సుజీత్‌ పసిడి పట్టు | Sujeet Kalkal wins gold medal at United World Wrestling Ranking Series tournament | Sakshi
Sakshi News home page

సుజీత్‌ పసిడి పట్టు

Feb 6 2026 3:56 AM | Updated on Feb 6 2026 3:56 AM

Sujeet Kalkal wins gold medal at United World Wrestling Ranking Series tournament

జాగ్రెబ్‌ (క్రొయేషియా): యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ సుజీత్‌ కల్కాల్‌ పసిడి పతకంతో మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో సుజీత్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్‌ 3–0 పాయింట్ల తేడాతో పేమన్‌ నెమాటి (ఇరాన్‌)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో సుజీత్‌ 11–0తో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో జోసెఫ్‌ మెకన్నా (అమెరికా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 10–0తో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో ఖామ్‌జాట్‌ అర్సెమర్‌జుయెవ్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. 

స్వర్ణ పతకం గెలిచే క్రమంలో సుజీత్‌ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకపోవడం విశేషం. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్‌ 61 కేజీల విభాగంలో అమన్‌ సెహ్రావత్‌ రజత పతకం సొంతం చేసుకున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్యం పతకం నెగ్గిన అమన్‌... ఈ టోర్నీలో 61 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. 

ఈ కేటగిరీలో ఐదుగురు రెజ్లర్లు బరిలోకి దిగారు. అమన్‌ మూడు బౌట్‌లలో గెలిచి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. 70 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన అభిమన్యు...97 కేజీల విభాగంలో విక్కీ కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్‌లలో అభిమన్యు 6–3తో మాక్స్‌వెల్‌ పార్కర్‌ (అమెరికా)పై, విక్కీ 8–2తో అద్లాన్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement