ఇప్పటి వరకు ఏసీ వినియోగించనప్పుడే వాహన మైలేజ్ నిర్ధారణ
ఇది యూరోపియన్ ప్రమాణాల ప్రకారం అంటున్న కంపెనీలు
ఇకపై కచ్చితంగా ఏసీ ఆన్, ఆఫ్‌లలో స్పష్టం చేయాలన్న ఎంఓఆర్టీహెచ్
ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అన్ని వాహనాలకు కచ్చితంగా అమలు
సాక్షి, హైదరాబాద్ : ‘ఆ కారు లీటరుకు 20 కి.మీ. మైలేజ్ వస్తుందని కంపెనీ చెప్తోంది. అంటే.. ఆన్ రోడ్ 15 నుంచి 18 వరకు రావచ్చు’... ఇది మనందరికీ సుపరిచితమైన మాటే. కంపెనీ చెప్పిన విధంగా కారు మైలేజ్ రాకపోవడానికి నిర్వహణ, ప్రయాణించే వేగంతోపాటు ఏసీ కూడా ఓ ప్రధాన కారణం. కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల మైలేజీ నిర్ధారణ సమయంలో ఏసీని ఆఫ్ చేసి నడిపిస్తాయి. ఆ కారు వినియోగిస్తున్న వినియోగదారుడు ఏసీ ఆన్ చేసి నడిపినప్పుడు అది తగ్గిపోతుంది. దీనికి చెక్ చెప్పాలని కేంద్రం అధీనంలోని రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది తప్పనిసరి చేసింది.
అన్ని కార్లకూ వర్తింపజేస్తూ...
ప్రస్తుతం తాము యూరోపియన్ ప్రమాణాలు పాటిస్తున్నామని, దాని ప్రకారం ఏసీ ఆన్‌లో లేకుండా మాత్రమే మైలేజ్‌ను కొలుస్తున్నామని కార్ల తయారీదారులు చెబుతున్నారు. అయితే పారదర్శకత పెరిగి, వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారికి కచ్చితమైన సమాచారం అందాలని మంత్రిత్వ శాఖ భావించింది. కార్లకు మరింత వాస్తవికంగా, కచ్చితమైన మైలేజ్ గణాంకాలు అందించాలనే ఉద్దేశంతో, రవాణా మంత్రిత్వ శాఖ ఎయిర్ కండిషనర్ (ఏసీ) ఆన్‌లోనే ఇంధన సామర్థ్య (ఫ్యూయల్ ఎఫీషియెన్సీ) పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించేందుకు ప్రతిపాదించింది.
ఈ నిబంధనలు ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ వాహనాలతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలు, దిగుమతి అయ్యే వాటికీ తప్పనిసరి. వాహన తయారీదారులు తమ కార్ల యూజర్ మాన్యువల్‌లో ఏసీ ఆన్‌లో, ఏసీ ఆఫ్‌లో వాహనం నడిపినప్పుడు వచ్చే మైలేజ్ వివరాలను వేర్వేరుగా, తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ సమాచారం వారి వెబ్‌సైట్లలోనూ ఉంచాల్సిందేనని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఎం1 కేటగిరీ వాహనాలన్నింటికీ...
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ ఒకటి తర్వాత మార్కెట్‌లోకి వచ్చే ఎం1 కేటగిరీకి చెందిన కార్లకు ఇది తప్పనిసరి. ఎనిమిది సీట్లలోపు సామర్థ్యం ఉన్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఈవీ వాహనాలను ఎం1 కేటగిరీకి చెందినవిగా పరిగణిస్తారు. ఈ మైలేజ్ పరీక్షలను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్)–213 ప్రమాణాల ప్రకారం పరీక్షించాలని స్పష్టం చేసింది. ఈ ప్రమాణాలను రియల్ వరల్డ్ డ్రైవింగ్ పరిస్థితులను ప్రతిబింబించేలా కాలానుగుణంగా సవరించనున్నారు.
ఏపీ వినియోగం భారత్‌లో సాధారణం కావడంతోపాటు ఇది మైలేజ్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏఐఎస్–213 ప్రమాణాలు ఏసీ ఆఫ్‌లోనే వాహన ఉద్గారాలు, ఇంధన వినియోగాన్ని కొలుస్తున్నాయి. కొత్త విధానం ప్రకారం ఇకపై ఏసీ వాడకం వల్ల వచ్చే అదనపు ఇంధన వినియోగం, ఉద్గారాలను కూడా నమోదు చేయనున్నాయి. దీని ద్వారా ఇంధన సామర్థ్యం, కాలుష్య స్థాయిలపై మరింత స్పష్టత లభిస్తుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా భవిష్యత్‌లో కార్ల యజమానులు ఆయా వాహనాల నిజమైన మైలేజ్ వివరాలను స్పష్టంగా తెలుసుకునే అవకాÔèæం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.


