పాత బంగారు లోకం | gold and silver prices rising: Growing demand for lightweight jewelry | Sakshi
Sakshi News home page

పాత బంగారు లోకం

Mar 8 2026 12:20 AM | Updated on Mar 8 2026 5:57 AM

gold and silver prices rising: Growing demand for lightweight jewelry

ధరల సెగకు ‘ఎక్స్ఛేంజ్’ మంత్రం..  

తులం రూ.1.7 లక్షలు దాటినా తగ్గని పసిడి క్రేజ్‌ 

లైట్‌ వెయిట్‌ జువెలరీకి పెరుగుతున్న డిమాండ్‌

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: వరుస యుద్ధాల ప్రభావంతో బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్‌ ఇస్తూ ఆభరణాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఒక తులం బంగారం ధర రూ.1.7 లక్షల మార్కును దాటేయడంతో సామాన్యుడి గుండె గుభేల్‌ మంటోంది. కానీ, ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్త పడుతున్నారు.

మధ్యతరగతి జనం ఇప్పుడు కొత్త నగలు కొనడానికి బదులు, ఇంట్లో ఉన్న పాత బంగారాన్నిజువెలరీ షాపుల్లో ఇచ్చి (ఎక్స్ఛేంజ్) కొత్తవి చేయించుకుంటున్నారు. లాకర్లలో దాచిన పాత నగలను బయటకు తెచ్చి కొత్త నగలుగా మార్చుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో  బంగారం ధర ఇంకా పెరుగుతుందనే భయంతో అవసరాల కోసం ముందుగానే కొనుగోళ్లు చేయడం మొదలెట్టారు. పాత పసిడికి కొత్త మెరుగులు దిద్దుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంగారం అమ్మకాల్లో సగానికి పైగా గోల్డ్‌ ఎక్స్ఛేంజ్ ద్వారానే సాగుతున్నట్లు జువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. 

ప్యూర్‌ వద్దు.. లైట్‌ ముద్దు! 
పెరిగిన ధర వద్ద బంగారు ఆభరణాలు కొనడం సామాన్యుడికి కలగా మారింది. దీని ప్రభావం ముఖ్యంగా జీతభత్యాలపై ఆధారపడే మధ్యతరగతి పై ఎక్కువగా పడుతోంది  దీంతో మార్కెట్లో మరో కొత్త ట్రెండ్‌ మొదలైంది. తక్కువ బరువు, తక్కువ ధరలో లభించే 18 క్యారెట్ల నగలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.  డైమండ్స్‌లో కూడా 9 క్యారెట్, 14 క్యారెట్‌ వంటి తక్కువ రేంజ్‌ ఆభరణాలు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సహజ వజ్రాల రేటు భరించలేని మధ్యతరగతి వినియోగదారులు  తక్కువ ధరకే మెరిసే ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌వైపు మళ్లుతున్నారు. ల్యాబ్‌–గ్రోన్‌ డైమండ్స్‌ ధరలు సహజ డైమండ్స్‌ కంటే చాలా తక్కువ గ్లోబల్‌ డైమండ్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 12 శాతం ఉన్న ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్ల వాటా 2029 నాటికి 16 శాతానికికి చేరుతుందని నిపుణుల అంచనా.

ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే ‘కాసే’ 
కేవలం అలంకరణకే కాకుండా, పెట్టుబడి కోసం చూసేవారు ఇప్పుడు గోల్డ్‌ కాయిన్స్‌పైనే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగితే ఇవే లాభాలను ఇస్తాయని నమ్ముతున్నారు. రేటు పెరిగినా ఇన్వెస్టర్లు బంగారు నాణేలు కొనడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘రేట్లు ఎంత పెరిగినా బంగారంపై భారతీయులకు ఉన్న నమ్మకం వేరు. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక భద్రత’ – అరుణ్‌ నారాయణ్, సీఈఓ టైటాన్‌ జువెలరీ

Advertisement
 
Advertisement
Advertisement