కోజికోడ్: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత కేపీ ఉన్నికృష్ణన్ (89) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 1980, 90వ దశకాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వడకర నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఉన్నికృష్ణన్.. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచారని చెబుతుంటారు.
జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఉన్నికృష్ణన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1971లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా వడకర నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 1977, 1980, 1984, 1989, 1991 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వీపీ సింగ్ కేబినెట్‌లో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.నాడు గల్ఫ్ యుద్ధ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఉన్నికృష్ణన్ ఆదర్శాలకు కట్టుబడి నడుచుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వి.కె. కృష్ణమీనన్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఒకానొక సమయంలో ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అనుచరుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ (యూ), కాంగ్రెస్ (ఎస్) పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1981-84 మధ్య కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ (సెక్యులర్) పక్ష నేతగా, 1980-82లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ విరామం తర్వాత 1995లో తిరిగి సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1936 సెప్టెంబర్ 20న జన్మించిన ఉన్నికృష్ణన్ విద్యాభ్యాసం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సాగింది. చెన్నైలోనే న్యాయశాస్త్ర పట్టా పొందిన ఆయన విద్యార్థి దశలోనే సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దారు. 1960వ దశకంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, 1962 నాటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సభ్యుడిగా ఎదిగారు. ఒక జర్నలిస్టుగా, న్యాయవాదిగా, పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా


