విచారకరం: షాహిద్‌ ఆఫ్రిది పోస్ట్‌ వైరల్‌ | Regrettable: Shahid Afridi Blunt Take On Pak Refusal To Play vs IND | Sakshi
Sakshi News home page

విచారకరం: షాహిద్‌ ఆఫ్రిది పోస్ట్‌ వైరల్‌

Feb 2 2026 3:44 PM | Updated on Feb 2 2026 4:08 PM

Regrettable: Shahid Afridi Blunt Take On Pak Refusal To Play vs IND

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పాక్‌ అనవసరంగా రాద్దాంతం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది స్పందించిన తీరు వైరల్‌గా మారింది.

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత
గతంలో శ్రీలంకపై జట్టు పాక్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి దశలో తమకు భద్రత ఉండదంటూ.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆడేందుకు పాక్‌ వెళ్లేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఐసీసీ తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడించింది. ఇక పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఓ పాడైన కోడిగుడ్డు ..
ఈ క్రమంలో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌లో పాక్‌తో మ్యాచ్‌ను భారత వెటరన్‌ జట్టు బహిష్కరించింది. సెమీస్‌లో కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు నిరాకరించి టోర్నీ నుంచే తప్పుకొంది. ఆ సమయంలో షాహిద్‌ ఆఫ్రిది భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ముఖ్యంగా శిఖర్‌ ధావన్‌ను ఉద్దేశించి.. ‘‘ఓ పాడైన కోడిగుడ్డు మిగతా వాటినీ చెడగొడుతుంది’’ అంటూ ఆఫ్రిది ధావన్‌ను నిందించాడు. అంతేకాదు.. క్రీడల్లో రాజకీయాలు ఏమిటి? అంటూ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. అయితే, తాజాగా పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆఫ్రిది చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

విచాకరమే.. కానీ
‘‘రాజకీయాలు దౌత్య సంబంధాలకు ముగింపు పలికినపుడు క్రికెట్‌.. అందుకు అనుకూలమైన ద్వారాలను తెరుస్తుందని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. టీ20 ‍ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ ఇండియాతో మ్యాచ్‌ ఆడకపోవడం విచారకరం.

అయితే, మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇలాంటి సమయంలోనే ఐసీసీ తానేంటో నిరూపించుకోవాలి. ప్రతి సభ్య దేశం పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. అందరికీ న్యాయం దక్కేలా చూడాలి’’ అంటూ షాహిద్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఆడకపోవడం విచారకరం అంటూనే.. ప్రభుత్వం నిర్ణయం సరైందేనన్నట్లుగా ఆఫ్రిది మాట్లాడటం ట్రోల్స్‌కు దారితీసింది.

వారెవ్వా.. డబల్‌ యాక్షన్‌
‘‘ఎల్లప్పుడూ భారత ఆర్మీ, టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతావు కదా!.. షేక్‌హ్యాండ్‌ విషయంలోనూ మీరంతా రాద్దాంతం చేశారు. మరి ఇప్పుడు తటస్థ వేదికపైన మ్యాచ్‌లు నిర్వహిస్తున్నా తప్పుకొంటామని బెదిరించి నవ్వులపాలై.. ఇప్పుడేమో ఇండియా మ్యాచ్‌ ఒక్కటి భద్రత లేదంటూ బహిష్కరిస్తామనడం ఏమిటి?

పీసీబీ మీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడాన్ని సమర్థించే నువ్వు.. బీసీసీఐని ఎలా నిందించావు? భారత ప్రభుత్వం చెప్పినట్లుగానే బీసీసీఐ కూడా నడుచుకుంటుంది’’ అంటూ షాహిద్‌ ఆఫ్రిదికి నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.

చదవండి: పాక్‌ సెమీస్‌, ఫైనల్స్‌ను కూడా రద్దు చేసుకుంటుందా..?

Advertisement
 
Advertisement
Advertisement