IND vs PAK: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ | Sri Lanka Cricket Reminds PCB 2009 Lahore Incident Pak Over T20 WC Row, Warns Of Heavy Losses If India Match Is Boycotted | Sakshi
Sakshi News home page

మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ

Feb 6 2026 11:29 AM | Updated on Feb 6 2026 12:12 PM

Sri Lanka Cricket reminds PCB 2009 Lahore Incident Pak Over T20 WC Row

టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌.. తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) విజ్ఞప్తి చేసింది. దాయాదులు పోరు కోసం తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న లంక బోర్డు.. తమకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించవద్దని కోరింది.

ఈ సందర్భంగా పాకిస్తాన్‌లో తమ జట్టుపై జరిగిన ఉగ్రదాడి (2009 Lahore Attack)ని ప్రస్తావిస్తూ.. పాక్‌కు దిమ్మతిరిగేలా చురకలు అంటించింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. అయితే, బంగ్లాదేశ్‌ కూడా లంకలోనే మ్యాచ్‌లు ఆడతామని పట్టుబట్టగా ఆ జట్టును ఐసీసీ తొలగించింది.

భారీ నష్టం
భారత్‌లో బంగ్లా జట్టుకు పూర్తి భద్రత ఉంటుందని చెప్పినా వినకపోవడంతో ఐసీసీ ఈ మేర కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే బంగ్లాకు మద్దతుగా తాము భారత్‌తో బహిష్కరిస్తామని పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ప్రకటించాడు. అదే జరిగితే హైవోల్టేజీ మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు చేసిన ఐసీసీ, బ్రాడ్‌కాస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఐసీసీ సభ్య దేశాలు సైతం ఆదాయం కోల్పోతాయి.

అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి
ఈ నేపథ్యంలో తమపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న శ్రీలంక బోర్డు.. పాకిస్తాన్‌కు లేఖ రాసింది. "కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. వరల్డ్‌కప్‌ టోర్నీలో మా దేశంలో జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ చాన్నాళ్ల క్రితమే ఖరారైంది.

ఈ మ్యాచ్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, టికెట్ల అమ్మకం, ఆతిథ్య ఏర్పాట్లు, వాణిజ్య కార్యకలాపాలు.. ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అన్నీ ఖరారైపోయాయి. ఈ సందర్భంగా.. మర్యాదపూర్వకంగా గౌరవంతో మీకో విషయాన్ని గుర్తుచేయాలని భావిస్తున్నాం.

పాక్‌లో మాపై ఉగ్రదాడి
భద్రతాపరంగా సున్నితమైన వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్‌లో మేమే మళ్లీ తొలుత పర్యటించాం. గతంలో మా జాతీయ జట్టు కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఫలితంగా మా శ్రీలంక ఆటగాళ్లు, అధికారులు గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఆ గాయాల తాలుకు నొప్పితో బాధపడుతున్నారు.

ఇటీవల బాంబుల వర్షం కురుస్తున్నా.. మేము పాక్‌ పర్యటనను మధ్యలోనే నిలిపివేయకుండా మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. ఇప్పటికీ మేము పాక్‌ క్రికెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నాము.

పాకిస్తాన్‌కు వచ్చేందుకు సందేహించినా
గతంలో విదేశీ జట్లన్నీ పాకిస్తాన్‌లో పర్యటించేందుకు సందేహిస్తున్న తరుణంలో మేమే ముందుగా అక్కడి వచ్చాము’’ అంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు సున్నితంగానే పాకిస్తాన్‌కు కర్రుకాల్చి వాతపెట్టినట్లుగా పాక్‌లో ఉన్న పరిస్థితుల గురించి తెలిసేలా చేసింది. తమ దేశంలో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉంటాయంటూ పాక్‌ బోర్డు చెప్పిన కారణం సరైంది కాదని పరోక్షంగా చురకలు అంటించింది.

కాగా 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్‌ జట్టు బస్సులో వెళ్తున్న సమయంలో 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. 

కెప్టెన్‌ మహేళ జయవర్ధనే సహా కుమార్‌ సంగక్కర కూడా గాయాలపాలయ్యారు. పాక్‌కు చెందిన అహ్సాన్‌ రజా అనే అంపైర్‌ కష్టంమీద ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించిందేకు వణికిపోయాయి. 

ఇక ఇటీవల సైతం బాంబుల మోత నడుమ కూడా పాక్‌-లంక మ్యాచ్‌లు యథావిధిగా జరగగా.. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ లంక జట్టుకు చేతులు జోడించి నమస్కరించాడు.

చదవండి: IND vs PAK: పాక్‌ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్‌.. పొట్టకొట్టేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement