అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే? | Record Number of Americans Leave US Know The Reasons Here | Sakshi
Sakshi News home page

అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు!

Feb 27 2026 6:04 PM | Updated on Feb 27 2026 6:52 PM

Record Number of Americans Leave US Know The Reasons Here

అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా దేశానికి చాలా సంవత్సరాలుగా.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రజలు వలస వెళ్తున్నారు, వారిలో కొందరు అక్కడే స్థిరపడిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి & అనేక మార్పులు సంభవించాయి. మహా మాంద్యం తరువాత.. 2025లో దేశానికి వచ్చినవారి సంఖ్యకంటే, అమెరికా వీడి వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

2026లో పెరిగే అవకాశం
2023లో అమెరికా దేశానికి వలస వచ్చినవారి సంఖ్య 60 లక్షలు. ఈ సంఖ్య 2025 నాటికి 26 లక్షల నుంచి 27 లక్షలకు చేరుకుంది. కాగా ఈ సమయంలో (2025లో) యూఎస్ఏ విడిచి వెళ్లినవారు 1.5 లక్షలు కావడం గమనార్హం. 2026లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రజలు అమెరికా విడిచి వెళ్లడానికి ప్రధాన కారణాలు.. పెరుగుతున్న జీవన వ్యయం,  సామాజిక హింస, రాజకీయ అస్థిరత అని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పాలనలో దేశం విడిచి వెళ్తున్న అమెరికన్ల సంఖ్య పెరుగుదలను డొనాల్డ్ డాష్ అని పిలుస్తున్నారు.

విదేశాల్లో అమెరికన్లు
2025లో అమెరికా ప్రభుత్వం సుమారు 6.74 లక్షల మందిని దేశం నుంచి బహిష్కరించింది. కాగా మరో 22 లక్షలమంది దేశం విడిచి స్వచ్చందంగా బయటకు వెళ్లారు. కాగా కొన్ని గణాంకాల ప్రకారం.. ఇప్పటికే 40 లక్షల నుంచి 90 లక్షల మధ్య అమెరికన్లు విదేశాల్లో నివసిస్తున్నారు.

పోర్చుగల్‌లోని లిస్బన్‌లో అనేక మంది అమెరికన్లు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేస్తున్నారు. బాలి, కొలంబియా, థాయిలాండ్‌లలో ఇళ్ల ధరల పెరుగుదలకు కూడా అమెరికన్లు ఎక్కువ కావడం అనే తెలుస్తోంది. ఒక లక్ష మందికి పైగా యువ అమెరికన్లు తక్కువ ఖర్చుతో కూడిన డిగ్రీల కోసం విదేశాలలో చదువుతున్నారు. పదవీ విరమణ చేసినవారు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు, వృద్ధాప్య సంరక్షణ వంటి వాటికోసం మెక్సికోకు వెళుతున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది.

విద్యార్థులు సైతం
కెనడా, యూకే, మెక్సికో వంటి దేశాలు అమెరికన్లకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య గత ఏడాది 17 శాతం తగ్గింది. అదే సమయంలో యూరప్‌కు వెళ్లే అమెరికన్ విద్యార్థుల సంఖ్య 2011తో పోలిస్తే రెట్టింపైంది. యుకేలో మాత్రం ఈ సంఖ్య గత ఏడాది 14 శాతం పెరిగింది. ఒకప్పుడు అమెరికాకు ఎగబడి వెళ్లేవారు కూడా.. ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్తున్నారు.

1935 మహామాంద్యం సమయంలో అమెరికాకు వచ్చినవారి కంటే.. యూఎస్ వీడి వెళ్లిన వారిసంఖ్య ఎక్కువగా నమోదైంది. అలాంటి పరిస్థితి సుమారు 90ఏళ్ల తరువాత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement