ఇంజిన్‌ లేని నౌక ఇండియాకు తిరిగొస్తోంది | insv kaundinya to be flagged into mumbai harbour | Sakshi
Sakshi News home page

ఇంజిన్‌ లేని నౌక ఇండియాకు తిరిగొస్తోంది

Mar 2 2026 6:06 AM | Updated on Mar 2 2026 6:06 AM

insv kaundinya to be flagged into mumbai harbour

ముంబై హార్బర్‌లోకి ప్రవేశించనున్న ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌక

నేడు ముంబై చేరుకోనున్న ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’

సింథియా (విశాఖ): భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్‌­ఎస్‌వీ కౌండిన్య’ నౌక తన తొలి విదేశీ ప్రయాణాన్ని విజ­యవంతంగా పూర్తిచేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా సోమ­వారం రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ ముంబై హార్బర్‌లో అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ఒమన్‌ సుల్తానేట్‌కు వెళ్లి అరేబియా సముద్రం మీదుగా సాగిన ఈ చారిత్రాత్మక ప్రయాణం భారతదేశపు పురాతన సముద్ర వారసత్వాన్ని చాటిచెప్పడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌–ఒమన్‌ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాలను పునరుద్ఘాటిస్తోంది.

ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య ఒక ప్రత్యేకమైన నౌక. ఇది పురాతన భారతీయ నౌకానిర్మాణ పద్ధతులను అనుసరించి ఎలాంటి ఇంజిన్‌ లేకుండా.. చెక్క పలకలను కొబ్బరితాడుతో చేతితో కుట్టి, సహజ రెసిన్లతో సీల్‌ చేసి నిరి్మంచారు. శతాబ్దాల నాటి భారతీయ సముద్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ఈ నౌక మన సంస్కృతిని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. భారతీయ జ్ఞాన వ్యవస్థలను కాపాడుకోవడంలో దేశానికి ఉన్న నిబద్ధతకు ఈ నౌక నిర్మాణమే నిదర్శనం. 5వ శతాబ్దపు అజంతా గుహల్లోని చిత్రపటాల ఆధారంగా భారత నావికాదళ పర్యవేక్షణలో సంప్రదాయ కళాకారుల నైపుణ్యం, ఆధునిక ఇంజినీరింగ్‌ ప్రమాణాలతో దీనిని రూపొందించారు.

గత ఏడాది డిసెంబర్‌ 29న పోర్‌బందర్‌ నుంచి బయలుదేరిన ఈ నౌక ప్రాచీన నావికులు ప్రయాణించిన మార్గాల్లోనే వెళ్లి ఈ ఏడాది జనవరి 14న ఒమన్‌లోని పోర్ట్‌ సుల్తాన్‌ ఖబూస్‌కు చేరుకుంది. అక్కడ ఒమన్‌ ప్రముఖులు, ప్రవాస భారతీయుల సమక్షంలో ఈ నౌకకు ఘనస్వాగతం లభించింది. ఈ యాత్ర ద్వారా భారత్‌–ఒమన్‌ సంబంధాలు బలోపేతం అవడమే కాకుండా, ఒకప్పుడు అరేబియా సముద్రం మీదుగా జరిగిన సుగంధ ద్రవ్యాలు, వ్రస్తాల వాణిజ్య వైభవాన్ని, ఉమ్మడి సముద్రయాన సంప్రదాయాలను ఈ నౌక మరోసారి గుర్తు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement