క్రెడిట్ కార్డ్‌తో రూ. 10 లక్షల బంగారం.. కట్ చేస్తే!
సాక్షి, ముంబై: దేశీయంగా వెండి, బంగారం రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో తక్కువ రేటు ఉన్నపుడు కొనలేకపోయాయే అన్న బెంగ ఒకవైపు, మరోవైపు కాస్త ధరలు తగ్గగానే భారీ లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొంతమంది పెట్టుబడి దారులు పసిడి వెంట పరుగులు పెడు తున్నారు. ఇది దురాశే అవుతుందని, చాలామంది రిటైల్ పెట్టుబడుదారులు భారీగా నష్టపోతున్నారని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఆర్థిక సలహాదారు ఆదిత్య షా ఇటీవల ఎక్స్‌లో చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారి తీసింది. ధర పెరుగు తుందన్న అంచనాలతో తన ఫాలోయర్ ఒకరు నష్టాన్ని మూటగట్టుకున్న వైనాన్ని ఆయన వివరించారు. ఆర్థిక అవగాహన ప్రాముఖ్యతపై ఆన్‌లైన్‌లో తీవ్రమైన చర్చకు దారితీసింది.
షా తన పోస్ట్‌లో వివరించిన దాని ప్రకారం ఒక్క నెలలో 10-12 శాతం లాభాలొస్తాయన్న అంచనాతో అతను ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి కొనుగోలు చేశాడు. అదీ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి. కట్ చేస్తే.. ధరలు మరింత భారీగా క్షీణించాయి. దీంతో అతను చిక్కుల్లో పడిపోయాడు. ధరలు పడిపోవడం వల్ల ఒక నష్టమైతే, గడువు లోపు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాల్సి రావడం మరో కష్టం. మార్కెట్‌పై అవగాహన, నియంత్రణలేని దురాశకు ఇది మచ్చుతునక అని షా అభివర్ణించారు.
నెటిజనుల చర్చ
చాలామంది మధ్యతరగతి పెట్టుబడిదారులు బంగారాన్ని ఈక్విటీ స్టాక్ లాగా చూస్తున్నారని, బంగారం సాంప్రదాయకంగా స్వల్పకాలిక వాణిజ్య సాధనంగా కాకుండా దీర్ఘకాలిక హెడ్జ్‌గా ఉన్నప్పటికీ, లాభాలు సాధించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేస్తున్నారని ఒకరు పేర్కొన్నారు.ఇక్కడ సాధారణ మార్కెట్ దిద్దుబాట్ల సమయంలో కూడా తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని మరొకరు వ్యాఖ్యానించారు.
నష్టాలు తొందరగా వస్తాయి.. లాభాలు చాలా అలస్యంగా వస్తాయి. అందుకే సామాన్య ట్రేడర్లు ఆచితూచి అడుగువేయాలని మరికొందరు భావించారు. లివరేజ్‌ను ఉపయోగించినట్లయితే, అనుభవం, ప్రణాళిక, తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాల ప్రాప్యత లాంటివి అవసరమని చాలామంది నొక్కి చెప్పారు. ఇలాంటి ట్రేడింగ్స్‌లో స్పష్టమైన నిష్క్రమణ వ్యూహం లేదా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్ లేకుండా దాదాపు విఫలమయ్యే అవకాశం ఉందని వారు వాదించారు.
Yeasterday was talking to a follower ..
His credit card is fully exhausted he had taken 10 lkhs of gold and silver …
And now he is in debt because of prices drop of gold and silver and also next month he has to pay dues ..
Crazy idea behind this to earn 10% to 12% in a month…— Aditya Shah (@AdityaD_Shah) February 2, 2026
లాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ , రిస్క్ మేనేజ్‌మంట్ ప్లాన్
వెండి, బంగారం, ఇతర విలువైన మెటల్స్ ధరలు డాలరు, రూపాయి మారకం, అంతర్జాతీయ పరిస్థితులతో అనేక అంశాలమీద ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో దేశంలో బంగారం, వెండి ఎంత స్థాయిలో పెరిగాయో అదే స్థాయిలో అస్థిరతలు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి లాంటి వాటిపై పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉండాలనీ తెలిపారు. ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఉన్నపుడు నిపుణుల సలహాలను గమనించాలని, గోల్డ్ పెట్టుబడుల్లో అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ పండితులు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


