సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.
మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.
కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్‌లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు.


