ఖమేనీ నివాస సముదాయంపై దాడుల అనంతరం దట్టంగా వెలువడుతున్న పొగ
ఖమేనీ కోసం కొన్నినెలలుగా వేట సాగిస్తున్న అమెరికా నిఘా సంస్థ సీఐఏ
టెహ్రాన్‌లో సీనియర్ నేతలు, అధికారులతో ఖమేనీ సమావేశమవుతున్నట్లు గుర్తింపు
30 క్షిపణులు ప్రయోగించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు
అక్కడికక్కడే మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్
ఇరాన్ రక్షణ శాఖ మంత్రి సహా పలువురి మృతి
సీఐఏకు ఉప్పందించిన ఖమేనీ వ్యతిరేకులు!
యూదుల పండుగకు ముందే కీలక ఆపరేషన్ పూర్తి
శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం సంచలనాత్మకంగా మారింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్‌తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్‌లిస్ట్‌లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత వేట మరింత ముమ్మరంగా సాగింది. టెహ్రాన్ నడి»ొడ్డున ఖమేనీ నివాసంలో శనివారం తెల్లవారుజామున కీలక సమావేశం జరుగబోతున్నట్లు సీఐఏకు సమాచారం అందింది. ఖమేనీతోపాటు సీనియర్ నేతలు, సైనికాధికారులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. సీఐఏ వెంటనే ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు మంతనాలు జరిపాయి. తెల్లవారకముందే చిమ్మచీకట్లోనే దాడికి దిగాలని తొలుత భావించారు. ఉదయం అయితే ఆపరేషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందన్న ఉద్దేశంతో తెల్లవారిన తర్వాత దాడులకు టైమ్ ఫిక్స్ చేశారు.
సమాచారం ఇచ్చిందెవరు?
ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇందులో ఖమేనీ వ్యతిరేకులు కూడా ఉన్నారు. అతడి కదలికల గురించి వారే అమెరికా సీఐఏకు సమాచారం చేరవేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీపై దాడికి ఎంచుకున్న సమయానికి కూడా యూదు మతంలో కొంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల 2న యూదులకు పూరిమ్ సెలవుదినం. ఇదొక పండుగ రోజు. ప్రాచీన కాలంలో యూదులను అంతం చేయడానికి అప్పటి పర్షియా(నేటి ఇరాన్) పాలకులు సాగించిన కుట్ర ఇదే రోజున విఫలమైంది. సరిగ్గా ఈ పండుగకు ముందు ఖమేనీని అంతం చేయడం గమనార్హం.
కీలక నేతలు, అధికారులు హతం
ఖమేనీ నివాసం చుట్టూ నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నిజానికి ఇదొక భారీ కాంపౌండ్. ఇందులో ఖమేనీ కార్యాలయాలు, ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీసులు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఇదొక గుండెకాయ అని చెప్పుకోవచ్చు. ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్‌పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్‌జాదే, మిలటరీ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షామ్‌ఖనీ, ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మాజిద్ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి మొహమ్మద్ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు.
క్షణాల్లోనే శిథిలాలుగా..
ఉన్నతస్థాయి వర్గాల నుంచి ఆదేశాలు అందిన వెంటనే స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు తమ స్థావరాల నుంచి గాల్లోకి లేచాయి. రెండు గంటల ఐదు నిమిషాల్లో.. ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు టెహ్రాన్‌కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఖమేనీ కాంపౌండ్‌ను శిథిలాలుగా మార్చేశాయి. ఖమేనీతోపాటు అక్కడే ఉన్న సైనికాధికారులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సైనికాధికారుల ఒక భవనంలో, ఆ పక్కనే మరో భవనంలో ఖమేనీ ఉన్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఈ రెండూ నామరూపాల్లేకుండాపోయాయి. లక్ష్యం ఎక్కడా గురితప్పలేదు. అంతా అనుకున్నట్లుగానే పూర్తయ్యింది. ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు అమెరికా క్షిపణులు, డ్రోన్లు కూడా ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా యుద్ధనౌకల నుంచి తోమహక్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించారు. ఖమేనీ కదలికలను తమ నిఘా వర్గాలు సక్సెస్‌ఫుల్‌గా ట్రాక్ చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.


