ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఔషధ మొక్కల కొలువు
ప్రత్యేకంగా సంరక్షిస్తున్న శాస్త్రవేత్తలు
ఇప్పటికే 200 రకాల పెంపకం
విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు అడుగులు
చింతపల్లి అంటే కేవలం చలికాలపు విడిది మాత్రమే కాదు.. అరుదైన ఆరోగ్య ప్రదాయినుల నిలయం కూడా. తూర్పు కనుమల్లో లభించే సుమారు 500 రకాల ఔషధ మూలికల్లో, ఇప్పటికే 200 రకాలను చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పెంచుతున్నారు. మారుతున్న జీవనశైలిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, వందలాది మూలికలను మదర్ ప్లాంట్లుగా సంరక్షిస్తూ, చింతపల్లిని ఒక విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు.
చింతపల్లి: ప్రకృతి ప్రసాదించిన వర ప్రసాదాలు.. తూర్పు కనుమల గుండెల్లో దాగి ఉన్న అద్భుత మూలికలు ఇప్పుడు అల్లూరి జిల్లా చింతపల్లిలో కొలువుదీరాయి. మారుతున్న కాలంతో పాటు భారతీయ ప్రకృతి వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఔషధ మొక్కల పెంపకం, వీటి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. మదర్ ప్లాంట్ల సంరక్షణ.. విత్తనోత్పత్తి కేంద్రంగా ముందడుగు వేస్తోంది.
తూర్పు కనుమల్లో సుమారు 500 రకాల ఔషధ మూలికలు ఉండగా, ప్రస్తుతం చింతపల్లి పరిశోధనా స్థానంలో 200 రకాలను ప్రత్యేక క్షేత్రంలో సంరక్షిస్తున్నారు. వీటిని మదర్ ప్లాంట్లుగా భావిస్తూ, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని ఔషధ మొక్కల విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యాటకులు సైతం ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడి మొక్కల విశిష్టతను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఏ మొక్క.. ఏ వ్యాధికి?..
ఈ క్షేత్రంలోని ప్రతి మొక్కకూ ఒక ప్రత్యేకత ఉంది. వేరు, ఆకు, కాండం, బెరడు ఇలా ప్రతి భాగం ఏదో ఒక వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
కొన్ని ముఖ్యమైన మొక్కల ఉపయోగాలు
నేల ఉసిరి: రక్తపోటు, అధిక వేడిమిని తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటితో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అశ్వగంధ: యవ్వన శక్తిని పెంచుతుంది. అధిక బరువు, పొట్ట తగ్గడానికి, చర్మ వ్యాధుల నివారణకు మేలు చేస్తుంది.
కలబంద: ముఖ సౌందర్యం, చుండ్రు, మధుమేహం, రక్తమొలల నివారణలో కీలకం.
వస: గొంతు సంబంధిత వ్యాధులు, నత్తి మాటలు తగ్గడానికి మరియు చిన్న పిల్లలు త్వరగా మాట్లాడడానికి సహకరిస్తుంది.
శతావరి: కిడ్నీలో రాళ్లు, ఇతర మూత్రపిండ సమస్యలు, కామెర్ల నివారణకు దీని దుంపలు అద్భుతంగా పనిచేస్తాయి.
సర్పగంధి: రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తేనెతో కలిపి తీసుకుంటే తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాషాణబేరి: గుండె జబ్బులు, ఉబ్బసం, ఊబకాయం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
మానవాళి ఆరంభం నుంచి మూలికా వైద్యమే మూలాధారంగా ఉంది. చిన్న చిన్న వ్యాధులను ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, రైతులు, సామాన్యులకు వీటిపై చింతపల్లి శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రత్యేక ప్రాజెక్టుమంజూరుకు కృషి
పరిశోధనా స్థానంలో ఔష ధ మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు ఔషధ మొక్కలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలను మదర్ ప్లాంట్లుగా సంరక్షిస్తున్నందున, సందర్శకులకు వీటిని పంపిణీ చేయడం సాధ్యపడటం లేదు.
భవిష్యత్తులో చింతపల్లి కేంద్రంగా ‘ఔషధ మొక్కల విత్తనోత్పత్తి కేంద్రం’ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేంద్రం ఏర్పాటుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేస్తే ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. – డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి,ఏడీఆర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి


