టీమిండియా తాజా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, ఛతేశ్వర్ పుజారా లేటు వయసులోనూ చెలరేగిపోతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లు ముగిసాక కూడా వీరిద్దరూ సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్ క్రికెటర్లతో కలిసి వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో ఆడుతున్న ధవన్, పుజారా.. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో తృటిలో సెంచరీలను కోల్పోయారు.
ఈ టోర్నీలో గుర్‌గ్రామ్ థండర్‌కు ఆడుతున్న పుజారా దుబాయ్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్న మహారాష్ట్ర టైకూన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుయాబ్ రాయల్స్ తరఫున శిఖర్ ధవన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ధవన్, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్‌ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.
కాగా, వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.
జనవరి 26న మొదలై పది రోజుల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.
గోవా వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని రాజస్థాన్ లయన్స్, కీరన్ పోలార్డ్ నేతృత్వంలోని పూణే పాంథర్స్, గుర్‌కీరత్ సింగ్ మాన్ కెప్టెన్సీలోని ఢిల్లీ వారియర్స్, శిఖర్ ధనవ్ నేతృత్వంలోని దుబాయ్ రాయల్స్ సెమీస్‌కు అర్హత సాధించాయి.
ఇవాళే (ఫిబ్రవరి 3) ఈ సెమీస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి సెమీస్‌లో రాజస్థాన్, పూణే.. రెండో సెమీస్‌లో ఢిల్లీ, దుబాయ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్ మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండో సెమీస్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.


