అమెరికా.. మంచుమయం  | Northeast United States has dropped piles of snow from Maryland to Maine | Sakshi
Sakshi News home page

అమెరికా.. మంచుమయం 

Feb 26 2026 6:19 AM | Updated on Feb 26 2026 12:13 PM

Northeast United States has dropped piles of snow from Maryland to Maine

న్యూయార్క్‌: ఈశాన్య అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. వీధులు, రోడ్లపై మంచు పేరుకుపోవడంతో బుధవారం జనం ఇబ్బందులకు గురయ్యారు. మేరీలాండ్‌ రాష్ట్రం నుంచి మెయినే రాష్ట్రం దాకా ఎక్కడ చూసినా మంచు కనిపిస్తోంది. 2.5 సెంటీమీటర్ల నుంచి 7.6 సెంటీమీటర్ల దాకా మందంగా మంచు పేరుకున్నట్లు జాతీయ వాతావరణ సేవల విభాగం వెల్లడించింది. ప్రధానంగా నగరాల్లో మంచు కారణంగా విధులకు ఆలస్యంగా హాజరు కావాల్సి వస్తోందని జనం చెబుతున్నారు. 

పిల్లలు కూడా పాఠశాలలకు ఆలస్యంగా వెళ్తున్నారు. మంచును తొలగించడానికి చాలా శ్రమించాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం న్యూయార్క్‌ సిటీలో 65 మిలియన్‌ కిలోల ఉప్పును రోడ్లపై చల్లినట్లు మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ ప్రకటించారు. మంచును తొలగించి, రహదారులను రాకపోకలకు అనువుగా మార్చడానికి 3,500 మందిని రంగంలోకి దించామని చెప్పారు. వీరికి గంటకు 30 డాలర్ల చెల్లిస్తున్నారు. మంచు వల్ల దివ్యాంగులకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. రహదారులపై స్ట్రోలర్లు, రొలేటర్, వాకర్‌ లాంటివి ప్రయాణించే పరిస్థితి లేదు. జాగ్రత్తగా నడిచివెళ్లాల్సి వస్తోంది.

 అలా నడిచే వీలు లేని దివ్యాంగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతోంది. విద్యుత్‌ లైన్లు దెబ్బతింటున్నాయి మంచు సంబంధిత ఘటనలో కనీసం ఒకరు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. రోడ్‌ ఐలాండ్‌లో 0.9 మీటర్ల మేర మంచు పేరుకుపోయింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడడం 1978 తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మసాచుసెట్స్, న్యూజెర్సీ, డెలావెర్, రోడ్‌ ఐలాండ్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement