ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్, తాలిబన్ల ఆఫ్ఘనిస్థాన్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆప్ఘన్‌పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లు పాకిస్తాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఖవాజా.. భారత్‌పై మరోసారి అక్కసును వెళ్లగక్కారు.
అయితే, ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ‘మా సహనం నశించింది. ఇప్పుడు మాకు.. మీకు మధ్య బహిరంగ యుద్ధమే’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో ప్రస్తుతం తాలిబన్‌లకు సంబంధాలు లేవన్నారు. మరోవైపు, ఖవాజా.. భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్‌పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయని ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో అన్నారు. భారతే.. తమపై ఆప్ఘన్లు దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. కానీ, భారత్ దానిని అంగీకరించరు. భారత్.. కాబూల్‌తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆప్ఘన్.. భారత్‌కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే, దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా, భారత్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి నుంచే ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’గా పేర్కొంది. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్‌లలో వైమానిక దాడులు జరిగాయని ఆప్ఘన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. పాక్‌పై చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయారని ఆఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. అయితే, ఇస్లామాబాద్ దీన్ని తోసిపుచ్చింది. ఘర్షణల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. ఇస్లామాబాద్ సైనికుల నిర్బంధంపై తాలిబన్లు చేసిన ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. ఆప్ఘన్ సైనికులే 133 మంది మరణించారని.. 200 మందికి పైగా గాయపడ్డారన్నారు. తొమ్మిది మంది సైనికులను నిర్బంధించినట్లు తెలిపారు. ఇటీవల తమపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్‌పై అఫ్గాన్ విరుచుకుపడింది.
డ్యూరాండ్ రేఖ వివాదం..
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య 2,611 కిలోమీటర్ల సరిహద్దు అయిన డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్థాన్ అధికారికంగా ఎప్పుడూ గుర్తించలేదు. పాకిస్తాన్ దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా ఉంది. ఈ క్రమంలో 2025 అక్టోబర్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు.


