విప్లవకారుడి నుంచి ‘సుప్రీం’ శక్తి దాకా ఎదిగిన ఖమేనీ
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్‌లో ఓ శకం ముగిసింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌ను మతరాజ్యంగా రూపాంతరం చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధించారు. ఇరాన్ పరిపాలన, సాయుధ వ్యవస్థలకు మూడున్నర దశాబ్దాలకుపైగా ఖమేనీ మాటే శాసనం.
పశ్చిమాసియాలో మత కేంద్రంగా ఇరాన్‌ను సమున్నత స్థాయికి చేర్చాలనే పట్టుదలతో సంస్కరణవాదులను అణచివేస్తూ దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆయన కొరకరాని కొయ్యలా మారారు. దశాబ్దాలుగా ఇరాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అహరి్నశలు శ్రమిస్తున్న అమెరికాను ఎన్నోసార్లు దీటుగా ఎదుర్కొన్నారు. ఇస్లామిక్ విప్లవంలో చురుకైన విప్లవకారుడి నుంచి తిరుగులేని పాలకుని దాకా సాగిన ప్రస్థానం ఖమేనీది...
పహ్లావీ శకం ముగిశాక...
ఖమేనీ నగరం నుంచి వచ్చి మష్హాద్ సిటీలో స్థిరపడిన అజర్‌బైజాన్ టర్క్ వర్గానికి చెందిన దంపతులకు 1939 ఏప్రిల్ 19వ తేదీన ఖమేనీ జని్మంచారు. ఎనిమిది మంది సంతానంలో రెండోవాడు. నాలుగో షియా ఇమామ్ అలీ అల్ సజ్జాద్‌కు ఖమేనీలు వారసులు. పాఠశాల విద్యకాలంలోనే ఆయన ఖురాన్‌ను లోతుగా చదివారు. యుక్తవయసులోనే పర్షియన్‌లో కవితలు రాసేవారు.
కచి్చతమైన సమయానికి ప్రార్థనలు చేయాల్సిందేననే పట్టుదలతో ఓసారి వెళ్తున్న రైలు నుంచి దూకేసి మరీ మసీదుకు పరుగెత్తారట! మొహమ్మద్ రెజా పహ్లావీ రాజరిక పాలనలో విప్లవకారునిగా మారారు. ఆరుసార్లు అరెస్టయ్యారు. మూడేళ్లు దేశ బహిష్కరణను ఎదుర్కొన్నారు. నాటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్ సంజామీకి కుడిభుజంగా మారారు. 1980లో టెహ్రాన్ శుక్రవారంప్రార్థనల ఇమామ్‌గా ఎంపికయ్యారు.
1981లో ఖమేనీని టేక్ రికార్డర్ బాంబుతో చంపేందుకు ముజాహిదీన్–ఇ–ఖల్ప్ వర్గం విఫలయత్నం చేసింది. ఆ పేలుడులో కుడి భుజం దెబ్బ తిని కుడిచేయి చచ్చుబడిపోయింది. స్వరపేటిక తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1981లో ఎన్నికల్లోఘనవిజయంతో ఖమేనీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి కీలక నేతగా ఎదిగారు.
ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతొల్లా రుహొల్లాæ ఖొమేనీకి కుడిభుజంగా మారారు. ఆయన 1989లో చనిపోయాక ఖమేనీ ‘గ్రాండ్ అయతొల్లా’ హోదా పొందారు. 1989 జూన్ 4న ఇరాన్ సుప్రీం లీడర్‌గా అవతరించారు. ఇరాక్‌తో యుద్ధం తర్వాత ప్రభుత్వంపై పట్టుసాధించారు. 36 ఏళ్లుగా ఇరాన్‌లో ఆయనే మాటే శాసనంగా సాగుతోంది.
ఇరాన్ సాయుధ బలగాలకు కూడా ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. గార్డియన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, అది సూచించేవారే పార్లమెంట్ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనలు తెచ్చారు. షిమా మతబోధకులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. చీఫ్ జస్టిస్ సహా దేశంలోన్ని అన్ని వ్యవస్థలపైనా పట్టు నిలుపుకున్నారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే రెవల్యూషనరీ గార్డ్ విభాగం సైతం ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. రెవల్యూషనరీ గార్డ్ విభాగానికి సొంతంగా వ్యాపారం చేసుకునే అధికారం సైతం కట్టబెట్టారు. అలా అది అత్యంత శక్తివంతమైన సాయుధ వ్యవçస్థగా ఎదిగింది.
పరోక్ష దళాల సృష్టికర్త
పశ్చిమాసియాలో ఇస్లాం మత ప్రభావాన్ని పెంచేందుకు పొరుగు దేశాల్లో పరోక్ష దళాలను ఖమేనీ ఏర్పాటు చేశారు. లెబనాన్‌లో హెజ్»ొల్లా ఉగ్రసంస్థ ఆవిర్భావానికి కృషి చేశారు. 2000లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుతిరిగేలా చేశారు. 2006లో జరిగిన యుద్ధంలోనూ పాక్షిక విజయం సాధించారు. యెమెన్‌లో హూతీ రెబల్స్‌కు సాయపడ్డారు. పాలస్తీనాలో హమాస్‌కు ఖమేనీ అండదండలు దండిగా ఉండేవి.
తిరుగుబాట్లతో తలనొప్పులు
దమనకాండకు వ్యతిరేకంగా 2022లో ఇరాన్‌లో తలెత్తిన దేశవ్యాప్తంగా ఉద్యమం ఖమేనీ పాలనకు పెను సవాల్ విసిరింది. దాన్ని ఉక్కుపాదంతో అణచి మానహక్కులను కాలరాశారన్న అపవాదును ఖమేనీ మూటగట్టుకున్నారు. తాజాగా 2025 డిసెంబర్‌లో ఖమేనీని వ్యతిరేకంగా ఇరాన్‌లో వెల్లువెత్తిన ఆందోళనలు కూడా ప్రపంచమంతటా చర్చనీయంగా మారాయి. అణ్వ్రస్తాలను సామూహిక మానవహననాలుగా ఛీత్కరించే ఖమేనీ, లోలోపల మాత్రం అణుబాంబుపై మక్కువ పెంచుకున్నారని అమెరికా దశాబ్దాలుగా ఆరోపిస్తోంది.
రహస్య ప్రాజెక్టుతో యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారనే ఆగ్రహంతో ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్‌లు కత్తులు నూరాయి. చివరికి అదే ఖమేనీ అంతానికి దారితీసింది. ఖమేనీకి అన్ని రకాలా సాయపడే సైనిక జనరల్స్, ముఖ్య నేతలను అంతమొందిస్తూ అమెరికా చివరకు ఆయనను ఏకాకిని చేసింది. గత జూన్‌లో ఇజ్రాయెల్ ‘12 రోజుల యుద్ధం’ సందర్భంగా ఇరాన్ అణు స్థావరాలను అమెరికా బాంబు దాడులతో తుత్తునియలు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల నడుమ పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటిదాకా పెద్దగా ఫలితం ఆలోపే ఇజ్రాయెల్, అమెరికా మెరుపు దాడులతో శనివారం ఖేమేనీతో పాటు పలువురు సైనిక, పౌర అగ్ర నేతలను అంతం చేశాయి.
ఖమేనీ మూలాలు భారత్‌లో!
ఖమేనీ మూలాలు భారత్‌లోనే ఉన్నట్టు ఇరాన్ చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. షియా వర్గానికి చెందిన ఖమేనీ వంశస్తుడు సయ్యద్ అహ్మద్ మూసావీ 18వ శతాబ్ధాంలో ఇరాన్ నుంచి భారత్ వలస వచ్చారు. యూపీలో షియా జనాభా అత్యధికంగా ఉండే బారాబంకీ జిల్లాలోని కింటూర్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడ షియా మత బోధకుడిగా పేరుపొందాడు. తన పేరు చివర హిందీ అని కూడా తగిలించుకున్నారు. నేటికి ఇరాన్ చరిత్రకారుల గ్రంథాలు ఆయన పేరును సయ్యద్ అహ్మద్ మూసావీ హిందీ అనే పేర్కొంటారు. 1830లో ఆయన ఇరాన్‌లోని నజబ్ నగరానికి వెళ్లిపోయారు. తరవాత ఖమేనీ పట్టణంలో స్థిరపడ్డారు. ఖమేనీ తాతముత్తాతల బంధువుల ప్రభావంతోనే దక్షిణ భారతంలో, ముఖ్యంగా హైదరాబాద్, దక్కన్‌లో ఇరాన్ సంస్కృతి, సంప్రదాయాలు వర్ధిల్లినట్టు చెబుతారు. నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇరానీ కుటుంబాలు నేటికీ వందలాదిగా ఉన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


