కూటమి కోరల్లో కాలకూటం! | Sakshi Editorial On Chandrababu coalition govt On Tirupati laddu prasadam | Sakshi
Sakshi News home page

కూటమి కోరల్లో కాలకూటం!

Feb 8 2026 12:57 AM | Updated on Feb 8 2026 12:57 AM

Sakshi Editorial On Chandrababu coalition govt On Tirupati laddu prasadam

జనతంత్రం

‘‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ’’. చిత్తం శివుడి మీద – భక్తి చెప్పుల మీద నిలుపుకొనే దొంగ భక్తుల ముసుగుల్ని మహాకవి వేమన ఏనాడో తొలగించాడు. ఇప్పుడు సమస్య కొందరు వ్యక్తులు, కొందరు భక్తులు వేసుకునే ముసుగుల గురించి కాదు. ఏకంగా ప్రభుత్వ వ్యవస్థే వేసుకున్న ప్రమాదకరమైన ముసుగు గురించి! ముసుగులు వేసుకున్న ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం కంటే దారుణమైన చెత్తబుద్ధి తాపంతో బుసకొడుతున్నది. రాజకీయంగా స్థిరపడటానికి మతాన్ని అస్త్రంగా మలుచుకోవాలనే నిశ్చయానికి కూటమి వచ్చేసిందని మొన్నటి కూటమి ప్రెస్‌మీట్, అందులో ముఖ్య నేత మాటలు రుజువు చేస్తున్నాయి. 

ఎన్నికల హామీలు వెక్కిరిస్తున్నాయి. పాలనా వైఫల్యం వెన్నాడుతున్నది. అప్పుల పర్వతం పెరిగిపోతున్నది. అభివృద్ధి పేరుతో జపిస్తున్న తూతూమంత్రానికి తుప్పిళ్లు తప్ప చింత కాయలు రాలడం లేదు. అదానీ – గూగుల్‌ డేటా సెంటర్‌కు మనం ఇరవై వేల కోట్లు రాయితీలిస్తే గూగుల్‌ వాళ్లు బెంగ ళూరులో 20 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒకటి రెండు పెద్ద కంపెనీల పేర్లు చెప్పి అదే వరసలో ఊరూ పేరూ లేని ‘ఉర్సా’లకు భూసంతర్పణ చేస్తున్నాం. దానివల్ల సాధించబోయే అభివృద్ధి దృశ్యం త్వరలోనే ముందుకు రాబోతున్నది. అమరావతి పేరుతో తలపెట్టిన లక్షల కోట్ల జూదం ఒక ‘మాన్యుమెంటల్‌ ఫెయిల్యూర్‌’గా అల్లంత దూరంలో భయపెడుతున్నది. ఈ పరిస్థితుల్లో కూటమి సర్కార్‌కు కిం కర్తవ్యం? ‘‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె.... రావే ఈశ్వరా కావవే వరద’’. ఇక దేవుడే దిక్కని కూటమి నిర్ణయానికి రావడంలో ఆశ్చర్యమేమున్నది!

‘పరిత్రాణాయ సా«ధూనాం... సంభవామి యుగేయుగే’ అన్నాడు కృష్ణపరమాత్ముడు. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మా ర్గులను శిక్షించడానికీ తాను వస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సన్మార్గులూ విశ్వసిస్తారు. దుర్మార్గులూ నమ్ముతారు. కూటమి సర్కార్‌కు ఇక్కడ దేవుడు దిగిరావలసిన అవసరం లేదు. దేవదేవుని పేరు, ఆ పేరు చుట్టూ ఉండే మతవిశ్వాసాలను కబ్జా చేసుకుంటే చాలు! కూటమి సర్కార్‌ ప్రస్తుతం అదే పనిలో ఉన్నది. తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చంద్రబాబు వ్యాఖ్యానాలు చేశారు. 

పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేశారని మొదట ఆరోపించారు. ఆయన ఆరోపణపై అప్పట్లోనే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ఒకవైపు ‘సిట్‌’ను ఏర్పాటు చేసి, దాని దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఇలా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మంచిది కాదని మందలించింది.

ముఖ్యమంత్రి రాజకీయ ఉద్దేశాలను గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం నిష్పాక్షిక దర్యాప్తునకు స్వతంత్ర బృందమే మేలని భావించింది. సీబీఐ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నిధులు కూడా ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియ మించింది. ఈ బృందం దర్యాప్తు చేసి ఈమధ్యనే అభియోగ పత్రాన్ని (ఛార్జిషీట్‌) న్యాయస్థానం ముందుంచింది. చంద్ర బాబు, ఇతర కూటమి పెద్దలు, యెల్లో మీడియా కలిసి భువన భువనాంతరాల్లో చాటింపు వేయించినట్టుగా జంతు కొవ్వు కలవలేదని తమ దర్యాప్తులో తేలినట్టు ‘సిట్‌’ స్పష్టం చేసింది. అయినా సరే, జంతు కొవ్వు కలిసినట్టు తేలిందనే ప్రచారాన్ని కూటమి ఆపలేదు. పైగా ఊరూరా, వాడవాడనా ఫ్లెక్సీలు కూడా వేసింది. ఇది నూటికి నూరుపాళ్లు కోర్టు ధిక్కరణ! వేంకటేశ్వర స్వామినే రాజకీయాల్లోకి లాగడానికి భయపడనివాళ్లు కోర్టు ధిక్కరణకు భయపడతారా? తాజాగా ఆ నెయ్యిని బాత్‌ రూమ్‌లు కడిగే కెమికల్‌తో తయారు చేశారనే ప్రచారాన్ని చంద్ర బాబు ప్రారంభించారు. ఆ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడే పద్ధతి ఈ విధంగానే ఉంటుందా?

సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్‌’ తన ఆకాంక్షల మేరకు ఛార్జిషీట్‌ వేయలేదు కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం మరో కమిషన్‌ వేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు, దాంతోపాటు బాత్‌రూమ్‌లు కడిగే కెమికల్‌ కలిసిందనే రిపోర్టు వచ్చేవరకు చంద్రబాబు కమిషన్లను, కమిటీలను నియమిస్తూనే ఉంటారన్న మాట! అయితే ఇప్పుడు వివాదానికి కారణమైన నెయ్యి శాంపిల్‌ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసు కున్నదే! అదే విచిత్రం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నెయ్యి శాంపిల్‌ను పరీక్షిస్తే జగన్‌ కాలంలో జరిగిన కల్తీ కనిపించాలని కూటమి సర్కార్, యెల్లో మీడియా కోరుకుంటున్నాయి.

వివాదానికి కేంద్ర బిందువైన భోలేబాబా డెయిరీ వాళ్లు అంతకుముందు చంద్రబాబు సర్కార్‌ ఉన్నప్పటి నుంచే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో (ఇతర డెయిరీల ద్వారా) తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఇది ఆన్‌ రికార్డ్‌! చంద్రబాబు కాలంలో కిలో నెయ్యికి రూ. 297 వసూలు చేసే వాళ్లు. ప్రభుత్వం మారిన తర్వాత 319 నుంచి 348 రూపాయల వరకు ధర పెరిగింది. ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించిన పవన్‌ కల్యాణ్‌ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. 

నెయ్యి ట్యాంకర్లు తొలుత తిరుమలకు వెళ్లకుండా తిరుపతిలోని మార్కెటింగ్‌ గోడౌన్‌కు చేరుకుంటాయి. మార్కెటింగ్, విజిలెన్స్, ప్రొక్యూర్‌మెంట్‌ అధికారుల సమక్షంలో శాంపిల్‌ తీస్తారు. ఈ శాంపిల్‌ను తిరుమలలోని నాణ్యతా పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. వారు ఓకే అన్న తర్వా తనే నెయ్యి ట్యాంకర్‌ తిరుమలకు బయల్దేరుతుంది. నాణ్యత లేదని తేలితే ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు. చాలాకాలంగా ఇటువంటి పకడ్బందీ విధానం అక్కడ అమల్లో ఉన్నది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి ట్యాంకర్లను నాణ్యత లేని కారణంగా 16 సార్లు వెనక్కు పంపి నట్టు రికార్డులు చెబుతున్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కు పంపారు. దర్యాప్తులో తేలిన ఆందోళనకరమైన విషయం ఏమిటంటే – ఇలా వెనక్కు వెళ్లిన నాలుగు ట్యాంకర్లు ఒకచోట మాటువేసి ఉండి, కంపెనీ పేరు మార్చుకొని ‘పరీక్షలు’ నెగ్గి తిరుమలకు చేరుకున్నాయి. ఈ ట్యాంకర్లలో తీసిన శాంపిల్సే ఇప్పుడు దేశవ్యాప్త సంచలనాలకు కారణమయ్యాయి. 

చంద్రబాబు తొలిదఫా అధికారంలో ఉన్న సమయంలోనే బోలేబాబా టెండర్‌ను అనిల్‌ సింఘాల్‌ అనే ఐఏఎస్‌ అధికారి ఖాయం చేసుకొచ్చారు. అయనప్పుడు టీటీడీ ఈవోగా పని చేశారు. ఈ శాంపిల్స్‌ వివాదాస్పదమైన నేపథ్యంలో కూడా మరోసారి ఆయన్నే ఈవోగా నియమించారు. దీని భావమేమి తిరుమలేశా? వైసీపీ సర్కార్‌ హయాంలో తిరస్కరించిన 16 ట్యాంకర్లలో ఏ ఒక్కటీ తిరిగి కంపెనీ పేరు మార్చుకొని వచ్చిందనే దాఖలా లేదు. అప్పుడు లడ్డూల్లో వాడిన నెయ్యి శాంపి ల్స్‌ను  పరీక్షించకుండానే మరి ఆ కాలమంతా కల్తీ జరిగిందని ఎలా చెబుతారు?

చంద్రబాబు హయాంలో భోలేబాబా టెండర్‌ ఖరారైంది. ఈ టెండర్‌ను ఖరారు చేసిన అధికారి అప్పుడు ఈవోగా పని చేశారు. అప్పుడు కేవలం 297 రూపాయలకే ఆ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వైసీపీ హయాంలో 16 సార్లు వెనక్కు పంపించారు. చంద్రబాబు హయాంలో శాంపిల్‌ తీసి వెనక్కి పంపిన ట్యాంకర్లు మళ్లీ వచ్చి తిరుమలకు వెళ్లాయి. దాని శాంపిల్స్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తర్వాత అప్పుడు టెండర్‌ ఖరారు చేసిన అధికారే మళ్లీ ఈవోగా వచ్చారు. 

ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏమర్థమవుతుంది? చూపుడు వేలు ఏ వైపు తిరుగుతుంది? తిరుమల లడ్డూను వివాదాస్పదం చేయడం ద్వారా ప్రతిపక్షానికి బురద పూయాలనే సంకల్పం తప్ప మరోటి  కన్పించడం లేదు. మొన్న గురువారం నాటి ఓ శుభముహూర్తాన, కూటమి నేతలంతా కొలువుదీరిన మీడియా సమావేశంలో ఎటువంటి దాపరికం లేకుండా ఈ సంకల్పాన్ని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.

తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఒక మహాకుట్ర జరిగిందని, అందులో భాగంగానే లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ చేశారని తాను కనిపెట్టినట్టుగా ఆయన చెప్పుకున్నారు. దీన్ని హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగా ఆయన భావించారు. తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యతను స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామే తనకు అప్పగించారని ఆయన చెప్పారు. ఖతమ్‌. బారా ఖూన్‌ మాఫ్‌. అఖిలాంధ్ర జనులారా... చంద్రబాబు నుంచి ఇంకేమీ ఆశించకండి. ఆయన స్వామివారి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉంటారు. హిందూ ధర్మాన్ని ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో ఆయన ఒకే ఒక్క నిర్వచనాన్ని ప్రవచించారు. ‘‘మన ధర్మం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో జరుగు తాయి. మనకు కుటుంబ విలువలుంటాయి. పెళ్లయిన తర్వాత విడాకులివ్వడం మన ధర్మం ప్రకారం సరైంది కాదు’’ అంటూ మాట్లాడారు. ఈ నిర్వచనానికి కూటమిలో ఏకాభిప్రాయం ఉన్నదో లేదో తెలియదు.

తిరుమల పవిత్రతపై, హిందూ ధర్మంపై ప్రతిపక్ష పార్టీ కుట్ర చేస్తున్నదని ఆయన సారాంశం. దానికి వ్యతిరేకంగా కూటమి తోడ్పాటుతో పోరాటం చేస్తారట! ఎనభై ఐదు శాతం మంది హిందువులున్న రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే, హిందూ దేవుళ్ల పవిత్రతను దెబ్బతీయడానికి పనిచేస్తుందా? ఇంగిత జ్ఞానమున్నవాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా? మాట్లాడితే నమ్ము తారా? ప్రతిపక్ష నేతకు లభిస్తున్న జనాదరణను తట్టుకోలేక నిస్పృహతో కూడిన మాటలుగానే వాటిని భావించాలి. ఈ నిస్పృహలో ఆయన ప్రజాస్వామిక విలువల్నీ, రాజ్యాంగ ధర్మాన్నీ తుంగలో తొక్కుతున్నారు.

విజయవాడ నగరంలో డజన్లకొద్దీ ఆలయాలను చంద్ర బాబు కూల్చివేస్తే వాటిని పునర్నిర్మించిన ధార్మికుడు, దేశ వ్యాప్తంగా వందలాది శ్రీవారి ఆలయాలను నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి. వేలాది గోవుల్ని అక్రమ రవాణా చేస్తుంటే, వాటిని వధించి గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే, ఈ వ్యాపారంలో ఆయన పార్టీ వారే భాగస్థులుగా ఉన్నా కఠిన చర్యలకు పూనుకోని వ్యక్తి చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుంచి దేశవాళీ గోసంపదను సమీకరించి తిరుమ లలో గోశాలను ఏర్పాటు చేసి, స్వయంగా తన నివాసంలోనే గోవుల్ని పోషించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఆలయ రథం కాలిపోతే పట్టించుకోని పాలకుడు చంద్రబాబు. 

అంతర్వేదిలో ఓ రథాన్ని ఎవరో దుండగులు తగలబెడితే, వెంటనే సరికొత్త రథాన్ని తయారు చేయించడమే కాక, ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాసిన పారదర్శక పాలన జగన్‌ది. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మం విషయంలో జగన్‌ చిత్తశుద్ధిపై డజన్‌కిపైగా ఉదాహరణలివ్వవచ్చు. చంద్రబాబు పోటీయే కాదు.

ఒక దేవుడిని విశ్వసించేవాడు, నమ్మేవాడు అందరు దేవుళ్లనూ ఆరాధిస్తాడు. ఇది ప్రాథమిక సూత్రం. అన్యమత స్థులెవరూ ఇతరుల ఆరాధనా స్థలాలపై దాడులు చేయరు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరుండే ఉన్మాదులు తప్ప! ఆకతాయిలు తప్ప! దొంగలు తప్ప!! ఇటువంటి వాళ్లు అన్ని చోట్లా, అన్ని మతాల్లో, అన్ని సమూహాల్లో ఉండవచ్చు. వాళ్లు చేసే చెదురుమదురు ఘటనల్ని గుదిగుచ్చి మతంపై దాడిగా ప్రచారం చేయడం దుర్మార్గమైన రాజకీయం. ప్రజల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనే ఎత్తుగడ. రాజకీయ మనుగడ కోసం విసిరే ఆఖరి పాచిక. ఇటువంటి ఎత్తులకు ఆంధ్ర ప్రజలు పడిపోతా రనుకోవడం అవివేకం.

అన్యమతస్థుల ఆలయ ప్రవేశానికి ఆంక్షలుండాలనీ, షరతులుండాలనీ, అన్య మతస్థులెవరూ అక్కడ పనిచేయకుండా చూస్తామనీ కూడా చంద్రబాబు చెప్పారు. ఇదేం గొప్ప విషయమా? సుప్రసిద్ధ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్‌కు కాశీ విశ్వేశ్వరునితో ఉన్న అనుబంధం లోకానికి తెలిసిందే కదా! ‘అమెరికాలో స్థిరపడితే జీవితాంతం సకల సౌక ర్యాలు కల్పిస్తాన’ని ఓ సంపన్నుడు బిస్మిల్లా ఖాన్‌ను అడిగాడట! ‘సరే, గంగానదిని, విశ్వనాథుడినీ కూడా ఇక్కడికి తేగలవా? అలా అయితే ఇక్కడే ఉంటా’నని చెప్పాడట! సిరిసంపదల కంటే విశ్వనాథుడే మిన్నగా ఆయన భావించాడు. 

మన తెలుగు వాడు నాదస్వర బ్రహ్మ షేక్‌ చిన మౌలానాను శ్రీరంగం దేవ స్థానం ఆస్థాన విద్వాంసుడిగా గౌరవించిన సంగతి మరిచి పోదామా? గంధర్వ గాయకుడు యేసుదాసు ‘హరివరాసనం స్వామి విశ్వమోహనం’ అని పాడుతుంటే తన్మయత్వానికి లోనుకాని హిందూ భక్తులుంటారా? గంగా – యమునా తెహ జీబ్‌... భారతీయ సంస్కృతి. దాన్ని కాపాడుకోవడంలోనే దేశ పురోగతి దాగి ఉన్నది. దీన్ని ధ్వంసం చేయడానికి స్వయంగా పాలకులే ప్రయత్నిస్తే అది క్షమించరాని నేరమే అవుతుంది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement