కోల్‌కతా: టాటా స్టీల్ వరల్డ్ 25 కిలోమీటర్ల రేసులో భారత అథ్లెట్ల కేటగిరీలో భారత రన్నర్ గుల్‌వీర్ సింగ్ జాతీయ రికార్డు సృష్టించి విజేతగా నిలిచాడు. గుల్‌వీర్ 25 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 12 నిమిషాల 06 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.
ఈ క్రమంలో 2024లో 1 గంట 14 నిమిషాల 10 సెకన్లతో తానే నెలకొల్పిన రికార్డును గుల్‌వీర్ సవరించాడు. హర్‌మంజోత్ సింగ్ (1గం:15ని:11 సెకన్లు) రజతం, సావన్ బర్వాల్ (1గం:15ని:25 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు.
ఓవరాల్ పురుషుల విభాగంలో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ జోషువా కిప్తెగయ్ (ఉగాండా; 1గం:11ని:49 సెకన్లు) విజేతగా అవతరించి పసిడి పతకాన్ని గెలిచాడు. అల్ఫోన్స్ ఫెలిక్స్ సింబు (టాంజానియా; 1గం:11ని:56 సెకన్లు) రజతం, టెబెల్లో రామకొంగోనా (లెసెతో; 1గం:11ని:59 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు.


