లొంగుబాటలో గణపతి..! కుమారుడి ఆడియో వైరల్‌ | Maoist Leader Ganapati Prepares To Surrender Amid Health Concerns, Emotional Audio Message From Son Goes Viral | Sakshi
Sakshi News home page

లొంగుబాటలో గణపతి..! కుమారుడి ఆడియో వైరల్‌

Mar 5 2026 3:10 PM | Updated on Mar 5 2026 4:34 PM

Maoist Ganapathy Son Emotional Audio

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. అమిత్‌ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్‌ నుంచి గణపతి ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్‌గా మారింది.

ఆడియోలో గణపతి కుమారుడు ఏమన్నారంటే..
‘‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా "నాన్నా" అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని "నాన్నా" అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ, అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.

అమ్మ నరకం చూస్తుంది ప్లీజ్ నాన్నా.. మావోయిస్టు గణపతి కుమారుడి ఆడియో

..మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది.

..ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది.

..నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా! మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.

ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష’’ అంటూ గణపతి కుమారుడు ఎమోషనల్‌గా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement