నామినేషన్‌ దాఖలు చేశారు.. నితీశ్‌ ఇకపై..: అమిత్‌ షా | "Nitish Kumar returning to national politics as Rajya Sabha MP": Amit Shah | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ దాఖలు చేశారు.. నితీశ్‌ ఇకపై..: అమిత్‌ షా

Mar 5 2026 4:31 PM | Updated on Mar 5 2026 4:39 PM

"Nitish Kumar returning to national politics as Rajya Sabha MP": Amit Shah

న్యూఢిల్లీ: నితీశ్‌ కుమార్‌ బిహార్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలాన్ని ఆ రాష్ట్ర చరిత్రలో “సువర్ణ అధ్యాయం”గా కేంద్ర మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. నితీశ్‌ జాతీయ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని అమిత్‌ షా స్వాగతించారు. రాజ్యసభ స్థానానికి ఇవాళ నితీశ్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలో నితీశ్‌ వెంటే అమిత్‌ షా ఉన్నారు.  

దీనిపై అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘ఇవాళ రాజ్యసభ స్థానానికి బిహార్‌ సీఎం కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. నితీశ్‌ కుమార్ 2005 నుంచి ఇప్పటి వరకు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం నిజంగా గొప్పది. ఈ కాలం బిహార్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వంటి పదవుల్లో సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదు. ఆయన జీవితం మొత్తం స్వచ్ఛంగా ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాల కాలంలో నితీశ్‌ కుమార్‌ బిహార్ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. మోదీ ప్రారంభించిన ప్రతి కార్యక్రమం బిహార్ ప్రజలకు చేరేలా నితీశ్‌ నాయకత్వం పనిచేసింది. ఇప్పుడు ఆయన మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. నేను, ఎన్డీఏ మిత్ర పక్షా నేతలు అందరమూ ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం’ అని అన్నారు.

మేము ముందే చెప్పాం: తేజస్వీ  
బిహార్‌లో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి.  బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీశ్‌ కుమార్‌పై బీజేపీ కుయుక్తులు చేసిందని ఆరోపించారు. ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్‌’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు.

‘బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలు కుయుక్తులు, కుతంత్రాలను వాడి, మొత్తం వ్యవస్థను వాడుకుని ఎన్నికలు ఎలా నిర్వహించాయో తెలుసు. అప్పుడే నితీశ్‌ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసిందని చెప్పాం. ఆయనను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోనివ్వరని తెలిపాం. ఆయన ఆ కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని మేము చెప్పాం’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement