ట్రంప్‌ సర్కార్‌కు మరో భారీ షాక్‌.. | US federal court Blocks donald trump Decision Over Migrants | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సర్కార్‌కు మరో భారీ షాక్‌..

Feb 26 2026 9:17 AM | Updated on Feb 26 2026 10:03 AM

US federal court Blocks donald trump Decision Over Migrants

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సుంకాల విషయంలో ఇప్పటికే ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు రాగా.. తాజాగా ఫెడరల్‌ కోర్టులో మరో షాక్‌ తగిలింది. అమెరికా నుంచి అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్‌ కోర్టు తప్పుబట్టింది. దీంతో, ట్రంప్‌ సర్కార్‌కు ఝలక్‌ తగిలింది.

వివరాల మేరకు.. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలసదారులను యూఎస్‌ నుంచి గ్వాటమాల, దక్షిణ సూడాన్‌, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో తరలింపు ఎదుర్కొంటున్న వలసదారులు.. ట్రంప్‌ చర్యలపై కోర్టులను ఆశ్రయించారు. పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కోర్టులో దావా వేయగా, తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ఫెడరల్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా.. అక్రమ వలసదారులకు ముందస్తు నోటీసులు, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు ట్రంప్‌ యంత్రాంగానికి  15 రోజుల పాటు సమయం ఇచ్చింది. ఈ క్రమంలో ట్రంప్‌ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చూస్తూ మసాచుసెట్స్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి బ్రియాన్‌ మర్ఫీ ఈ మేరకు తీర్పునిచ్చారు. 

యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు
అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల (టారిఫ్స్)కు బ్రేక్ పడింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయితే, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎలాగైనా 15 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. టారిఫ్‌లను విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై పూర్తి అధికారం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకూ వసూలు చేసిన వందల బిలియన్‌ డాలర్ల సుంకాలను.. దిగుమతి దారులకు తిరిగి ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది.

ట్రంప్ అసంతృప్తి..
గ్లోబల్ టారిఫ్ విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను తీవ్ర నిరాశ‌ప‌రిచింద‌ని ఆయ‌న అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్ర‌భావానికి లోన‌య్యార‌ని ట్రంప్ ఆరోపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement