హైదరాబాద్: మహిళల యూరాలజీ ఆరోగ్య సమస్యలకు సమగ్ర, ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘సెంటర్ ఫర్ ఫంక్షనల్ అండ్ ఫీమేల్ యూరాలజీ’ని ప్రారంభించింది. ఈ సందర్భంగా పూర్తిగా మహిళా వైద్య సిబ్బందితో నిర్వహించే ‘ఆల్-వుమెన్ ఆపరేషన్ థియేటర్ (ఓటీ)’*ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ పాల్గొన్నారు.

మహిళల్లో మూత్ర అసంయమనం, పెల్విక్ ఆర్గన్ ప్రోలాప్స్, పునరావృత మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ నొప్పి వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నప్పటికీ, సామాజిక సంకోచం, అవగాహన లోపం కారణంగా చాలామంది చికిత్సకు ముందుకు రావడం లేదని వైద్యులు తెలిపారు. ఈ సమస్యలకు సమగ్ర నిర్ధారణ, ఆధునిక చికిత్సలు ఒకే చోట అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కేంద్రంలో మూడు ముఖ్య విభాగాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా మహిళా వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స అవసరం లేకుండా పెల్విక్ కండరాల బలపరిచే పునరావాస కార్యక్రమం, అలాగే మూత్రాశయ పనితీరును అంచనా వేసే యూరోడైనమిక్ పరీక్షల సదుపాయం అందుబాటులో ఉంచారు.
గత ఐదేళ్లలో ఏఐఎన్‌యూ మహిళా యూరాలజీ బృందం 307 ప్రధాన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. మూత్ర లీకేజ్, యూరినరీ ఫిస్టులాలు, సిస్టోసీల్స్, ఫీమేల్ యూరేథ్రోప్లాస్టీ వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స అందించిన అనుభవంతోనే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సారికా పాండ్య మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్య సమస్యలను దాచిపెట్టకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ఆధునిక సాంకేతికతతో సమగ్ర చికిత్సలు అందించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని తెలిపారు. కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి సురేకా మాట్లాడుతూ, మహిళలు సంకోచం లేకుండా వైద్య సేవలు పొందేలా పూర్తి మహిళా సిబ్బందితో ఈ ఓటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతుల నుంచి వృద్ధుల వరకు మహిళల యూరాలజీ సమస్యలకు రోగి-కేంద్రీకృత, సమగ్ర వైద్య సేవలు అందించడం ఈ కేంద్ర లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.


