ఏఐ వినియోగించడం ద్వారా అనూహ్య లాభాలు పేరిట తెరతీసే మార్కెటింగ్ గిమ్మిక్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అమర్‌జీత్ సింగ్ తాజాగా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్లపట్ల ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏఐ వినియోగం ద్వారా అత్యుత్తమ రిటర్నులు ఆర్జించవచ్చంటూ మార్కెట్ పార్టిసిపెంట్లు కొంతమంది అతిచేయడాన్ని ఈ సందర్భంగా సింగ్ ప్రస్తావించారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, ఐఐఎంకే సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్‌లో సింగ్ పలు విషయాలను పేర్కొన్నారు.
ఏఐ వినియోగించడం ద్వారా సాధించిన అంశాలను కంపెనీలు అర్ధవంత విధానంలో తెలియజేయవలసి ఉంటుందని సూచించారు. అతిగా ఆర్జించినట్లు లేదా కొన్ని రకాల క్లెయిముల ప్రకటనలు ఇన్వెస్టర్లను మార్కెట్లపట్ల తప్పుదోవపట్టించడంతోపాటు.. విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశమున్నట్లు హెచ్చరించారు. నిజానికి విద్య, పరిశోధన, సమాచారం తదితరాలకు ఏఐ శక్తివంతమైన టూల్ అని పేర్కొన్నారు. అయితే ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తికీ వీలున్నదని, వీటిపట్ల అప్రమత్తత అవసరమని తెలియజేశారు.


