చేయాల్సింది చాలా ఉంది! | Declining standards in research fields over the past few years in india | Sakshi
Sakshi News home page

చేయాల్సింది చాలా ఉంది!

Feb 27 2026 12:04 AM | Updated on Feb 27 2026 12:05 AM

Declining standards in research fields over the past few years in india

సందర్భం

ప్రపంచ ఏఐ యవనికపై శక్తిమంత మైన పాత్ర వహించగల దేశంగా భారతదేశాన్ని రూపు కట్టించడంలో ఏఐ ఇంప్యాక్ట్‌ సమ్మిట్, దానికి సంబంధించి న్యూఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ సఫలమై ఉండాల్సింది. కానీ, దేశంలో పరిశోధన–అభివృద్ధి (ఆర్‌–డి), నవీ కరణలో వైఫల్యాలకు అది అద్దం పట్టింది. గల్గోటియాస్‌ అనే ప్రైవేటు విశ్వవిద్యాలయం చైనా నుంచి రోబో డాగ్‌ను దిగుమతి చేసుకుని, ఏఐ నవీకరణ కేంద్రంగా తనను తాను చాటుకోవాలని ఉబలాటపడటం ఒక ప్రహసనంగా మారింది. దేశ విదేశాల్లో పత్రికలకెక్కి అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ ఉదంతం గత కొన్నేళ్లుగా పరిశోధన రంగాల్లో క్షీణిస్తున్న ప్రమాణాలకు పరాకాష్ఠగా నిలిచింది.

నిధుల లేమి
‘ఆర్‌–డి’పై భారతదేశ స్థూల వ్యయం, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో  కనాకష్టంగా 0.64 శాతంగా ఉంది. అమెరికా (3.48), చైనా(2.43)లతో పోల్చితే ఇది చాలా తక్కువ. పరిశోధ నకు ప్రస్తుతం తరలిస్తున్న నిధులలో చాలా భాగం జాతీయ లాబొరేటరీలు, ఐఐటీల వంటి అగ్రశ్రేణి సంస్థలకు వెళుతు న్నాయి. ఈ విషయంలో విశ్వవిద్యాలయాలు చాలా వెనుకబడి పోయాయి. ‘అనుసంధాన్‌ నేషనల్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌’, ‘రిసెర్చ్, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌’ వంటి నూతన పథకాల ప్రభావం ఇంకా కనపడవలసి ఉంది. 

ఏఐ, దాని అనుబంధ రంగాలకు చెందిన పేటెంట్లకు దరఖాస్తు చేయడంలో, పరిశోధన పత్రాల సమర్పణలో చైనా చాలా ముందుంది. బోధనా ప్రమాణాలు, పరిశోధనల ఫలితా లపై భారత్‌ దృష్టి పెట్టడం లేదు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య పొత్తును కూడా సరిగ్గా ఏర్పరచలేకపోతున్నాం. ఫలితంగా, విషయ చౌర్యం, నకిలీ పరిశోధనలు, కుహనా సైన్స్ను ప్రోత్సహించడం, సమర్పించిన పత్రాలను వెనక్కి తీసుకోవడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహా ఓహో అంటూ ఆకా శానికెత్తేయడం, స్టార్టప్‌లకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన సంస్థలు గొప్ప వాగ్దానాలు చేస్తున్నాయి; లేదా  గల్గోటియాస్‌లాగా నకిలీ గొప్పలకు పోతున్నాయి.

సోషలిస్టు ఏఐ పంథా
శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఆంత్రోపిక్‌ సంస్థ ఏఐ టూల్స్‌కు సంబంధించి ఇటీవల క్లాడ్‌ ఓపస్‌ సిరీస్‌ విడుదల చేయడం ద్వారా టెక్నాలజీ మార్కెట్లలో కలకలం సృష్టించింది. దాని ప్రకంపనలు స్టాక్‌ మార్కెట్లలోనూ నమోదయ్యాయి. ఆ టూల్స్‌ జటిలమైన ఆర్థిక విశ్లేషణకు, లాంగ్‌–ఫారమ్‌ కోడింగ్‌కు ఉపయోగపడతాయి. ఈ ఆటోమేషన్‌ టూల్స్‌ ఆవిష్కరణకు భయపడి సంప్రదాయ సిద్ధమైన సాఫ్ట్‌వేర్, లీగల్‌–టెక్‌ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు అయినకాడికి అమ్మేశారు. 

అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ సేవల రంగాన్ని కూడా ఏఐ ఏజెంట్లు అతలాకుతలం చేస్తాయే మోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలోని అతి పెద్ద ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలకు కూడాఆంత్రోపిక్‌ ఏఐ ఏజెంట్లను విక్రయిస్తోంది. అవి పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు దారితీయవచ్చు. కొన్ని భౌగోళిక ప్రాంతాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే ఏఐకేంద్రీకృతమవుతోందని పసిగట్టిన భారత్‌ ‘ఏఐ ప్రజాస్వామికీక  రణ’కు శ్రీకారం చుట్టింది. 

ఈ రంగంలో సాగుతున్న అంతర్జా తీయ పోటీలో తన స్థానాన్ని చాటుకునేందుకు ఢిల్లీ సదస్సు ద్వారా భారత్‌ ఒక ప్రయత్నం చేసింది. విద్య, ఆరోగ్యం, పరిపా లన, వస్తూత్పత్తి, వ్యవసాయం వంటి భిన్నమైన రంగాలలో కూడా ఏఐ సేవలను వినియోగించుకునేటట్లు చేయాలన్నది ఈ సమ్మిట్‌ వెనుక ఉన్న భావన. పాశ్చాత్య దేశాల్లో ఏఐలో ప్రైవేటు పెట్టుబడులు ముందున్నాయి. కానీ, భారత్‌ సోషలిస్టు పంథాను ఎంచుకుంది. మన దేశంలో ఏఐ అభివృద్ధికి ఏఐ మిషన్‌ ద్వారా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. 

భారత్‌ జెన్‌ వంటి వాటిలోనూ ప్రభుత్వ పెట్టుబడులున్నాయి. చాట్‌ జీపీటీ వంటి కమర్షియల్‌ మోడళ్లను కాకుండా ‘సావరిన్‌’ ఏఐ మోడళ్ళను భారత్‌ అభివృద్ధి చేస్తోంది. బహుళ భాషా, బహుళ సాంస్కృతిక పర్యావరణాలకు అనువైన కొత్త మోడళ్ళను అభివృద్ధి చేస్తోంది. వాటిని ప్రజా శ్రేయస్సుకు వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 

ఎన్నో రకాల సవాళ్లు
అయితే, దార్శనికతను వాస్తవికతగా మార్చడం పైకి కనిపి స్తున్న దానికన్నా ఎక్కువ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన నిపుణులైన సిబ్బంది కొరత అన్నింటి కన్నా పెద్ద సవాల్‌. దేశంలో ఐటీ సేవల రంగంలో సుమారు 60 లక్షలమంది పనిచేస్తున్నారు. క్లాడ్‌ వంటి ఏఐ టూల్స్‌తో చాలా మంది ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. మిగిలినవారికి మళ్ళీ తర్ఫీదు నివ్వడం, కొత్త నైపుణ్యాలను నేర్పించడం చేయాలి. 

అయితే, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్ళు, అప్లికేషన్లు, భద్రత, నియంత్రణ పార్శా్వలకు సంబంధించి చాలా మంది ఉద్యోగులు కూడా అవసరమవుతారు. వాస్తవిక పరిస్థితులు ఇలా ఉంటే, గ్లోబల్‌ టెక్నాలజీ సంస్థలకు ఏఐ ఇంజినీర్లను సరఫరా చేసే దేశంగా భారత్‌ అవతరిస్తుందని విధాన నిర్ణేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐటీ సేవల విషయంలో కూడా 1990లలో మనం ఇదే రకమైన తప్పు చేశాం. ఫలితంగా, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌లో భారత్‌ వెనుకబడింది. ఏఐ విషయంలో మనం అదే బాట పట్టకూడదు. 

లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లను డెవలప్‌ చేసి, తర్ఫీదు నిచ్చేందుకు అత్యుత్తమ శ్రేణి హార్డ్‌వేర్‌ అవసరం. ఆ కొరత మరో సవాల్‌. సావరిన్‌ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు ఏఐ మిషన్‌ జీపీయు క్లస్టర్‌ ఏర్పాటుపై అహరహం శ్రమిస్తోంది.కానీ, హార్డ్‌వేర్‌ వెల అధికంగా ఉండటం, గ్లోబల్‌ సప్లై చైన్‌లో  జాప్యాలు గణనీయమైన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. వాటిపై చైనా దాదాపు 98 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తోంది. అలాంటిది మనం 2029 వరకు ఐదేళ్ళ కాలంలో 1.25 బిలియన్‌ డాలర్లను మాత్రమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. 

బలమైన, సుస్థిరమైన ఏఐ మౌలిక వసతులను సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి. కొత్త విధులకు తగ్గట్లుగా ఇపుడున్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించాలి. భారత విధాన నిర్ణేతలు దానికి బదులు, ప్రైవేట్‌ క్లౌడ్ల రూపంలో క్యాప్టివ్‌ జీపీయు మౌలిక వసతులను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రైవేటు క్లౌడ్లు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్‌ వంటి గ్లోబల్‌ దిగ్గజాల చేతుల్లో ఉన్నాయి. ఇది మరో రకమైన ఔట్‌ సోర్సింగ్‌ కిందకు వస్తుంది. ఇది మరింత హానికరమైనది. భారీ డేటా సంస్థలు విద్యుత్తును, నీటిని పెద్ద మొత్తాలలో మింగేస్తాయి. పర్యావర ణాన్ని కూడా పణంగా పెట్టి ట్యాక్స్‌ హాలిడేల రూపంలో వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. 

పరిశోధన, నవీకరణను ప్రోత్సహించడంపై ప్రభుత్వానికి నిజంగా ఆసక్తి ఉంటే, అది ప్రాథమికాంశాలను విస్మరించ కూడదు. మౌలిక, అనువర్తిత ఆర్‌–డి రెండింటికీ మద్దతు ఇవ్వాలి. విద్యా, నాణ్యతా పరామితులను అమలుపరచాలి. మన విధాన నిర్ణేతలు, మంత్రులు డంబాలకు స్వస్తి చెప్పాలి. ఏఐవంటి నూతన రంగాలు సామాజికంగా కూడా తీవ్ర పర్యవసా నాలకు దారితీసేవిగా ఉన్నాయి కనుక కూలంకషమైన చర్చ అవసరం. పరిశోధన, నవీకరణపై గొప్పలు చెప్పుకోవడం ఆపా లని గాల్‌గోటియాస్‌ ఉదంతం గుర్తు చేస్తోంది. 
-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
-దినేశ్‌ సి. శర్మ

సదస్సుతో ఏం సాధించామంటే...
20 దేశాల అధినేతలు, 59 మంది మంత్రులు, అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు, దాదాపు 2.5 లక్షల మంది అతిథులతో ఢిల్లీలో ఐదు రోజులపాటు నిర్వహించిన ఏఐ సదస్సు కీలకమైనముందడుగుగా చెప్పాలి. ఫ్యాక్టరీలు, హెల్త్‌ కేర్‌ రంగంలో ఉన్న రోబోలు, వ్యాపార రంగంలో ఉన్న డ్రోన్లు, ప్రజలకు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వేరబుల్‌ డివైసెస్‌ను ఇక్కడ ప్రద ర్శించారు. 300కు పైగా ఎంపిక చేసిన పెవిలియన్లు, 600 స్టార్టప్‌లు ఇందులో భాగస్వామ్యం వహించాయి.

బెంగళూరు ఆధారిత స్టార్టప్‌ ‘సర్వం’ ఏఐ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విదేశీ టెక్‌ కంపెనీలకు సవాలు విసిరేలా తన ప్రత్యే కతను చాటుకుంది. విప్రో సంస్థ ఏఐ ఆధారిత మెడికల్‌ రోబోను ప్రదర్శించింది. క్వాల్కం ఓపెన్‌ ఏఐ రోబో పారిశ్రామిక రక్షణ సామర్థ్యాన్ని చాటింది.ఏఐ ఎకో సిస్టంలో చిప్పులు, డేటా సెంటర్లు, సర్వర్లు, ఎనర్జీ మోడళ్ళు, అప్లికే షన్లు అత్యంత ప్రధానమైనవి. 

ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలంటే మనం వాటిని సొంతంగా నిర్వహించు కునే శక్తిని సంపాదించుకోవలసి ఉంటుంది. ఇందుకు చాలా దూరం ప్రయాణించాలి. ఇప్పుడు అమెరికా నేతృత్వంలోని పార్క్‌ సిలికా టెక్‌ కూటమిలో భారత్‌ చేరింది. దీనివల్ల సెమీ కండక్టర్లు, ఏఐ టెక్నాలజీ, కీలక ఖనిజాల సప్లై చైన్లు, భారత్‌కు రక్షణ ప్రాధా న్యం లభిస్తాయి.

వివిధ దేశాలతో జట్టు కట్టి...
ఆఫ్రికాలో ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ డానికి భారత్, ఇటలీ, కెన్యా మధ్య త్రైపాక్షిక కూటమి ఏర్పడింది. ఐరోపా, ఇండో– పసిఫిక్‌ దేశాల మధ్య భారత్‌ను ఒక సాంకేతిక వారధిగా నిలపటం ఇటలీ లక్ష్యం. అలాగే ఏఐ భద్రత, ఆన్‌లైన్‌ సేఫ్టీ అంశాల పైన భారత్, బ్రిటన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సైన్స్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ కౌన్సిల్‌ సమావేశం ద్వారా ఈ సహకారం మరింత బలపడుతుంది. 

పాలన, రక్షణ రంగాల్లో ఏఐ వినియోగంపై భారత్‌తో కలిసి ఫ్రాన్స్‌ పనిచేస్తోంది. ఈ ఏడాది సదస్సులో ఫ్రాన్స్‌ క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ సేవలో ఏఐ వినియోగం, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరణపై భారత్‌తో బ్రెజిల్‌ తన అనుభవాలను పంచుకుంది. ఇలా వివిధ దేశాలు భారత్‌తో తమ సంబంధాలను మెరుగు పరచుకోవ డానికి ముందుకు రావడం శుభ పరిణామం. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్‌ కంప్యూటింగ్,స్కిల్లింగ్‌ కోసం ఇండియాలో 17.5 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడి ప్రకటించింది. ఇది ఆసియాలోనే ఆ సంస్థకు అతి పెద్ద పెట్టుబడి. 

ఏఐ రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ‘భారత్‌  జెన్‌’ పేరుతో మల్టీ మోడల్‌ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. భార తీయ భాషలు, సంస్కృతికి అనుగుణంగా కృత్రిమ మేధను అభివృద్ధి చేయటం ప్రధాన ఉద్దేశం. దేశంలోని 22 అధికార భాషల్లో ఏఐ మోడల్స్‌ రూపొందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. 

భారత్‌... గ్లోబల్‌ సౌత్‌లో మొట్టమొదటి సారిగా, అంతర్జా తీయంగా 4వ సదస్సు నిర్వహణ ద్వారా కొంత ప్రగతిని సాధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు సాధిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement