ఆంధ్ర అద్భుతం చేసేనా! | Andhra Ranji Trophy quarter final against Bengal from today | Sakshi
Sakshi News home page

ఆంధ్ర అద్భుతం చేసేనా!

Feb 6 2026 4:03 AM | Updated on Feb 6 2026 4:03 AM

Andhra Ranji Trophy quarter final against Bengal from today

నేటి నుంచి బెంగాల్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌  

కల్యాణి (బెంగాల్‌): కొత్త కోచ్‌ గ్యారీ స్టెడ్‌ ఆధ్వర్యంలో ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో బరిలోకి దిగిన ఆంధ్ర క్రికెట్‌ జట్టు లీగ్‌ దశలో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటి గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. గ్రూప్‌ ‘ఎ’లో 31 పాయింట్లతో జార్ఖండ్‌తో కలిసి ఆంధ్ర సంయుక్తంగా అగ్రస్థానాన్ని సంపాదించింది. అయితే ర్యాంకింగ్‌ వర్గీకరణ కోసం మెరుగైన రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకోగా... జార్ఖండ్‌కు టాప్‌ ర్యాంక్, ఆంధ్రకు రెండో ర్యాంక్‌ దక్కింది. 

ఉత్తరప్రదేశ్, బరోడా, నాగాలాండ్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించిన ఆంధ్ర... ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ జట్లపై గెలిచింది. లీగ్‌ దశలో కనబరిచిన జోరును నాకౌట్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఆంధ్ర బృందం పట్టుదలగా ఉంది. బెంగాల్‌ జట్టుతో కల్యాణిలో నేటి నుంచి జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్ర జట్టు తలపడుతుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో 36 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన బెంగాల్‌ జట్టు కూడా అజేయంగా నిలిచింది. 

ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆ జట్టు, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈ సీజన్‌లో ఆంధ్ర తరఫున బ్యాటింగ్‌లో అభిషేక్‌ రెడ్డి, షేక్‌ రషీద్, కోన శ్రీకర్‌ భరత్, కరణ్‌ షిండే, సౌరభ్‌ కుమార్‌ మెరిపించారు. నాగాలాండ్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌లో జ్ఞానేశ్వర్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఏడు మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ రెడ్డి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలతో కలిపి 582 పరుగులు చేశాడు. షేక్‌ రషీద్‌ మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో కలిపి 573 పరుగులు సాధించాడు. 

బౌలింగ్‌ విషయానికొస్తే సౌరభ్‌ కుమార్‌ 30 వికెట్లు... త్రిపురాణ విజయ్‌ 23 వికెట్లు...కావూరి సాయితేజ 21 వికెట్లు పడగొట్టారు. లీగ్‌ మ్యాచ్‌లు నాలుగు రోజులపాటు జరగ్గా... క్వార్టర్‌ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్‌ ఐదు రోజులపాటు జరుగుతాయి. శుక్రవారం నుంచే మరో మూడు క్వార్టర్‌ ఫైనల్స్‌ కూడా జరుగుతాయి. జంషెడ్‌పూర్‌లో జార్ఖండ్‌తో ఉత్తరాఖండ్‌; ముంబైలో కర్ణాటకతో ముంబై; ఇండోర్‌లో జమ్మూకశీ్మర్‌తో మధ్యప్రదేశ్‌ తలపడతాయి. 

బెంగాల్‌తో మ్యాచ్‌కు ఆంధ్ర జట్టు: రికీ భుయ్‌ 
(కెప్టెన్‌), జ్ఞానేశ్వర్, అభిషేక్‌ రెడ్డి, కోన శ్రీకర్‌ భరత్, షేక్‌ రషీద్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, పీవీఎస్‌ఎన్‌ రాజు, కేవీ శశికాంత్, కావూరి సాయితేజ, సౌరభ్‌ కుమార్, కరణ్‌ షిండే, త్రిపురాణ విజయ్, కేఎస్‌ఎన్‌ రాజు, రేవంత్‌ రెడ్డి, ఆశిష్, సాకేత్‌ రామ్‌. 

Advertisement
 
Advertisement
Advertisement