ఇరాన్‌పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్‌ | Rich Dad Poor Dad Robert Kiyosaki Controversial Tweets on IranWar | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్‌

Mar 1 2026 2:13 PM | Updated on Mar 1 2026 2:28 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Controversial Tweets on IranWar

బంగారం, వెండి, స్టాక్‌ మార్కెట్లు, బిట్‌ కాయిన్‌, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్‌ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.

కియోసాకి తన ట్వీట్‌లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.

ఇదే ట్వీట్‌లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ హయాంలో మొదలైన ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.

తర్వాత చేసిన మరో ట్వీట్‌లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్‌ ఓమర్‌, గవర్నర్ టిమ్‌ వాల్జ్‌ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్‌ పీటర్‌సన్‌ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement