గల్ఫ్‌ దేశాల గుండెల్లో గుబులు | Sakshi Guest Column On Gulf countries in Fear | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాల గుండెల్లో గుబులు

Mar 3 2026 5:06 AM | Updated on Mar 3 2026 5:06 AM

Sakshi Guest Column On Gulf countries in Fear

అమెరికా–ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో మూడో రోజు కూడా గల్ఫ్‌ ప్రాంతం రణరంగంగా మారింది. కువైట్‌లో అమె రికాకు చెందిన రెండు ఎఫ్‌–15 యుద్ధ విమానాలను ఇరాన్‌ రెవల్యూ షనరీ గార్డ్స్‌ క్షిపణులతో కూల్చివేశారు. అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడం ఇటీవల అరుదైన విషయం. ఇరాన్‌ మిస్సైల్‌ డ్రోన్ల దాడులకు సౌదీ అరేబియా వణికిపోయి అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీని మూసివేసింది. ఇరాన్‌ క్షిపణులతో గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావ రాలు ఉన్న దేశాలు వణికిపోయాయి. 

అమెరికా, ఇజ్రాయెళ్లు ఇరాన్‌ సుప్రీం నాయకుడు ఖమేనీని హత్య చేసి రెడ్‌ లైన్‌ దాటాయనీ, గల్ఫ్‌లో అమెరికాకు కీలకమైన దేన్నీ వదిలిపెట్టమనీ ఇరాన్‌ సైన్యం హెచ్చరించింది. ఇరాన్‌లో పరిపాలనను అమెరికా, ఇజ్రాయెళ్ల తొత్తుల చేతుల్లోకి మార్చడం అసాధ్యమని రెండు దేశాలూ గుర్తించి ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్, లాస్‌ ఏంజెల్స్, న్యూయార్క్‌ తదితర అనేక పట్టణాలలో భారీ ప్రదర్శనలు జరిగాయి. పాకిస్తాన్‌లో వేల మంది ప్రదర్శన కారులపై జరిగిన మిలిటరీ దాడిలో 21 మంది చనిపోయారు.

ఇరాన్‌కు 2025 వేసవిలో జరిగిన 12 రోజుల యుద్ధపు గాయాలు, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల పెరిగిన ఇటీవలి ధరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ గాయాలు మాననే లేదు. మళ్లీ యుద్ధం వచ్చిపడింది. ‘పెంటగాన్‌’ వద్దని చెప్పినా వినకుండా అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం చేస్తున్నాయి. ఒమన్, స్విట్జర్లాండ్‌ మధ్యవర్తులుగా అమెరికా–ఇరాన్‌ల మధ్య మూడో దఫా చర్చలు జరుగుతున్నాయి. యుద్ధాన్ని నివారించడానికి పశ్చిమ ఆసియాలోని అన్ని దేశాలతో కలిసి చైనా ప్రత్యేక రాయబారి ఎడతెరిపి లేని దౌత్య ప్రయత్నాలు చేస్తున్నా అమెరికా–ఇజ్రాయెళ్లు... ఇరాన్‌పై ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించాయి. 

యుద్ధానికి  రెండు రోజుల ముందు, భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం నివ్వెర పరిచింది. గాజాపై పాలస్తీనా చేసిన జాతి హత్యాకాండతో, ప్రపంచంలో ఏకాకిగా మారిన బెంజిమెన్‌ నెతన్యాహూతో కలిసి మోదీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ పర్యటన భారత విదేశాంగ విధానంపై గల్ఫ్‌ దేశాలలో అనేక  అనుమానాలకు దారి తీసింది. అమెరికా డాలర్‌ ఆధిపత్యాన్ని కూల్చడానికి చైనా ఆధ్వర్యంలో రష్యా, బ్రెజిల్‌ తదితర దేశాలతో కలిసి భారత్‌ బ్రిక్స్‌ సీబీడీసీ డిజిటల్‌ కరెన్సీ అనుసంధానాన్ని ప్రపంచ స్థాయిలో కొనసాగిస్తోంది. అనేక రకాలుగా అండనిస్తున్న అరబ్బు మిత్రులను వదిలి భారత్‌ ఇజ్రాయెల్‌ వైపు ఎందుకు ఒరుగుతోంది?

హోర్మూజ్‌ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైనది. ఇది ఇరాన్‌ సముద్ర జలాల్లో ఉంది. పర్షియన్‌ సింధు శాఖ, ఒమన్‌ సింధు శాఖలను కలిపే అత్యంత ఇరుకైన సముద్ర మార్గమిది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం (ఐదో వంతు) ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీనిని ‘ప్రపంచ చమురు జీవనాడి’ అని పిలుస్తారు. ఖమేనీ హత్యతో ఇరాన్‌ ఈ జలసంధిని మూసివేసింది. దీంతో ఇప్పుడు ప్రపంచానికి చమురు తిప్పలు పెరిగాయి. భారత్‌ తన చమురు అవసరాల్లో దాదాపు 40%ను ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి భారత్‌లో పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. 

ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో పాలస్తీనా స్వయం నిర్ణయాధికార హక్కును భారత ప్రధాని గుర్తించారు. ‘హమాస్‌’ దాడిని, హత్యలను ఖండించారు. కానీ 75 వేల గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ చేసిన హత్యా కాండను ఖండించలేదు. ఇప్పుడు భారత చిరకాల స్నేహితుడైన ఇరాన్‌పై యుద్ధం ఆపమని మోదీ అమెరికా–ఇజ్రాయెళ్లను కోరక పోవడం ఓ విషాదం. గల్ఫ్‌ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నంత కాలం నిజమైన శాంతి లేదని ఆ దేశాల ప్రజలలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆర్థిక వ్యవస్థల వినాశనానికి అసలు కారణం ‘అమెరికా సైనిక స్థావరాలే కదా’ అనే ఆలోచన గల్ఫ్‌ దేశాల అగ్ర నాయకుల గుండెల్లో పాతడంలో ఇరాన్‌ విజయం సాధించింది.
– నైనాల గోవర్ధన్‌ ‘  సామాజిక విశ్లేషకులు 

Advertisement
 
Advertisement
Advertisement