ఇరాన్‌పై అమెరికా దాడి.. ఫ్రస్ట్రేషన్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ | US President Donald Trump frustrated by Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా దాడి.. ఫ్రస్ట్రేషన్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌

Feb 28 2026 1:13 AM | Updated on Feb 28 2026 9:16 AM

US President Donald Trump frustrated by Iran

వాషింగ్టన్‌: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అణు కార్యక్రమాన్ని ఆపాలని అమెరికా హెచ్చరిస్తుండగా.. ఆపేది లేదని ఇరాన్‌ అంటోంది. ఇదే అంశంపై స్విర్జర్లాండ్‌లోని జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. గంటల తరబడి జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో చర్చల నుంచి  అమెరికా ప్రతినిధులు నిరాశతో వెనుదిరిగారు. అయితే ఇరాన్‌ మాత్రం చర్చల్లో పురోగతి సాధించాం’ అని ప్రకటించింది. ఈ విభిన్న అభిప్రాయాలు చర్చల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

శుక్రవారం చర్చలలో ఇరాన్‌ వైఖరిపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కావాల్సినవి ఇచ్చేందుకు ఇరాన్‌ సిద్ధంగా లేదు. ఇది నన్ను నిరాశకు గురి చేసింది. ‘ మాకు కావలసినది ఇవ్వడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే నేను సంతోషంగా లేను’ అని ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా సైనిక దాడి చేయాలా లేదా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు
 
ట్రంప్‌ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇస్తాంబుల్‌ విమానాశ్రయం నుంచి టెహ్రాన్‌కి వెళ్లే విమానాలను రద్దు చేయడం, అమెరికా సైనిక బలగాలను ఇరాన్ చుట్టుపక్కల మోహరించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల అధికారి వోల్కర్ టర్క్ కూడా ‘ప్రాంతీయ యుద్ధం జరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మొత్తం మీద, జెనీవా చర్చలు ఒక కీలక మలుపులో నిలిచాయి. ఇరాన్‌ తన అణు కార్యక్రమంపై మాత్రమే చర్చలు జరగాలని పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం మిసైల్ ప్రోగ్రామ్, ప్రాంతీయ మిలిటెంట్‌ గ్రూపులకు మద్దతు తగ్గించాలని కోరుతోంది. ఈ విభేదాలు పరిష్కారం కాని పక్షంలో, ట్రంప్‌ చేసిన హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

జెనీవాలో అమెరికా–ఇరాన్ మధ్య జరిగిన తాజా అణు చర్చలు ప్రత్యక్షంగా కాకుండా మధ్యవర్తుల ద్వారా కొనసాగాయి. ఇరాన్‌ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పాల్గొనగా, అమెరికా వైపు నుంచి ట్రంప్‌ సన్నిహితుడు, అమెరికా ప్రత్యేక దౌత్య ప్రతినిధిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్, అలాగే ట్రంప్‌ అల్లుడు జారెడ్ కుష్నర్ ప్రతినిధులుగా హాజరయ్యారు. జారెడ్ కుష్నర్  ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ భర్త. ఈ చర్చలకు ఒమాన్‌ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. ఒమాన్‌ విదేశాంగ మంత్రి బద్ర్ అల్-బుసైదీ చర్చలను సమన్వయం చేస్తూ ‘పురోగతి సాధించాం’ అని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement