విశ్వాంతరాళంలో నేడు (మార్చి 3) ఒక అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాదిలో అత్యంత కీలకమైన ఘటనగా భావిస్తున్న ‘సంపూర్ణ చంద్రగ్రహణం’ నేడు ఖగోళ శాస్త్రవేత్తలను, ఔత్సాహికులను అమితంగా అలరించనుంది. నేడు ఆకాశంలో ‘బ్లడ్ మూన్’ కనిపించనున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని సాధారణ కళ్లతో చూడటమే కాకుండా, డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల ద్వారా బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు ఇప్పటికే సిద్ధమయ్యారు.
‘బ్లడ్ మూన్’ అంటే ఏమిటి?
భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేయడం వల్ల చంద్రుడు ఎరుపు లేదా రాగి రంగులోకి మారుతాడు. శాస్త్రీయ పరిభాషలో దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. సూర్యకాంతి భూ వాతావరణం గుండా ప్రయాణించే క్రమంలో తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలిరంగు కాంతి చెల్లాచెదురై, ఎక్కువ తరంగదైర్ఘ్యం గల ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడి ఉపరితలాన్ని చేరుతుంది. ఫలితంగా చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. ఇది కేవలం ఒక దృశ్య మార్పు మాత్రమేనని, దీనితో ఎటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
భారత్‌లో గ్రహణ సమయాలు
భారత కాలమానం ప్రకారం, ఈ గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 03:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 06:47 గంటలకు ముగుస్తుంది. అయితే భారతదేశంలో గ్రహణ ప్రారంభ దశలు కనిపించవు. మన దేశంలో చంద్రోదయం తర్వాతే గ్రహణ వీక్షణకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 06:26 గంటలకు చంద్రుడు ఉదయించనుండగా, 06:33 నుండి 06:40 గంటల మధ్య గ్రహణం గరిష్ట స్థాయిలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సాయంత్రం 05:18 నుండి రాత్రి 07:53 వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో సాయంత్రం 06:20 తర్వాత చంద్రోదయ వేళల్లో గ్రహణాన్ని వీక్షించవచ్చు.
అంతర్జాతీయ వీక్షణ
భారత్‌తో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, రష్యా, ఆసియా దేశాలు, అమెరికా ఖండాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. సూర్యగ్రహణంలా కాకుండా, చంద్రగ్రహణాన్ని ఎటువంటి కంటి రక్షణ పరికరాలు లేకుండా నేరుగా చూడవచ్చు. కాలుష్యం తక్కువగా ఉండి, తూర్పు దిశ స్పష్టంగా కనిపించే ప్రదేశాలను ఎంచుకుంటే వీక్షణ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. బైనాక్యులర్లు లేదా చిన్న టెలిస్కోపులు ఉపయోగిస్తే చంద్రుడి రంగు మార్పులను మరింత నిశితంగా గమనించవచ్చు. నేరుగా చూడలేని వారి కోసం అనేక సైన్స్ సంస్థలు యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఫిట్‌నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’


