయానికి అందజేశారు. మరణించిన వారితో పాటు మరో నలుగురు భారతీయులు కూడా రష్యాలో గల్లంతయ్యారని ఆయన పేర్కొన్నారు.
జగదీప్ సోదరుడు మన్ దీప్ కుమార్ గత ఏడాది రష్యాకు వెళ్లారు. ఒక ట్రావెల్ ఏజెంట్ మోసం కారణంగా ఆయన రష్యా సైన్యంలో చేరాల్సి వచ్చింది. 2024, మార్చి నుంచి కుటుంబ సభ్యులకు మన్ దీప్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. కాగా తన సోదరునితో పాటు అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులను రక్షించాలని కోరుతూ జగదీప్ జూన్ 29, 2024న రాజ్యసభ సభ్యుడు సీచేవాల్‌ను కలిశారు. అనంతరం తన సోదరుని ఆచూకీ కోసం జగదీప్ స్వయంగా రెండుసార్లు రష్యాలో పర్యటించారు. మొదటిసారి 21 రోజులు, రెండోసారి రెండు నెలల పాటు అక్కడే ఉండి సమాచారాన్ని సేకరించారు.
భాషా సమస్యలతో పాటు ఇతర అడ్డంకులు ఎదురైనప్పటికీ, రష్యా సైనిక అధికారుల ద్వారా తన సోదరుడితో సహా ఇతర భారతీయ యువకుల స్థితిగతులపై ఆయన పలు కీలక పత్రాలను సేకరించగలిగారు. ఈ ఘటనపై ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్ స్పందిస్తూ విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. రష్యాలో మృతిచెందిన భారతీయ యువకుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అమాయక యువకులను మోసం చేసి, యుద్ధ భూమికి పంపుతున్న ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భారత యువకులు రష్యా సైన్యంలో చేరకుండా దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా?


