నియామకాల్లో మహిళా సత్తా | Indian job postings for women grow 19 percent | Sakshi
Sakshi News home page

నియామకాల్లో మహిళా సత్తా

Mar 8 2026 12:06 AM | Updated on Mar 8 2026 12:06 AM

Indian job postings for women grow 19 percent

ఏడాది కాలంలో 19 శాతం అధిక అవకాశాలు

సీనియర్, అధిక వేతన కొలువులు కైవసం

ఫౌండిట్‌ నివేదిక వెల్లడి

ముంబై: కొలువుల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. మెరుగైన అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో దేశంలో 19 శాతం అధిక అవకాశాలను మహిళలు గెలుచుకున్నారు. జాబ్‌ పోర్టల్‌ ఫౌండిట్‌ విడుదల చేసిన ‘ఉమెన్‌ ఇన్‌ ది ఇండియన్‌ వర్క్‌ఫోర్స్‌ 2026’ నివేదిక ప్రకారం.. సీనియర్, అధిక వేతనం, అత్యాధునిక టెక్నాలజీతో ముడిపడిన ఉద్యోగ నియామకాల్లో, టైర్‌–2 పట్టణాల్లో మహిళల నియామకాలు పెరిగాయి. 2025 ఫిబ్రవరి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో ఉద్యోగ నియామకాల్లో 19 శాతం అధిక అవకాశాలను మహిళలు సొంతం చేసుకున్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో ఇదే మెరుగైన వృద్ధి. ‘‘భారత్‌ వ్యాప్తంగా మహిళల నియామకాల తీరు చూస్తుంటే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఆరంభ స్థాయి నుంచి సీనియర్‌ పొజిషన్లు, అధిక వేతన విభాగాలు, టైర్‌–2 పట్టణాల్లో మహిళలకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. అయితే అధిక శాతం ఉద్యోగాలు రూ.10 లక్షల వార్షిక వేతనంలోపే ఉంటున్నాయి. అదే సమయంలో అధిక విలువ కలిగిన ఉద్యోగాల్లోనూ మహిళల ప్రవేశం క్రమంగా మెరుగుపడుతోంది’’అని ఫౌండిట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) అనుపమా భిమ్‌రాజిక తెలిపారు.  

ఇదీ మార్పు.. 
మహిళలు ఆరంభ స్థాయి ఉద్యోగాలైన రిసెప్షనిస్ట్‌ లేదా క్లరికల్‌ ఉద్యోగాలకే పరిమితం కావడం లేదు. మేనేజర్, డైరెక్టర్‌ ఉద్యోగాల్లోనూ వారికి ప్రాధాన్యం దక్కుతోంది. 
రూ.11–25 లక్షల వేతన బ్రాకెట్‌లో మరింత మంది మహిళలు వచ్చి చేరుతున్నారు. 
⇒  ఏఐ, డేటా సైన్స్, చిప్స్‌ (సెమీ కండక్టర్లు)లో గతంలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మహిళలకూ అవకాశలు తన్నుకొస్తున్నాయి. 

ముఖ్యంగా మహిళలకు మెరుగైన అవకాశాలు మెట్రోలకే పరిమితం కావడం లేదు. టైర్‌–2, 3 పట్టణాలకూ (ఇండోర్, జైపూర్, లక్నో, కోచి, కోయింబత్తూర్‌) విస్తరిస్తున్నాయి. మొత్తం నియామకాల్లో 44 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. 2025 నివేదిక నాటికి ఇది 41 శాతంగా ఉంది. టైర్‌–1 పట్టణాల వాటా 59 శాతం నుంచి 56 శాతానికి తగ్గింది.  

ఐటీ రంగంలో (ముఖ్యంగా డేటా, అనలైటిక్స్‌) మహిళల ప్రాతినిధ్యం గడిచిన ఏడాది కాలంలో 32 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో 16 శాతం, మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో మహిళల వాటా పెరిగింది.   
కొత్త టెక్నాలజీ విభాగాల్లో మహిళలకు అవకాశాలు 26 శాతం నుంచి 31 శాతానికి పెరిగాయి. 

⇒  సంప్రదాయంగా మహిళల ఉపాధికి కీలకంగా ఉంటున్న కస్టమర్‌ సర్వీస్‌/బీపీవోలో నియామకాలు 12 శాతం నుంచి 10 శాతానికి, మానవ వనరుల విభాగంలో 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గాయి. 
కంపెనీలు లింగ సమానత్వం విషయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా.. మరింత మంది మహిళలకు అవకాశాలు ఇవ్వడం ద్వారా ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement