యంగ్‌ ఇండియా చరిత్ర కొనసాగిస్తుందా..? | Team India Journey In Under 19 World Cup History, Eyes Sixth Title In 2026 After Historic Performances | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా చరిత్ర కొనసాగిస్తుందా..?

Feb 4 2026 10:10 AM | Updated on Feb 4 2026 10:41 AM

Team india journey in under 19 world cup history

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 ఎడిషన్‌లో యంగ్‌ ఇండియా ఫైనల్‌ ఫోర్‌కు చేరింది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టేందుకు సిద్దంగా ఉంది. ఈ మ్యాచ్‌ హరారే వేదికగా భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్‌ మాత్రే నేతృత్వంలోని యువ భారత్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. 

యంగ్‌ ఇండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే.. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

యంగ్‌ ఇండియా ఆరో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో ఉన్న నేపథ్యంలో అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో భారత ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. యువకుల క్రికెట్‌కు సంబంధించి ఈ టోర్నీ చాలా ప్రాముఖ్యం కలిగింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ అత్యంత విజయవంతమైన జట్టుగా చలామణి అవుతుంది. ఇప్పటివరకు జరిగిన 15 ఎడిషన్లలో 5 టైటిళ్లు సాధించి, టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచింది. 

అలాగే నాలుగు సార్లు రన్నరప్‌గానూ నిలిచి, మొత్తం తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. గతం ఇంత ఘనంగా కలిగిన భారత జట్టు మరో టైటిల్‌ను సొంతం చేసుకుంటుందో లేదో తేలియాలంటే మరో రెండు రోజుల వేచి చూడాలి. భారత్‌ ఆరో టైటిల్‌ను సాధించాలని ఆకాంక్షించే ముందు అండర్-19 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. ఈ టోర్నీ 1988లో ప్రారంభం కాగా.. భారత్‌ తమ తొలి టైటిల్‌ను 2000లో సాధించింది.

2000 - మొహమ్మద్‌ కైఫ్‌
శ్రీలంకలో జరిగిన ఆ ఎడిషన్‌లో మొహమ్మద్‌ కైఫ్‌ నేతృత్వంలోని యంగ్‌ ఇండియా ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి తొలి అండర్‌-19 ప్రపంచ్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ద్వారానే యువరాజ్‌ సింగ్‌ వంటి స్టార్లు అంతర్జాతీయ క్రికెట్‌ సమాజానికి పరిచయమయ్యారు.

2008 – విరాట్ కోహ్లీ 
2008లో మలేషియాలో జరిగిన ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్‌ రెండోసారి టైటిల్‌ గెలిచింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా, మనీష్ పాండే వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ విజయం తర్వాత కోహ్లీ సీనియర్‌ జట్టులోకి ప్రవేశించి, భారత క్రికెట్‌ చరిత్రలో గొప్ప ఆటగాడిగా ఎదిగాడు.  

2012 – ఉన్ముక్త్‌ చంద్‌ 
2012లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో ఉన్ముక్త్ చంద్‌ నాయకత్వంలో భారత్‌ మూడో టైటిల్‌ గెలిచింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్‌, హనుమ విహారి వంటి ఆటగాళ్లు ఉన్నారు.  

2018 – పృథ్వీ షా
2018లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో పృథ్వీ షా నాయకత్వంలో భారత్‌ నాలుగో టైటిల్‌ గెలిచింది. శుభ్‌మన్ గిల్‌ అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఈ జట్టు అత్యంత బలమైన జట్టుగా గుర్తింపు పొందింది.  

2022 – యష్ ధుల్‌ 
2022లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో యష్ ధుల్‌ నాయకత్వంలో భారత్‌ ఐదో టైటిల్‌ గెలిచింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి, మరోసారి యువ క్రికెట్‌ శక్తిని ప్రపంచానికి చూపించింది.  

2024 – ఫైనల్లో పరాజయం  
2024లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కి చేరినా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఎడిషన్‌లో యంగ్‌ ఇండియా ఓడిపోయినప్పటికీ, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంది. దీనికి ముందు భారత్‌ 2006, 2016, 2020 ఎడిషన్లలోనూ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement