టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.
భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.
భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..
ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.
వాన పడే అవకాశం
అయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.
ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.
నెట్‌రన్‌రేటుపై ప్రభావం
మరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్‌రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.
తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది.
చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు


