టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా నవీముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 210 పరుగుల వద్దే నిలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐదెన్ మార్‌క్రమ్ 38 పరుగులు, ర్యాన్ రెకెల్‌టెన్ 44 పరుగులు చేశారు
భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్ దంచికొట్టి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.
ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన తిలక్ హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్ పడగొట్టారు.
కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.


