ఎకానమీకి క్రూడ్‌ షాక్‌ | Oil prices rise sharply after US and Israeli attacks on Iran | Sakshi
Sakshi News home page

ఎకానమీకి క్రూడ్‌ షాక్‌

Mar 3 2026 5:09 AM | Updated on Mar 3 2026 6:45 AM

Oil prices rise sharply after US and Israeli attacks on Iran

పశ్చిమాసియాలో యుద్ధంతో భగ్గుమన్న ముడిచమురు

13 శాతం ఎగబాకిన బ్యారెల్‌ క్రూడ్‌ ధర 

హర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్‌ ఎడాపెడా దాడులు 

దీంతో చమురు, గ్యాస్‌ సరఫరాలకు తీవ్ర అంతరాయం 

యుద్ధం మరింత ముదిరితే క్రూడ్‌ రేటు 100 డాలర్ల పైకి! 

దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడిన భారత్‌పై తీవ్ర ప్రభావం 

మన ఎగుమతులకూ భారీగా దెబ్బ.. 

రూపాయి పతనం.. జీడీపీకి భారీ నష్టం

పశ్చిమాసియా మిసైళ్ల మోతతో దద్దరిల్లుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో ఇప్పుడు గల్ఫ్‌ దేశాలన్నీ అట్టుడుకుతున్నాయి. ఇరాన్‌ ప్రతీకార దాడులతో యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ముడి చమురు భగ్గుమంటోంది. ప్రపంచ క్రూడ్, గ్యాస్‌ సరఫరాకు కీలక మార్గమైన హర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్‌ విరుచుకుపడుతుండటంతో క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. సోమవారం క్రూడ్‌ రేట్లు 13 శాతం దూసుకెళ్లాయి. చమురు ధరలు మరింత పెరిగితే.. అసలే అంతంతమాత్రంగా ఉన్న అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌ లాంటి దేశాలకు క్రూడ్‌ సెగ శరాఘాతంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు.. గల్ఫ్‌ దేశాలకు మన ఎగుమతులు కూడా దిగజారితే ఎకానమీకి దెబ్బమీద దెబ్బ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికా – ఇజ్రాయెల్,  ఇరా¯Œ   మధ్య చెలరేగిన యుద్ధంతో గల్ఫ్‌ ప్రాంతం అగి్నగుండంగా మారుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హర్ముజ్‌ జలసంధిని యుద్ధ ప్రభావంతో ఎక్కువ కాలంపాటు మూసివేస్తే గ్లోబల్‌ ఆయిల్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 15 శాతం, గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) సరఫరాల్లో 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ట్యాంకర్‌ ట్రాఫిక్‌ను వెంటనే పునరుద్ధరించకపోతే క్రూడ్‌ బ్యారెల్‌ ధర 100 డాలర్ల పైకి దూసుకెళ్తుందని కన్సల్టెన్సీ సంస్థ వుడ్‌ మెకెంజీ పేర్కొంది. సోమవారం నైమెక్స్‌ క్రూడ్‌ రేటు బ్యారెల్‌ 75 డాలర్లను తాకగా.. బ్రెంట్‌ క్రూడ్‌ 83 డాలర్ల గరిష్టానికి చేరింది. హర్ముజ్‌ జలసంధి మూసివేతతో షిప్పింగ్‌ రేట్లు, బీమా ధరలు మరింత పెరిగిపోవచ్చని కూడా మెకెంజీ హెచ్చరించింది.

రెమిటెన్సులపై ప్రభావం.. 
గల్ఫ్‌ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల వీరి ఉపాధికి ముప్పు రావొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగాల కోతలకు దారితీస్తుంది. ఇది రెమిటెన్సుల (విదేశాల నుంచి భారతీయులు స్వదేశానికి పంపే సొమ్ము) మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 2023–24 ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం భారత్‌కు 118.7 బిలియన్‌ డాలర్ల రెమిటెన్సులు రాగా.. అందులో సుమారు 38 శాతం (40–45 బిలియన్‌ డాలర్లు) గల్ఫ్‌ దేశాల నుంచే (ఇందులో సగం వాటా యూఏఈదే) వచ్చాయి. ఇరాన్‌ దాడులతో యూఏఈ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇతర గల్ఫ్‌ దేశాల ఎకానమీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో భారత్‌కు వచ్చే రెమిటెన్సులపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా.

సరఫరాలకు గండి.. 
ఒకపక్క, హర్ముజ్‌లో అడ్డంకులు.. మరోపక్క సౌదీ తదితర దేశాల్లో రిఫైనరీలపై ఇరాన్‌ దాడులకు తెగబడుతుండటంతో క్రూడ్‌ సరఫరాలకు గండి పడే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఒపెక్‌ ప్లస్‌ దేశాలు సరఫరాలను పెంచడానికి యతి్నస్తున్నాయి. అయినప్పటికీ కీలకమైన ఈ జలసంధి ద్వారా ఎగుమతులను పునరుద్ధరించేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని వుడ్‌ మెకెంజీకి చెందిన సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అలాన్‌ గెల్డర్‌ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం సమయంలో క్రూడ్‌ బ్యారెల్‌ ధర గరిష్టంగా 130 డాలర్లకు భగ్గుమంది (2008లో బ్యారెల్‌ 148 డాలర్లు ఆల్‌టైమ్‌ గరిష్టం).

ఇప్పుడు మళ్లీ గల్ఫ్‌ వార్‌ దెబ్బకు తోడు హర్ముజ్‌ ద్వారా రవాణాకు గండిపడటంతో క్రూడ్‌ 100 డాలర్ల పైకి ఎగబకావచ్చనేది ఆయన అంచనా. ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రం వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొన్ని సరఫరాలను పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ.. హర్ముజ్‌ ఎగుమతుల నష్టాన్ని పూర్తిగా పూడ్చడం సాధ్యం కాదని కూడా గెల్డర్‌ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాల్లో 20 శాతం రవాణా కూడా హర్ముజ్‌ ద్వారానే జరుగుతోంది. ప్రధానంగా ఖతార్‌ నుంచి ఆసియా, యూరప్‌ మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ భారీగా రవాణా అవుతుంది. తాజా సరఫరా అంతరాయాలతో గ్యాస్‌ రేట్లు కూడా మండిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎగుమతులపై ఎఫెక్ట్‌
గల్ఫ్‌ వార్‌తో ఎగుమతుల రంగంపై పెను ప్రభావం పడే అవకాశముంది. పశ్చిమాసియా మార్కెట్లలో డిమాండ్‌ పడిపోతుంది. భారత్‌కు పశ్చిమాసియా ప్రధాన ఎగుమతి మార్కెట్‌. ముఖ్యంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ దేశాలు దేశీ ఎగుమతులకు కీలకం. భారత్‌ మొత్తం ఎగుమతుల్లో 17 శాతం (62 బిలియన్‌ డాలర్లు) వాటా పశ్చిమాసియాదే. ఇందులో ముఖ్యంగా బాస్మతి బియ్యం, చక్కెర, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఉత్పత్తులు, రత్నాభరణాలు, టెక్స్‌టైల్, ఫార్మా ఉత్పత్తులతోపాటు ఐటీ సేవల ఎగుమతుల పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. డిమాండ్‌ తగ్గడం ఒకెత్తయితే హర్ముజ్‌ జలసంధి గుండా రవాణా స్తంభించడం కంపెనీలను మరింత దెబ్బతీసే అంశం. ఎగుమతులకు అంతరాయంతో 30కి పైగా లిస్టెడ్‌ కంపెనీలపై ప్రభావం పడుతుందని మార్కెట్‌ వర్గాలు లెక్కలేస్తున్నాయి.

మార్కెట్లు బేర్‌... 
కూడ్‌ దెబ్బకు తోడు, రూపాయి పతనం.. దిగుమతుల భారం... ఎగుమతులకు గండితో మన జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు విలవిల్లాడతాయి. ఇప్పటికే తిరోగమనం బాట పట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలకు తెగబడే అవకాశం ఉంది. నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్టం (26,373 పాయింట్లు) నుంచి తాజాగా (24,603 పాయింట్లు) 7 శాతం మేర పడింది. ఎకానమీపై గల్ఫ్‌ వార్‌ దెబ్బకు మన మార్కెట్లలో ఆటుపోట్లు తప్పవని, మరింత దిగజారే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

భారత్‌కు డబుల్‌ షాక్‌... 
భారత్‌ ముడిచమురు అవసరాల్లో 85 శాతం (రోజుకు దాదాపు 4.2 మిలియన్‌ బ్యారెల్స్‌) దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో ప్రస్తుతం దాదాపు సగం హర్ముజ్‌ జలసంధి ద్వారానే మనకు చేరుతోంది. ఇప్పుడు గల్ఫ్‌లో యుద్ధం దెబ్బకు క్రూడ్‌ రేట్లు ఎగబాకుతుండటంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడయ్యే పరిస్థితి. వార్‌ ఎక్కువ రోజులు సాగి.. క్రూడ్‌ రేట్లు 100 డాలర్ల పైకి చేరితే.. పెట్రోలు, డీజిల్‌ ధరలు కూడా భగ్గుమంటాయి. దీంతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చి ప్రజల జేబుకు చిల్లుపడుతుంది. మరోపక్క, డాలరుతో రూపాయి మారకం విలువ 91.5కు పడిపోవడం కూడా ఎకానమీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. రూపాయి పతనంతో చమురు దిగుమతులు మరింత భారంగా మారతాయి.

దీనివల్ల రూపాయి విలువ మరింత పడిపోయేందుకు దారితీయొవచ్చని ఇంధన రీసెర్చ్‌ సంస్థ రిస్టాడ్‌ ఎనర్జీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. బ్యారెల్‌ క్రూడ్‌ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 30 బేసిస్‌ పాయింట్లు (0.3 శాతం) మేర దిగజారుతుందని మోర్గాన్‌ స్టాన్లీ హెచ్చరించింది. ఇక అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి భారత్‌ చమురు సరఫరా దాదాపు నిలిపివేసింది. భారత్‌కు రావాల్సిన రోజుకు 1.8 మిలియన్‌ బ్యారెల్స్‌ చౌక రష్యా క్రూడ్‌ ఇప్పుడు చైనాకు తరలిపోతోంది. 10–15 డాలర్ల డిస్కౌంట్‌ ధరకు లభించే రష్యా క్రూడ్‌ను కాదనుకోవడం.. ధరలు భగ్గుమనడం భారత్‌ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎయిర్‌లైన్స్‌ లబోదిబో... 
భారత్‌ నుంచి పశ్చిమ దేశాలకు రాకపోకల్లో దుబాయ్‌ కీలకమైన ట్రాన్సిట్‌ హబ్‌గా నిలుస్తోంది. యుద్ధంతో గల్ఫ్‌ మొత్తం వార్‌ జోన్‌గా మారడం, గగనతలాలను మూసేయడంతో భారతీయ విమానయాన సంస్థలు లబోదిబోమంటున్నాయి. ఎయిర్‌పోర్టుల మూసివేతతో యూరప్, యూకేలకు వెళ్లే పలు విమానాలు రద్దుకావడం,  మరికొన్ని వేరే రూట్లకు మళ్లించడం వల్ల ప్రయాణికులకు తిప్పలతోపాటు ఇండిగో, ఎయిరిండియాల వంటి ముఖ్యమైన ఎయిర్‌లైన్స్‌ ఖర్చులు భారీగా ఎగబాకనున్నాయి. చమురు రేట్ల పెరుగుదల ప్రభావం (ఏటీఎఫ్‌) కూడా కంపెనీలకు కునుకులేకుండా చేస్తోంది. భారతీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు వారానికి రూ.875 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చని మారి్టన్‌ కన్సలి్టంగ్‌కు చెందిన మార్క్‌ డి.మారి్టన్‌ పేర్కొన్నారు. యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించకపోవడం.. గల్ఫ్‌ దేశాల విషయంలో సెంటిమెంట్‌ దెబ్బతినడంతో ట్రావెల్‌ కంపెనీలు కూడా భారీగా నష్టపోతాయనేది పర్యాటక రంగ నిపుణుల మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement