తిరువనంతపురం: శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ఫైళ్లు.. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం నుంచి మాయమైనట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో అధికారులు పాత ఫైళ్ల కోసం వెతికిన వేళ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కేసు పత్రాల కాపీలు కూడా అందుబాటులో లేవని తెలియడంతో టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్, బోర్డు ఇతర సభ్యులు షాక్ అయ్యారని తెలుస్తోంది. ఆయా రికార్డులు ఏమయ్యాయో తమకు తెలియదని అధికారులు తెలిపారు. కాగా, 2007లో శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించవచ్చని వీఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వైఖరిని తెలిపింది.
ఆ తర్వాత 2016లో ఊమెన్ చాందీ ప్రభుత్వం, ప్రయార్ గోపాలకృష్ణన్ నేతృత్వంలోని దేవస్వం బోర్డు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేశాయి. 2016 నవంబర్‌లో పినరయి విజయన్ ప్రభుత్వం మహిళల ఆలయ ప్రవేశానికి మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఆ సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక అఫిడవిట్ సమర్పించలేదు.


