అగ్రరాజ్యం అనుకున్నట్లే అవుతుందా? | Sakshi Guest Column On USA, Israel, Iran War Issue | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యం అనుకున్నట్లే అవుతుందా?

Mar 2 2026 12:38 AM | Updated on Mar 2 2026 12:40 AM

Sakshi Guest Column On USA, Israel, Iran War Issue

అభిప్రాయం

అమెరికా, ఇజ్రాయెల్‌లు శనివారం వేకువ జామున ఇరాన్‌పై పరస్పర సమన్వయంతో దాడులు నిర్వహించాయి. గత వేసవిలో 12 రోజులపాటు సాగిన యుద్ధం తర్వాత ఈ మూడు దేశాలు కుతకుతలాడుతూనే ఉన్నాయి. శనివారంనాటి దాడులు ఆ ఘర్షణను తిరిగి రగుల్కొలిపాయి. అమెరికా–ఇజ్రాయెల్‌ల సంయుక్త దాడులు ఇరాన్‌లోని కీలకమైన అధికార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సీనియర్‌ నాయకులను హతమార్చాయి. ముఖ్యంగా 1989 నుంచి ఇరాన్‌ను పాలిస్తూ వస్తున్న సుప్రీమ్‌ లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ నేలకొరిగారు. ‘‘చరిత్రలోని అత్యంత దుష్టమైన వ్యక్తులలో ఒకరు’’ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయనను అభివర్ణించారు. ఖమేనీని మట్టుబెట్టిన సంగతిని ట్రంప్‌ ఒక పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ ఘటనతో ఇరాన్‌ ప్రజానీకానికే కాదు, గొప్ప అమెరికన్లు అందరికీ న్యాయం చేకూరినట్లు అయింది’’ అని కూడా ట్రంప్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

నిర్ణయాత్మక సైనిక చర్య!
ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్‌ మహమ్మద్‌ పాక్పూర్, రక్షణ మంత్రి అజీజ్‌ నసీర్‌జాదె, డిఫెన్స్‌ కౌన్సిల్‌ అధినేత అడ్మిరల్‌ అలీ షంఖానీ, ఆఖరికి ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదినెజాద్‌ సైతం దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్‌ వార్తలు ప్రచురించింది. ఇరాన్‌ తన క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇరాక్, జోర్డాన్‌లతో సహా గల్ఫ్‌లో పలు ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన కూడా ఇరాన్‌ విరుచుకుపడింది. త్వరితగతిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణక్షణానికీ మారిపోతున్న పరిస్థితులు ఊహకు అందడం లేదు. సహజంగానే సంతోషాతిరేకంతో ఉన్న ట్రంప్‌ దీన్ని పరిమిత చర్యగా భావించడం లేదు. అమెరికాకు దీర్ఘకాలికంగా ఉన్న ముప్పును తుదముట్టించే నిర్ణయాత్మక సైనికచర్యగా చెబుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు ఈ బెడదను నేరుగా ఎదుర్కొనేందుకు విముఖత చూపారనీ, తాను దాడికి సాహసించగలిగాననీ ఆయన చెబుతున్నారు. 

దాడులకు దిగడానికి ముందు ఇరాన్‌కు చుట్టుపక్కలనున్న దేశాల మద్దతుతో అమెరికా దౌత్యపరమైన యత్నాలు సాగించింది. కానీ, అవి ఇరాన్‌ అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్య శక్తిని కట్టడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవి. ఆ యత్నాలు ఫలవంతమయ్యే స్థాయి వరకు ట్రంప్‌ ఓపికపట్టి ఉండాల్సింది. కానీ, ఆయన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, అమెరికాలోని కన్జర్వేటివ్‌ పిడివాదుల ప్రభావానికి లోనై, ఇరాన్‌ బలహీనంగా ఉందని భావిస్తున్న ప్రస్తుత సమయంలో దానిపై దాడి చేయడానికే మొగ్గు చూపారు. ఇరాన్‌ ప్రజానీకం తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. ఇరాన్‌ ప్రభుత్వ మార్పునకు వాషింగ్టన్‌ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ‘‘తమ దేశాన్ని తిరిగి తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఇది ఇరాన్‌ ప్రజానీకానికి లభిస్తున్న ఏకైక మహత్తర అవకాశం’’ అంటూ ట్రంప్‌ శనివారం రాత్రి సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’లో పోస్ట్‌ చేశారు. 

రెండేళ్ళ పైగా... రగులుతున్నదే!
ఇరాన్‌పై ఇప్పుడే ఎందుకు దాడికి దిగారో మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ వారాంతపు దాడులు హఠాత్తుగా పుట్టుకొచ్చినవేమీ కావు. గత రెండేళ్లుగా ఇరాన్‌తో ఘర్షణ విస్తృత రూపం దాలుస్తూ వచ్చింది. ఇజ్రాయెల్‌ 2023 అక్టోబర్‌ 7 నుంచి గాజాలోని హమాస్‌పైనే కాకుండా, తమ ఉత్తర సరిహద్దు పొడవునా హిజ్బుల్లా పైన, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులకు దిగుతున్న హూతీలపైన నిలకడగా సైనిక చర్యలను నిర్వహిస్తూ వచ్చింది. అది పరోక్షంగా ఇరాన్‌ను కూడా లక్ష్యంగా చేసుకుందని వేరే చెప్పనక్కర లేదు. ఇజ్రాయెల్‌ సైనిక చర్యలు ఇరాన్‌ ఫార్వర్డ్‌ రక్షణ వ్యూహానికి కోత పెడుతూ వచ్చాయి. దాని కేంద్ర సైనిక సామర్థ్యాలను బలహీనపరచాయి. సాపేక్షంగా చూస్తే, ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నది ఇరాన్‌ భూభాగం, చెదిరిపోకుండా ఉన్నది క్షిపణి కార్యక్రమం, అన్నింటికన్నా ముఖ్యంగా నాయకత్వ వ్యవస్థ అని చెప్పాలి. 


అమెరికా–ఇజ్రాయెల్‌ల దాడులు తక్షణ ఫలితాలనైతే  ఇచ్చాయి. కానీ, యుద్ధాలు చాలా అరుదుగా మాత్రమే తొలుత రూపొందించుకున్న గతిన సాగుతాయి. అమెరికాకు సైనికపరంగా ఇరాన్‌ సమ ఉజ్జీ కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ, దాని వద్ద సాధనాలున్నాయి. రణరంగాన్ని విస్తరించడం అన్నది దానికి వాటమైన వ్యవహారం. యుద్ధ నష్టాలను ఇరుగు పొరుగు దేశాలు కూడా పంచుకోక తప్పని స్థితిని అది సృష్టించగలదు. ఆ విధంగా ప్రాంతీయ ప్రమాదాలను పెంచగలదు. ఇరాన్‌ ప్రతిదాడులు సరిగ్గా ఈ వ్యూహాన్నే సూచిస్తున్నాయి. గల్ఫ్‌లోని పొరుగు దేశాలతో టెహరాన్‌ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ, అంతిమ కాల్పుల విరమణను సాధించేందుకు ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని నిలకడగా కొనసాగించడమే తనకున్న ఏకైక మార్గమని అది భావిస్తోంది. 

ఎవరి లక్ష్యం వారిది!
కీలక పాత్రధారులైన మూడు దేశాలూ రణరంగంలోకి దిగడానికి, ఎవరికి వారికి ప్రత్యేక లక్ష్యాలున్నాయని గమనించాలి. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌కేమో తన అస్తిత్త్వాన్ని కాపాడుకోవడం మొదటి లక్ష్యం. దాడులను తట్టుకుని నిలబడి, తగినంత సైనిక, రాజకీయ పొందికను తమ వైపు నుంచి కనబరచడం, సైనిక ప్రతిస్పందనను కొనసాగించడం ఇరాన్‌ ముందున్న పని. సంప్రదాయ ధోరణిలో యుద్ధంలో గెలిచేందుకు ఇరాన్‌ పోరాడడం లేదు. పాలనా వ్యవస్థను కొనసాగించుకునేందుకు శక్తియుక్తులను ఒడ్డుతోంది. 

దానికి విరుద్ధంగా, ట్రంప్‌ ఒక నిర్ణయాత్మక ఫలితాన్ని కోరుకుంటున్నారు. అమెరికాకున్న దీర్ఘకాలిక ప్రత్యర్థి మెడలు వంచినట్లు చాటుకోవాలని ఆయన తాపత్రయం. ‘‘ఈ వారం పొడుగూతా బాంబులు కురిపిస్తూనే ఉంటాం. మా లక్ష్యాన్ని సాధించే వరకు అవసరమైనంత కాలం పోరు సల్పుతాం’’ అని ఆయన చెప్పారు. ఇబ్బడిముబ్బడి శక్తితో ఇరాన్‌ మౌలిక వసతులను, వ్యూహాత్మక ఆస్తులను ధ్వంసం చేస్తూ, సీనియర్‌ నాయకత్వాన్ని మట్టుబెడుతూ పోతే, ఇరాన్‌ వ్యూహాత్మక వైఖరి సడలిపోతుందనీ, అది లొంగివస్తుందనీ, లేదా దేశం లోపల అస్తవ్యస్త పరిస్థితులు పాలనా వ్యవస్థ మార్పునకు దారితీసి తీరుతాయనీ ట్రంప్‌ నమ్మకంతో ఉన్నారు. 

ఇజ్రాయెల్‌ లక్ష్యాలు కూడా స్థూలంగా వాషింగ్టన్‌ వైఖరితో సరిపడినవే. కాకపోతే అది కొన్నింటిపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరానియన్లు తిరగబడాలనీ, పాలనా వ్యవస్థ మార్పునకు లభించిన చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ నెతన్యాహు పిలుపు నిస్తున్నారు. ఇరాన్‌ ఆంతరంగిక సమస్యలలో మునిగిపోతే చాలుననీ, శాశ్వతంగా కాకపోయినా... కనీసం ప్రస్తుతానికి వ్యూహపరంగా బలహీనపడాలనీ ఆయన కోరిక. 

ఇరాన్‌లో ఏం జరగవచ్చు?
బాంబు దాడులు, ఖమేనీ అస్తమయం తర్వాత ఒకదానితో ఒకటి ముడిపడిన పలు మార్గాలు కళ్ళెదుట నిలువనున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో, అమెరికా తన చర్యలను నిలుపు చేయవచ్చు. ఇరాన్‌ గణనీయంగా దెబ్బతిని ఉంది కనుక, ఒత్తిడి చేస్తే దారికి రావచ్చని వైట్‌హౌస్‌ భావన. దయనీయ స్థితి ఉద్రిక్తతల సడలింపునకు దారితీయవచ్చని దాని అభిప్రాయం. ప్రస్తుత పాలనా వ్యవస్థలో మిగిలిన నాయకత్వం, వాషింగ్టన్‌ డిమాండ్లకు అంగీకరించడం ద్వారా తమ పట్టును కొంతవరకైనా కాపాడుకున్నట్లు అవుతుందని భావించవచ్చు.

ఖమేనీ రంగంలో లేకపోయినంత మాత్రాన, వ్యవస్థ దానికంతట అది కుప్పకూలదు. అధికార బదలీకి రాజ్యాంగ యంత్రాంగం ఏదో ఒక ఏర్పాటు చేస్తుంది. నిపుణులు నూతన అధినాయకుడిని అధికారికంగా నియమించవచ్చు. అయితే, ఆచరణలో మాత్రం, నిర్ణయాత్మక శక్తి రివల్యూషనరీ గార్డ్, భద్రతా వ్యవస్థ చేతుల్లోనే కొనసాగవచ్చు. అధికార బదలీ పకడ్బందీగా సాగేట్లు, ఉన్నత స్థాయి నాయకత్వం చెదిరిపోకుండా నివారించేటట్లు... ఆ రెండు వ్యవస్థలు ప్రయత్నించి తీరుతాయి. పాలన కొనసాగేందుకు, తాత్కాలికంగానైనా ఉమ్మడి నాయకత్వ ఏర్పాటు జరగవచ్చు. అది అమెరికా–ఇజ్రాయెల్‌ల ఒత్తిడికి మరింత లొంగకపోవచ్చు కానీ, దేశంలోని సైనిక ఒత్తిడికి అది లొంగిపోయేదిగానే ఉంటుంది. 

సైనిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే ఇరాన్‌లోని ఉన్నతస్థాయి రాజకీయ వర్గాలలో ఉన్న విభేదాలు బయటపడనూవచ్చు. ఆర్థిక ఒడుదొడుకులు, సైనిక నష్టాలు, ఆంతరంగిక శత్రుత్వాలు  కేంద్ర అధికారాన్ని బలహీనపరచి దేశీయంగా ఇతర వర్గాల నుంచి పోటీ ఎదురవడానికి పరిస్థితులు అనువుగా మారవచ్చు. ప్రతిపక్షాలు కూడా ఆ వర్గాలకు మద్దతు పలుకవచ్చు. 

అడ్డూ ఆపూ లేకుండా పాలక వర్గాలు చీలిపోతే మాత్రం అత్యంత అస్థిర పరిస్థితులు దాపురిస్తాయి. లిబియాయే అందుకు తిరుగులేని తార్కాణం. అక్కడ గడాఫీ పతనం క్రమబద్ధమైన అధికార బదలీ పరిణామక్రమానికి ఏమీ దారితీయలేదు. వ్యవస్థలు కుప్పకూలాయి. మిలీషియాల మధ్య పోటీ, బాహ్య జోక్యాలు దేశంలో ప్రత్యర్థి వర్గాల మధ్య ఆజ్యం పోశాయి. లిబియా కన్నా సంక్లిష్టమైన దేశమైన ఇరాన్‌లో వ్యవస్థలు బలంగా ఉన్నాయి. అధికార యంత్రాంగాలు వేళ్ళూనుకుని ఉన్నాయి. రాజకీయ అధికార బదలీని నిర్వహించకుండా పెద్ద తలకాయను తీసేసినంత మాత్రాన పరిస్థితులు చక్కబడవు. సాయుధ వర్గాలు అధికారాన్ని చెలాయిస్తూనే ఉంటాయి. ప్రచ్ఛన పోటీకి తెరతీసినట్లు అవుతుంది.
 
ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో తాజా యుద్ధానికి ముందటి సమతుల్యత మాత్రం ఇక కచ్చితంగా ఉండదు. ఉద్రిక్తతలను సడలించేందుకు చొరవ చూపిన గల్ఫ్‌ దేశాలు ప్రతి దాడులను రుచి చూసి ఇపుడు మరింతగా బహిర్గతమయ్యాయి. ఇంధన మార్కెట్లు, ముఖ్యంగా కీలకమైన పాయింట్ల వద్ద సాగర భద్రత సున్నితమైన అంశాలుగా కొనసాగుతాయి. ఘర్షణలు మరింత ప్రబలడానికి కూడా అవి కారణాలుగా నిలువవచ్చు. అమెరికా – ఇజ్రాయెల్‌ల ప్రత్యక్ష చర్యను చూసిన ప్రాంతీయ దేశాలు తమ పొత్తులను, రక్షణ వైఖరులను పునః సమీక్షించుకుని తీరుతాయి. 

ఇరాన్‌ ఈ యుద్ధాన్ని భరించి నిలువవచ్చు. కానీ, ఇంతకాలం ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా మనుగడ సాగించిన ఆ దేశం మార్పు చెందకుండా మునుపటిలా తన అస్తిత్వాన్ని మాత్రం కొనసాగించలేదు. ఈ ఘర్షణలోని నిర్ణయాత్మక దశ మొదటగా దాడులకు దిగడంలో లేదు. స్థిరమైన సైనిక ఒత్తిడితో క్రమబద్ధ రాజకీయ వ్యవస్థ ఆవిర్భవించడంలో ఉంది. అమెరికా తన తక్షణ లక్ష్యాలను సాధించుకుని ఉండవచ్చు. అయితే, తదనంతరం రూపుదిద్దుకునే ఇరాన్, దాని ఇరుగు పొరుగు దేశాల యవనికకు అది సిద్ధంగా ఉందా అన్నదే ప్రశ్న!

డాక్టర్‌ సనమ్‌ వకీల్‌
వ్యాసకర్త ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement