దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఊబకాయం
ప్రముఖ వైద్య సంస్థల నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో ఊబకాయం సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 9.8 శాతం మంది మహిళలు, 5.4 శాతం మంది పురుషులు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య 2050 నాటికి మహిళల్లో 17.4 శాతం, పురుషుల్లో 12.1 శాతానికి పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాన్ని ఢిల్లీ ఎయిమ్స్, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, గురుగ్రామ్‌లోని ఫోరి్టస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, త్రివేండ్రంలోని జ్యోతిదేవ్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన 12 మంది నిపుణులు రూపొందించిన నివేదికలో వెల్లడించారు. అంతర్జాతీయంగా ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించినప్పటికీ.. భారత్‌లో మాత్రం జీవన శైలి సమస్యగా మాత్రమే చూస్తున్నారని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ సమస్యను అరికట్టడానికి విధానపరమైన మార్పులు అవసరమని సిఫార్సు చేశారు.
కొంప ముంచుతున్న హెడోనిక్ హంగర్
5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలు, యువతలో ఊబకాయం సమస్య అత్యధికంగా ఉంటోంది. 1990–2022 మధ్య బాలికల్లో 0.1 శాతం నుంచి 3.1 శాతానికి, బాలురలో 0.2 శాతం నుంచి 3.7 శాతానికి సమస్య పెరిగింది. ఇది కేవలం జన్యులోపంతో వచ్చే సమస్య మాత్రమే కాదని.. జీవక్రియ, నరాల సంబంధిత, పర్యావరణ కారకాల కలయికతో వస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. శరీరంలో కొవ్వు కణాలు పెరగడంతో వచ్చే వాపు ఇన్సులిన్ నిరోధకతకు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులకు దారితీస్తోందని.. క్లోమ, మూత్రాశయ, రొమ్ము, గర్భాశయ కేన్సర్ల ముప్పు పెంచుతోందని హెచ్చరించారు.
శరీరానికి శక్తి అవసరం లేకపోయినా.. కేవలం నోటికి రుచి కోసం తీసుకునే హెడోనిక్ హంగర్ కొంప ముంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఆకలి లేకపోయినా ఆనందం, ఆహ్లాదం, నోటికి రుచి కోసం తీసుకునే స్వీట్లు, బిర్యానీ, పిజ్జా, ఇతర జంక్ ఫుడ్స్ ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఫుడ్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక హెడోనిక్ హంగర్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఇలా హెడోనిక్ హంగర్ అలవాటు ఉన్న వాళ్లు పదేళ్లలో ఊబకాయం బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరించారు.
కార్యాచరణ అత్యవసరం
ఊబకాయాన్ని నిరోధించేందుకు అత్యవసర కార్యాచరణ చేపట్టాలని శ్వేతపత్రంలో నిపుణులు స్పష్టం చేశారు. ఊబకాయం నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన చికిత్స, పర్యవేక్షణకు మార్గదర్శకాలు అవసరమని నొక్కిచెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో క్లినిక్‌ల ఏర్పాటు, పాఠశాల దశలోనే పిల్లల ఆహార అలవాట్లలో మార్పు తెచ్చే కార్యక్రమాలు సహా ఈ చికిత్సలకు బీమా సౌకర్యం వంటివి కూడా తీసుకురావాలని శ్వేతపత్రంలో సూచించారు.


