‘స్టార్ట్‌’కి చెదలు! | Sakshi Editorial On Arms race of USA, Russia and START agreement | Sakshi
Sakshi News home page

‘స్టార్ట్‌’కి చెదలు!

Feb 12 2026 12:58 AM | Updated on Feb 12 2026 12:58 AM

Sakshi Editorial On Arms race of USA, Russia and START agreement

అడిగేవారు లేకపోతే, జవాబుదారీతనం కొరవడితే... ఎక్కడైనా ఇష్టారాజ్యం తప్పదు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు అలాగే వ్యవహరిస్తున్నాయి. ఎవరేమనుకుంటే ఏమిటన్నట్టు రెచ్చిపోతున్నాయి. అణ్వాయుధాల వల్ల భూగోళానికి పెను ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ప్రజానీకం దశాబ్దాల పాటు ఒత్తిళ్లు తెచ్చిన పర్యవసానంగా ఆ రెండింటి మధ్యా 1991లో మొదటిసారి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు(స్టార్ట్‌)–1 ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో 2010లో ‘న్యూ స్టార్ట్‌’ ఒప్పందం సాకారం కాగా, దానికి ఈనెల 5తో నూకలు చెల్లాయి. ఆ విషయంలో మళ్లీ చర్చలు మొదలెట్టాలని, సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి రావాలని రెండేళ్లుగా పలువురు నిపుణులు, ప్రపంచ శాంతిని కాంక్షించేవారు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఆయన స్థానంలో నిరుడు జనవరిలో వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌కు సైతం ఈ సంగతి తెలుసు. 

దాన్ని గురించి మీడియా ప్రశ్నిస్తే ‘ముగిసిపోతుందా...పోనీయండి. దాని స్థానంలో మరొకటి కుదుర్చుకుంటాం’ అన్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా చర్చల కోసం చేసిందేమీ లేదు. కొత్త ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అడపా దడపా చెప్పకపోలేదు. కానీ ఉక్రెయిన్‌లో ఆయన సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఆ మాటల్లోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అమెరికా పోకడలూ దానికి భిన్నంగా ఏమీలేవు. ‘న్యూ స్టార్ట్‌’ ముగియటంతో ఇరుపక్షాలనూ కట్టిపడేసే అంతర్జాతీయ ఒప్పందమేదీ ఉనికిలో లేకుండా పోయింది. ఇకపై రెండు అగ్రరాజ్యాలూ ఆయుధాలు పోగేసుకున్నా, పరస్పరం కయ్యానికి కాలు దువ్వుకున్నా, అణ్వాయుధాల్ని ప్రయోగించే సాహసం చేసినా... ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తూ ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాలకూ, వాటిని సమర్థిస్తున్నవాటికీ జవాబుదారీతనం, భయభక్తులు, వెరపు వంటివి మాయ మయ్యాయి. 

ఒకప్పుడు ప్రపంచం ఇంతకన్నా కాస్తయినా మెరుగ్గా ఉండేదనటానికి వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందం(సాల్ట్‌) గురించిన చర్చలే ఉదాహరణ. ఆ ఒప్పందం సాకారం కాలేదు. ఒకవేళ అలా అయినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే ఇరు దేశాలూ పోగేసుకున్న ఆయుధాలు ఇక పెరగకుండా చూడటం తప్ప ఆ చర్చలు సాధించేది పెద్దగా ఏమీ ఉండేదికాదు. కానీ అంతకన్నా మెరుగైన ‘స్టార్ట్‌–1’ కుదిరింది. అణ్వాయుధం, లేదా వేరే బాంబును మోసుకేళ్లే సామర్థ్యమున్న క్షిపణులను (వార్‌హెడ్‌లను) 6,000కు తగ్గించటం, వాటి లాంచర్ల (వాహనాల) సంఖ్యను 1,600కు కుదించటం అది సాధించిన ఘనవిజయం. 2010లో కుదిరిన ‘న్యూ స్టార్ట్‌’ కూడా చెప్పుకోదగ్గ ముందడుగు. దానివల్ల వార్‌హెడ్‌ల సంఖ్య 1,550కి, లాంచర్ల సంఖ్య 700కు తగ్గాయి. పరస్పరం డేటా మార్పిడి, నోటిఫికేషన్ల విడుదల, క్షిపణుల్ని మోహరించిన ప్రాంతాల తనిఖీలకు అనుమతించటం అందులో ఉన్నాయి. నిజానికి ఈ
రెండింటికీ మధ్య 1993లో ‘స్టార్ట్‌–2’ గురించి చర్చలు సాగాయి. బహుళ సంఖ్యలో వార్‌హెడ్‌లను ప్రయోగించగల క్షిపణులను నిషేధించాలన్నది ఈ చర్చల ఆంతర్యం. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా ముగిసిపోయాయి. 

ఇప్పటికే అమెరికా, రష్యాల మధ్య చడీచప్పుడూ లేకుండా ఆయుధ పోటీ సాగుతోంది. తమదగ్గరున్న అణ్వాయుధాలకు కృత్రిమ మేధ(ఏఐ)ను జతచేసి, వాటి శక్తిని అనేక రెట్లు పెంచుకుంటున్నాయి. గంటకు 6,437 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల రకరకాల క్షిపణులు వచ్చేశాయి. వాటిని విడివిడిగా గురిచూసి కొట్టడం అసాధ్యమని తేలాకే ట్రంప్‌ ‘గోల్డెన్‌ డోమ్‌’ పేరుతో కొత్త పాట అందుకున్నారు. ఆ ‘బంగారు గుమ్మటం’ అమెరికాను ఎంతవరకూ రక్షిస్తుందో నిజంగా ఏమైనా జరిగితే తప్ప ఎవరికీ తెలియదు. మొత్తానికి ఇద్దరి వద్దా అటూ ఇటూగా చెరో 5,000 అణ్వాయుధాలున్నాయి. మిగతా దేశాలన్నిటి వద్దా  అందులో సగం కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ప్రజానీకం, ముఖ్యంగా ఆ రెండు దేశాల్లోని ప్రజలూ తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకురావాలి. లేనట్టయితే ప్రపంచం క్షణక్షణ గండంగా బతుకీడ్చక తప్పదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement