ప్రస్తుతం యెమెన్‌లోని ప్రభుత్వ అనుకూల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా హోదైదా, మారిబ్ ప్రాంతాల్లో తమ బలగాలను మళ్లీ మోహరించారు హౌతీలు. హౌతీ నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాల్లో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు.
అదే సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలు తమ క్షిపణి సామర్థ్యాలను ఉపయోగించడానికి వ్యూహం రచిస్తున్నారు. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే హౌతీలు దాడులు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన పక్షంలో హౌతీలు ఇతర ఇరాన్ మిత్ర బలగాలతో (హిజ్బుల్లా వంటి) కలిసి ‘యూనిటీ ఆఫ్ ఫ్రంట్స్’ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, కొత్త దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన డ్రోన్లు సిద్ధం చేస్తున్నారు హౌతీలు. మొత్తంగా, యెమెన్‌లోని అంతర్గత యుద్ధానికి మాత్రమే కాకుండా, అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ భారీ స్థాయి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో హౌతీల నియంత్రణలో ఉన్న సనాలో భయంకరమైన నిశ్భబ్ద వాతావరణం అలుముకుంది.
ఇరాన్ ఆదేశాల కోసం ఎదురుచూపులు
ఇక హౌతీలు తమ యుద్ధ సన్నాహల్లో భాగంగా ఇరాన్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. హౌతీలకు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, మరియు ఆయుధాలు సరఫరా చేస్తుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇరాన్ మద్దతు వల్ల హౌతీలు యెమెన్‌లో మాత్రమే కాకుండా, సౌదీ అరేబియా మరియు రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై కూడా దాడులు చేయగలిగారు.
హౌతీల ప్రధాన లక్ష్యం యెమెన్ ప్రభుత్వాన్ని కూల్చడం మాత్రమే కాదు,. దానిని తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. వారు 2014లో సనా (యెమెన్ రాజధాని) ను స్వాధీనం చేసుకుని, అప్పటి అధ్యక్షుడు అబ్ద్రబ్బుహ్ మన్‌సూర్ హాదీని ఆ పదవి నుంచి దింపేశారు. ఆ సమయంలో వారు పార్లమెంట్‌ను రద్దు చేసి, తమ నియంత్రణలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ప్రస్తుతం కూడా అదే లక్ష్యంగా మెరుపు యుద్ధానికి వారు సన్నద్ధమవుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
యెమెన్‌లోని కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనపరచి, తమ ఆధిపత్యాన్ని స్థాపించడమే హౌతీల లక్ష్యంగా కనబడుతోంది. తిరుగుబాటు నుంచి రాజ్య నిర్మాణం వైపు మారి, తమను ఒక అధికారిక పాలక శక్తిగా చూపించుకోవాలనే ప్రయత్నం ముమ్మరం చేశారు. ప్రధానంగా ఇరాన్ మద్దతుతో, యెమెన్‌లోని రాజకీయ సమీకరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు హౌతీలు.


