బీఆర్ నాయుడు తప్పు చేసి అదిరేది లేదు.. బెదిరేది లేదంటారా?
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు
తన అక్రమ సంబంధాలతో సమాజానికేం నష్టం అంటూ బరితెగింపు
సీఎం చంద్రబాబు ఆయనతో రాజీనామా చేయించాలి
డీప్ ఫేక్ వీడియోలంటూ ఇప్పటికీ కాపాడాలని చూడటం సిగ్గుచేటు
నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి పోయేకాలం దగ్గర పడింది
సాక్షి, అమరావతి : కామంతో కళ్లు మూసుకు పోయి, తప్పు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సింది పోయి, అదిరేది లేదు.. బెదిరేది లేదని కోట్లాది మంది భక్తులను ఉద్దేశించి చెప్పడం అత్యంత దారుణమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని భక్తుల నుంచి డిమాండ్లు వస్తుంటే.. ఆయన మాత్రం బరితెగించి మరీ ప్రెస్‌మీట్ పెట్టి చేసిన బాగోతాన్ని సమరి్థంచుకోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
బీఆర్ నాయుడుకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయట పడినప్పుడే, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిపోయి.. 30 ఏళ్లుగా ఆ బంధం కొనసాగుతోందని చెప్పడం బరితెగింపు కాక మరేమిటని ప్రశ్నించారు. ఈ బాగోతం శానా కాలం యాదుంటది అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజీనామా చేయమంటేనే చేస్తానని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
సీఎంను కూడా భక్తులు చీదరించుకుంటున్నారు
‘దేవదేవుడైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడికి ఒకరోజు సేవ చేసుకునే భాగ్యం కలిగినా చాలని, తమ జన్మ తరించిపోతుందని ప్రతి హిందువూ భావిస్తారు. అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా ఉండే కోట్లాది మంది భక్తులు కొలిచే శ్రీవారి ఆలయానికి చైర్మన్ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా అత్యంత నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో వ్యవహరించాలి.
కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా, నా ఇష్టమొచ్చినట్టు ఉంటా.. దీనివల్ల సమాజానికి ఏం నష్టం జరిగిందని బీఆర్ నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం అత్యంత హేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ వీడియోలు వెలుగులోకి వచి్చన మరుక్షణమే బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించకుండా డీప్ ఫేక్ వీడియోలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించడం చూసి చంద్రబాబును కూడా శ్రీవారి భక్తులు చీదరించుకుంటున్నారు’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో సంబంధాలు పెట్టుకుంటావో, ఎంత మందితో తిరుగుతావో, ఎంతకాలం ఉంటావో అనేది ఆయన వ్యక్తిగత విషయమే అయినా, అత్యంత పవిత్రమైన శ్రీవారికి ఆలయ చైర్మన్‌గా ఉంటూ.. నా ఇష్టం అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడంటే ఆయనకు పదవి పోయే కాలం దగ్గర పడిందన్నారు.


