చీకటిని చూస్తేనే వెలుగు విలువ మరింత తెలుస్తుందంటారు. అదే ప్రకారం, అంత ర్జాతీయ వాణిజ్య సంబంధాల విషయమై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఏప్రిల్‌లో సృష్టించిన చీకటిని పది నెలల పాటు చూసిన ప్రపంచానికి, నియ మబద్ధమైన వాణిజ్యపు విలువ ఏమిటో గతం కన్నా ఎక్కువగా అర్థమైంది. కానీ ఇప్పటికీ అర్థం కానిది అమెరికా అధ్య క్షునికే! లేని అధికారాలను ఉపయోగించి ఇష్టారీతిన దిగుమతి సుంకాలు విధించటం చెల్లుబాటు కాదని అక్కడి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పును ఈ నెల 20వ తేదీన చెప్పిన తర్వాత కూడా ఆయన తమ విధానాలు మారబోవని ప్రకటించారు. మరొక రూపంలో అదనపు సుంకాలను అమలుకు తేవటంలోని అవివేకం ప్రపంచానికంతా అర్థమవుతున్నది ఆయనకు తప్ప!
అయినా మారడా?
ఇక్కడ గమనించదగ్గది మరొకటి ఉంది. అమెరికాను తిరిగి గొప్పదిగా చేసే ప్రణాళికలో సుంకాల హెచ్చింపు ఒక భాగం. దాని కోసం ఈ పది నెలలుగా సాధించిన ఫలితాలలో, సుమారు 120 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని మినహాయించితే, ఇతర లక్ష్యాలు ఒక్కటైనా సిద్ధిస్తున్న సూచనలు లేవు. నికర బడ్జెట్ లోటు అంతకుమించి పెరుగుతున్నది.
ఒక డజను దేశాలపై సైనిక దాడులు జరిపి, మరిన్ని దాడులకు సన్నాహాలు చేస్తున్నందున సైనిక ఖర్చుల రూపంలో జీడీపీ పెరుగుదల 1.4 శాతానికి తగ్గగా, ద్రవ్యోల్బణం మళ్లీ 3 శాతానికి చేరింది. ఉద్యోగాల పెరుగుదల ఇంత తక్కువగా ఉండటం 2013 తర్వాత ఎప్పుడూ లేదని గణాంకాలు చెప్తున్నాయి. డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు గందరగోళానికి గురవుతున్నాయి.
వీటన్నింటి ఫలితాలను అనుభవిస్తున్న అమెరికన్ ప్రజలలో ట్రంప్ ప్రజాదరణ వరుసగా పడిపోతున్నట్లు ప్రజాభిప్రాయ సేకర ణలు చెప్తున్నాయి. అంతకుమించి, స్వయంగా తనకు బలమైన మద్ద తుగా నిలిచి అధికారంలోకి తెచ్చిన ‘మాగా కానిస్టిట్యుయెన్సీ’ అని పిలిచే సామాజిక తరగతులలోనూ బలం తగ్గుతుండగా, ఈ కాలంలోనే జరిగిన మూడు గవర్నర్ ఎన్నికలను రిపబ్లికన్ కంచుకోట లుగా భావించే రాష్ట్రాలలో ఓడిపోయారు. రానున్న నవంబర్ నాటి మధ్యంతర ఎన్నికలలోనూ ఇదే జరిగితే పరిస్థితి ఏమిటన్న భయాలు ట్రంప్ పార్టీలో మొదలయ్యాయి. ‘అయినా ఆయన మార లేదు’ అన్న ఒక తెలుగు కథలోని వాక్యం వలె, ‘అయినా ట్రంప్ మారటం లేదు’.
అందరితోనూ అదే ధోరణి
ఇవి, ఇంకా ఇటువంటివి అమెరికాలో అంతర్గతంగా కనిపి స్తున్న పరిస్థితులు. బయటి మాట చెప్పనక్కర లేదు. ట్రంప్ గత ఏప్రిల్‌లో ‘విమోచనా దినం’ అంటూ ప్రపంచంలోని సమస్త దేశా లపై సమాంతరమైన ఎదురు సుంకాలు అంటూ ఒక పిడుగును విసిరినప్పటి నుంచి వాణిజ్య ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారటం తెలిసిందే. ఆ పరిస్థితి ఇప్పటికీ కుదుట పడలేదు సరికదా సమీప భవిష్యత్తులో కుదుటపడే సూచనలు కూడా లేవు. అందుకు కారణం తిరిగి ఆయన చర్యలే!
ఏ దేశంపై సుంకాలను ఎపుడు ఇంకా పెంచుతారో, తగ్గిస్తారో తెలియదు. ఒక దేశానికి తమతో వాణిజ్యం కావాలంటే వారు మరేదో మూడవ దేశంపై సుంకాలు పెంచాలని ఒత్తిడి చేస్తారో తెలి యదు. వాణిజ్యంతో నిమిత్తం లేకుండా రాజకీయాల కోసం చేసేదీ తెలియదు. ఇతర దేశాలలో నడుస్తున్న అమెరికన్ కంపెనీలను వాపస్ రానట్లయితే వంద శాతం సుంకాలంటారో తెలియదు. తమ ఆయుధాలు, బోయింగ్‌లు, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు, పారి శ్రామిక ఉత్పత్తులను చచ్చినట్లు ఖరీదు చేసే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయనట్లయితే సుంకాలు వంద శాతమనేదీ, 500 శాతమ నేదీ తెలియదు.
‘మీరు మీకు కావలసిన చమురు వగైరాలను మాకు నచ్చని దేశాల నుంచి ఖరీదు చేయటం ఆపివేసి మేము చెప్పిన చోటు నుంచే కొనుగోలు చేయా’లని ట్యారిఫ్‌ల కొరడా ఝళిపించేదీ తెలియదు. దీనంతటికి తమ కూటమి దేశాలు సైతం మినహాయింపు కాకపోవటమే కాదు, వారికి చెందిన భూభాగాలను తమకు స్వాధీనం చేయకున్నా ట్యారిఫ్‌ల ఖడ్గ చాలనం చేస్తారు. కెనడావంటి అతి సన్నిహిత దేశంపై పెంచిన సుంకాలను స్వయంగా తన రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించి ఓడించినా లెక్క చేయరు.
అదే శరణ్యం
ఇన్నిన్ని వివరాలు ఇంత సుదీర్ఘంగా చెప్పుకోవటం ఎందుకంటే, ఏప్రిల్‌లో ‘విమోచనా దినం’ నాడు అమెరికా అధ్యక్షుడు అడ్వాన్స్ విజయ దరహాసంతో ప్రకటించినట్లు, ట్యారిఫ్‌లన్నవి ‘మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ’ ఏమీ కాదు. తనవి పూర్తిగా తప్పుడు అంచనాలతో కూడిన లెక్కలని ఈ పది మాసాలలో ఇంటా బయటా కూడా రుజువైంది. అసమర్థుని జీవయాత్ర వలె ఇది ఒక అవివేకపు అధ్యక్షుని ఆర్థిక యాత్ర. ఆ యాత్రలో రెండవ అంకాన్ని ఆయన ఈనెల 20న సుప్రీం కోర్టు తీర్పు కలిగించిన భయం నుంచి మొదలు పెట్టారు.
న్యాయమూర్తులను మనం ఊహించలేని భాషలో దూషించి, తమ విధానాలు మారబోవని ప్రకటించారు. తనకు ఇతర మార్గాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించి దేశాలను ‘సర్వ నాశనం’ చేయగలనన్నారు. 150 రోజుల కాల పరిమితి గల సెక్ష న్లను, అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ ఉపయోగించని వాటిని బయటకు తీసి, ఆ ప్రకారం అన్ని దేశాలపై 10 శాతం అదనపుసుంకమని, అంతలోనే 15 శాతానికి పెంచారు. ఇప్పటికే జరిగిన వాణిజ్య ఒప్పందాల నుంచి ఏ దేశమూ తప్పించుకోరాదని హెచ్చ రించారు.
ఈ అదనపు సుంకాలను తాము చెల్లించబోమని యూరో పియన్ యూనియన్ స్పష్టం చేయగా, అసలు తన ఒప్పందంపై తుది చర్చలను ఇండియా వాయిదా వేసింది. ఈ విధమైన రెండవ అంకపు నాటకంలో ఇంకేమి పరిణామాలుండగలవో చూడాలి.మొత్తం మీద తేలుతున్న పాఠం ఏమిటంటే, తనకు ఏ అంత ర్జాతీయ నియమాలు లేవంటూ ట్రంప్ విచ్ఛిన్నం చేయబూనిన నియమాల ప్రకారం వాణిజ్యం, ఆర్థిక, రాజకీయ సంబంధాలే బలో న్మత్త మదపుటేనుగులకైనా అనుసరించదగిన విధానాలవుతాయి.
ఈ నియమాలను అమెరికాయే నాయకత్వం వహించి రెండవ ప్రపంచ యుద్ధం దరిమిలా రూపొందించటం గాని, ఇన్ని దశాబ్దాలుగా పాటించటంగాని ఎంతో దూరదృష్టితో జరిగినటువంటిదే! ఆ నియ మాలు పూర్తి న్యాయబద్ధమైనవేమీ కాదు. అవి ధనిక దేశాలకు అను కూలం, వర్తమాన దేశాలకు ప్రతికూలం అయినా కనీసం ఒక పద్ధతిలో సాగుతూ వచ్చాయి. ట్రంప్‌కు అదే శరణ్యం కావాలి.
-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
-టంకశాల అశోక్


