ఏసీ ధరలు అప్‌! కారణం ఇదే.. | why Voltas announced air conditioner prices will be hike | Sakshi
Sakshi News home page

ఏసీ ధరలు అప్‌! కారణం ఇదే..

Feb 26 2026 12:21 PM | Updated on Feb 26 2026 12:32 PM

why Voltas announced air conditioner prices will be hike

రాగి ధరలు పెరగడం, డాలర్‌తో మారకంలో రూపాయి బలహీనతల కారణంగా ఈ ఏడాది ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ) ధరలు 5–15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వోల్టాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకుందన్‌ మీనన్‌ తెలిపారు. పీటీఐతో మాట్లాడుతూ..., ఏసీ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఏడాది ఎనర్జీ లేబుల్‌ మార్పులు అమలు చేస్తున్నామని, దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందన్నారు.

‘గత ఏడాది రాగి ధర టన్నుకు సుమారు 8,500 డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది 12,000–13,000 డాలర్లకు చేరుకుంది. ఏసీల తయారీలో రాగి వినియోగం అధికంగా ఉండటంతో ఉత్పత్తి వ్యయంపై గణనీయ ప్రభావం పడుతోంది. అలాగే ఏసీల్లో వినియోగించే కొన్ని కీలక విడిభాగాలు ఇంకా దిగుమతులపై ఆధారపడటంతో, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా వ్యయాలను పెంచింది. ఈ పరిస్థితుల్లో ఖర్చుల ఒత్తిడిని తగ్గించేందుకు ఏసీ ధరలను 5–15 శాతం వరకు పెంచే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోంది’ అని మీనన్‌ తెలిపారు. దేశీయ ఏసీ మార్కెట్లో వోల్టాస్‌కు ప్రస్తుతం సుమారు 18 శాతం వాటా ఉందని ఆయన చెప్పారు. ఏసీల తయారీలో చైనా అగ్ర స్థానంలో ఉండగా, థాయిలాండ్‌ రెండో స్థానంలో ఉంది.

2026లో అమ్మకాలు 15–20% పెరగొచ్చు

గత ఏడాదితో పోలిస్తే 2026లో దేశీయ ఏసీ విక్రయాలు 15–20 శాతం పెరుగుతాయని మీనన్‌ అంచనా వేశారు. మార్కెట్లో పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్, తమిళనాడులోని రెండు ప్లాంట్లలో కలిపి 30 లక్షల స్లి్పట్‌ ఏసీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో పాటు మెరుగైన అమ్మకాలు, సేవల మద్దతు ఆధారంగా దేశీయ ఏసీ విభాగంలో అగ్రస్థానాన్ని కొనసాగించడమే లక్ష్యమని చెప్పారు. 

లోకలైజేషన్‌పై దృష్టి

రాబోయే రెండేళ్లలో ఏసీ యూనిట్లలో లోకలైజేషన్‌ స్థాయిని 70 శాతం నుంచి 90 శాతానికి పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మీనన్‌ తెలిపారు. తయారీలో వినియోగించే కంప్రెసర్లు, మోటార్లు, పీసీబీలు, రాగి, అల్యూమినియం భాగాల స్థానిక కొనుగోళ్లను విస్తరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం 35–40 శాతంగా ఉన్న లోకలైజేషన్‌ స్థాయి ప్రస్తుతం 70 శాతానికి చేరిందని వెల్లడించారు. లోకలైజేషన్‌ స్థాయి ప్రస్తుతం 70 శాతానికి చేరిందని తెలిపారు.

ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement