'ఫోర్స్‌ మజ్యూర్‌' క్లాజ్‌ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్‌ | What is Force Majeure Clause which can Pakistan use it as a legal defence for India boycott | Sakshi
Sakshi News home page

'ఫోర్స్‌ మజ్యూర్‌' క్లాజ్‌ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్‌

Feb 4 2026 2:42 PM | Updated on Feb 4 2026 2:53 PM

What is Force Majeure Clause which can Pakistan use it as a legal defence for India boycott

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌–పాకిస్తాన్‌ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్‌ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్‌ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్‌కాట్‌ డ్రామాకు తెరలేపింది. 

ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌ పాక్‌కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్‌కాట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్‌ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌.

ఏంటా ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌..?  
ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి  పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది.  

ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్‌ భారత్‌తో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్‌ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్‌ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్‌ మొత్తం ఆడి, భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామనేది ఐసీసీ-పాక్‌ క్రికెట్‌ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.

ఒప్పందాల్లో పాక్‌ భారత్‌తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ‌ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి.  

పాక్‌ జట్టు మొత్తం టోర్నమెంట్‌ ఆడుతోంది. కేవలం భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్‌ వర్గాల్లో భయం మొదలైంది. 

భారత్‌తో మ్యాచ్‌ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్‌ యూటర్న్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్‌ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement