మండలిలో ఇరాన్, అమెరికా రాయబారుల వాగ్యుద్ధం | Iran and US envoys in fierce war of words during UN Security Council | Sakshi
Sakshi News home page

మండలిలో ఇరాన్, అమెరికా రాయబారుల వాగ్యుద్ధం

Mar 2 2026 4:07 AM | Updated on Mar 2 2026 4:07 AM

Iran and US envoys in fierce war of words during UN Security Council

పరిస్థితులు చేయిదాటుతున్నాయంటూ గుటెరస్‌ ఆందోళన

ఐక్యరాజ్యసమితి: అమెరికా, ఇజ్రాయెల్‌ల వైమానిక దాడులు, ఇరాన్‌ ప్రతిదాడుల ప్రభావం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ కనిపించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ భారీ వైమానిక దాడులు, ఇరాన్‌ ప్రతిదాడులు మొదలైన కొద్ది గంటల్లోనే న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో భద్రతా మండలి అత్యవసర భేటీ జరిగింది. ఈ సమావేశంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ రాయబారుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

ఐరాసలో నైతిక అంశాలపై స్పష్టత లోపించడంతో అమెరికా జోక్యం చేసుకుని, దానిని సరిచేసిందంటూ మండలిలో ఆ దేశ రాయబారి మైక్‌ వాల్ట్జ్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ అణు సంపత్తిని కలిగి ఉండరాదన్నది ప్రపంచ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని చెప్పుకొచ్చారు. 

అదేవిధంగా, ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ మాట్లాడుతూ..అస్తిత్వమే ప్రమాదంలో పడగా, అది మరింత తీవ్రరూపం దాల్చకమునుపే, దానిని అడ్డుకోవడానికి తమ దేశం అమెరికాతో కలిసి పనిచేసిందని సమర్థించుకున్నారు. ఇరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానీ వారి వివరణలను తిప్పికొట్టేందుకు ప్రయతి్నంచారు. 

అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి తమ దేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, ముందస్తు ప్రణాళికతో దురాక్రమణకు దిగాయని ఆరోపించారు. గత కొద్ది నెలల్లో ఇలా జరగడం ఇది రెండోసారని పేర్కొన్నారు. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆయన అతి ఘోరమైన నేరంగా అభివర్ణించారు. హోర్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌ మినాబ్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 100 మందికి పైగా పిల్లలు చనిపోయారన్నారు. 

ఇటువంటి యుద్ధ నేర చర్యలకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌లపై మండలి వెంటనే తగు రీతిలో స్పందించాలని కోరారు. మౌనం నేరంతో సమానమని పేర్కొన్నారు. మర్యాదగా మాట్లాడండి అంటూ ఇరవానీ సూచించగా, స్వేచ్ఛను కోరుకుంటున్న వేలాది మంది సొంత ప్రజలను చంపి, మరెంతో మందిని జైల్లో పెట్టిన నిరంకుశపాలకులకు ప్రతినిధిగా ఇక్కడ కూర్చున్న మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ వాల్జ్‌ తిప్పికొట్టారు. 

ఈ సందర్భంగా పశ్చిమాసియాలో పరిస్థితులపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు, ప్రతిదాడులను ఆయన ఖండించారు. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ ప్రాంతంలో తాజా సైనిక చర్యల వల్ల పరిస్థితి మరింతగా చేయిదాటి పౌరుల ప్రాణాలు, ప్రాంతీయ సుస్థిరత ప్రమాదంలో పడిందన్నారు. తక్షణమే ఉద్రిక్తతల నివారణకు చర్యలు తీసుకోవాలని, దాడులను నిలువరించాలని సంబంధిత దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement